DailyDose

నీట్ యూజీ-2023 ఏపీ మెరిట్ జాబితా విడుదల

నీట్ యూజీ-2023 ఏపీ మెరిట్ జాబితా విడుదల

నీట్‌ యూజీ-2023 రాష్ట్ర ప్రాధాన్య క్రమం విడుదలైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాధాన్య క్రమాన్ని విజయవాడలోని వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఈ ఏడాది మే 7న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష నిర్వహించి జూన్‌ 13న ఫలితాలు విడుదల చేసింది. 20,38,596 మంది ప్రవేశ పరీక్ష రాయగా 11,45,976 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 69,690 మంది అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 68,578 మంది పరీక్ష రాశారు. వారిలో 42,836 మంది అర్హత సాధించారు. అన్‌ రిజర్వుడు/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి సంబంధించి 720-137 మధ్య అర్హత మార్కులు ప్రకటించగా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 136-107, అన్‌ రిజర్వుడు/ఈడబ్ల్యూఎస్‌ వికలాంగుల కేటగిరీలో 136-121, మిగిలిన రిజర్వుడు కేటగిరీ వికలాంగులకు 120-107 మధ్య మార్కులు ఉన్న వారిని అర్హులుగా ప్రకటించారు. ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తుల నోటిఫికేషన్‌ త్వరలో విడుదల చేస్తామని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి జూన్ 30న తెలిపారు.