Devotional

సత్యదేవుని వద్ద భక్తుల కష్టాలు

సత్యదేవుని వద్ద భక్తుల కష్టాలు

సత్యదేవుని సన్నిధిలో వివాహాలు చేసుకునే వారికి కొన్ని నెలలుగా దేవస్థానం అధికారులు తీసుకున్న పలు నిర్ణయాల కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పేద, మద్య తరగతి కుటుంబాల వారు కొండపై భోజనాలు కొనుగోలు చేసి, పెళ్లి చేసుకోవాలంటే ఆర్థిక భారం అధికమవుతుంది. అల్పాహారం, భోజనాలు ఇంటి నుంచి తెచ్చుకోవటానికి రూ.వేలల్లో రుసుము చెల్లించాల్సి వస్తోంది.

అన్నవరం కొండపైన రెండ్రోజుల కిందట వివాహ వేడుకకు కాకినాడకు చెందిన పెళ్లిబృందం ఇంటి వద్ద భోజనాలు సిద్ధం చేసుకుని కొండపైకి తీసుకువెళ్తుండగా ఘాట్‌ రోడ్డు టోల్‌గేటు వద్ద సిబ్బంది అడ్డుకున్నారు. రూ.6 వేలు రుసుము చెల్లించాలని ఒత్తిడి చేశారు. పిల్లల కోసం అతి తక్కువ భోజనాలు తీసుకెళుతున్నామని చెప్పినా ససేమిరా అన్నారు. ఇంత భారీగా రుసుము వసూలు చేస్తారా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది, భక్తులకు మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో భక్తులు వారు తెచ్చుకున్న ఆహారాన్ని టోల్‌గేటు వద్దే పడేసి వెళ్లారు.
అనకాపల్లికి చెందిన ఓ పెళ్లి బృందం అతిథుల కోసం కొండ దిగువన రూ.3,200తో అల్పాహారం కొనుక్కొని తీసుకెళ్తుండగా.. టోల్‌గేటు వద్ద సిబ్బంది అడ్డుకున్నారు. కొండపైకి తీసుకెళ్లాలంటే రూ.3వేలు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆర్థిక భారంతో చివరికి వారు అల్పాహారం తీసుకువెళ్లలేదు.

రాష్ట్రంలోని పలు ప్రధాన దేవస్థానాల్లో వివాహాలు జరుగుతుంటాయి. అయితే ఎక్కడా లేని నిబంధనను అన్నవరంలోనే అమలు చేస్తుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్వారకాతిరుమల, శ్రీశైలం, తదితర దేవస్థానాల్లో వివాహాలు చేసుకున్నవారు బయట నుంచి ఆహారం తీసుకెళ్తే ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. కానీ అన్నవరంలో మాత్రం రూ.6 వేలు వసూలు చేస్తూ భక్తులపై తీవ్ర ఆర్ధిక భారం మోపుతున్నారు. అధికారుల తీరు ప్రైవేటు వ్యాపారులను ప్రోత్సహించే విధంగా ఉందని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. కొండపై రెండు క్యాంటీన్లు ఉన్నాయి. పెళ్లి బృందాలు వీరివద్ద భోజనాలు బుక్‌ చేసుకోవచ్చు. బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఇలా బయట నుంచి తీసుకువస్తే గతంలో రూ.3వేలు రుసుము చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ రుసుమును రూ.6 వేలకు పెంచారు. భక్తులు సమర్పించే కానుకలు, పూజలు, ఇతర వ్యాపార హక్కుల ద్వారా వచ్చే ఆదాయంలోనే పారిశుద్ధ్య నిర్వహణకు ఖర్చు చేయాలి. కానీ అధిక ఆదాయం కోసం పారిశుద్ధ్య నిర్వహణను సాకుగా చూపి అదనంగా వసూలు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఈ విషయాలపై ఆలయ ఈవో ఆజాద్‌ను వివరణ కోరగా టోల్‌గేటు వద్ద భక్తులకు, ఉద్యోగులకు జరిగిన వాగ్వాదం, భోజనాన్ని పడేయడంపై గాని, ఇతర ఇబ్బందులపై భక్తులెవరూ మాకు ఫిర్యాదు చేయలేదన్నారు.