Politics

భాజపాకు ఓటు వేయవద్దు: సిద్ధరామయ్య

భాజపాకు ఓటు వేయవద్దు: సిద్ధరామయ్య

కేంద్ర ప్రభుత్వానికి పేదలంటేనే గిట్టదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. అందుకే వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు (BJP) ఒక్క ఓటు కూడా వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భాజపా ‘నీచమైన’ పార్టీ అని తీవ్రంగా విమర్శించిన సిద్ధరామయ్య.. కేంద్ర ప్రభుత్వానికి మానవత్వమే లేదన్నారు. అందుకే కర్ణాటక ప్రభుత్వం అన్న భాగ్య పథకం కింద ఒక్కో లబ్ధిదారుడి కోసం అదనంగా ఐదు కేజీల బియ్యం అడిగితే తిరస్కరించిందని ఆరోపించారు. ‘నేను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడు కేజీల బియ్యం పంపిణీ చేశా. భాజపా అధికారంలోకి వచ్చిన తరువాత దాన్ని నాలుగు, ఐదు కేజీలకు తీసుకొచ్చింది. ఇటీవల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో మరో ఐదు కేజీలు ఇస్తానని నేను వాగ్దానం చేశాను’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.