Agriculture

టమాటా ధరల నియంత్రణకు చర్యలు

టమాటా ధరల నియంత్రణకు చర్యలు

ధరలేక సతమతమవుతున్న టమాటా రైతులకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం డిమాండ్‌కు మించి టమాటా పంట మార్కెట్లకు వస్తుండటంతో గత కొద్దిరోజులుగా ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు సీఎం యాప్‌ ద్వారా ధరల హెచ్చుతగ్గులను నిరంతరం పరిశీలిస్తూ కిలో రూ. 7 కంటే తక్కువ ధర పలుకుతున్న మార్కె­ట్లలో జోక్యం చేసుకుంటూ ధరలు నిలకడగా ఉండేలా చూస్తోంది. ఇటీవల టమాటా ధరలు చుక్కలనంటి.. కిలో రూ. 250కు పైగా పలికిన దశలో వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జూన్‌ 28 నుంచి మార్కెట్‌లో జోక్యం చేసుకొని రైతుల నుంచి పెద్ద ఎత్తున టమాటాలను సేకరించి కిలో రూ. 50కే రైతు బజార్లలో విక్రయించింది. ఇలా దాదాపు రెండు నెలల పాటు రైతుల నుంచి సగటున కిలో రూ. 107.50 చొప్పున రూ.14.66 కోట్ల విలువైన 1,364.55 టన్నుల టమాటాలను సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 105 రైతుబజార్ల ద్వారా సబ్సిడీపై వినియోగదారులకు అందించింది.