Kids

నత్తికి కారణాలు ఇవి. ఇలా నివారించవచ్చు.

నత్తికి కారణాలు ఇవి. ఇలా నివారించవచ్చు.

ఇంతకీ పిల్లలకు నత్తి ఎందుకొస్తుంది? నిజానికి వీళ్లు తెలివి గలవారు. కొన్నిసార్లు ఆలోచనల కన్నా మాట్లాడటానికి అవసరమైన కండర కదలికల సమన్వయ వేగం తక్కువగా ఉండొచ్చు. అంటే మాట్లాడే వేగం కన్నా ఆలోచనల వేగం పెరిగినప్పుడు పదాలు, వాక్యాలు నత్తి నత్తిగా వస్తుంటాయి. దీంతో గాబరా, ఆదుర్దాకు లోనవుతారు. సమస్య తీవ్రమవుతూ వస్తుంటుంది. నత్తికి కొంతవరకు జన్యువులూ దోహదం చేయొచ్చు. కొన్ని కుటుంబాల్లో ఎక్కువ మందికి నత్తి ఉండటం చూస్తుంటాం. ఇది ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడు మరింత ఎక్కువవుతుంది. కొందరికి అనుకరణతోనూ నత్తి అంటుకోవచ్చు.

నత్తిని ఉన్నట్టుండి తగ్గించే మందేదీ లేదు. కానీ వీరికి స్పీచ్‌ థెరపీ బాగా ఉపయోగ పడుతుంది. ఈ చికిత్సతో పాటు ఇంట్లో పిల్లలకు మాట్లాడటంలో కొంత శిక్షణ ఇస్తే మరింత ప్రయోజనం కనిపిస్తుంది.

నోటి నుంచి మాటలు వెలువడటానికి ముందే మెదడులో వాక్యాలు ఏర్పడతాయి. కాబట్టి నెమ్మదిగా మాట్లాడేలా అలవాటు చేయటం ముఖ్యం. రాగం తీస్తున్నట్టు మాట్లాడేలా చూడటమూ మంచిదే. నత్తి ఎక్కువగా ఉన్నవారు కూడా పాడేటప్పుడు తడబడరు. అందువల్ల పాటలు పాడటం, గాత్ర సంగీతం నేర్పించాలి.

కొందరు నత్తిగా మాట్లాడుతున్నప్పుడు పిడికిలి బిగించటం, కళ్లు మిటకరించటం, కండరాలు బిగించటం వంటివీ చేస్తుంటారు. అందుకే ఆందోళనతో నత్తి వస్తుందని భావిస్తుంటారు. కానీ ఆందోళన తగ్గించే మందులతో ఎలాంటి ఉపయోగమూ ఉండదని బయటపడింది.

నత్తికి తొలిదశలోనే చికిత్స చేయటం మంచిది. లేకపోతే ఆత్మ విశ్వాసం కొరవడే ప్రమాదముంది. నలుగురితో కలవలేక చదువులో వెనకబడొచ్చు. ఉద్యోగాల్లో పూర్తి స్థాయిలో రాణించకపోవచ్చు.