Business

BMW కొత్త కారు విడుదల. ధర ₹76లక్షలు-వాణిజ్యం

BMW కొత్త కారు విడుదల. ధర ₹76లక్షలు-వాణిజ్యం

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ తొలిసారి 20,000 మార్క్‌ను తాకడం విశేషం. దిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడం సూచీల్లో సానుకూలతలు నింపింది. మరోవైపు ఈ సమావేశాల్లో పలు కీలక ఒప్పందాలపై ఏకాభిప్రాయం కుదరడం కూడా మార్కెట్లలో ఉత్సాహం నింపింది. జీవ ఇంధన కూటమి, ‘ఇండియా-మిడిల్‌ ఈస్ట్‌-యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌’ ఏర్పాటుపై ప్రకటన వంటి సానుకూల అంశాలు మార్కెట్లకు కలిసొచ్చాయి. దేశీయంగా వివిధ రంగాల్లో ఉన్న సానుకూలతలు కూడా మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ఫలితంగా వరుసగా ఏడోరోజూ సూచీల్లో లాభాలు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా మన సూచీలు అంతర్జాతీయ సూచీలతో సంబంధం లేకుండా రాణిస్తుండడం విశేషం.

* BMW 630i M Sport Signature | బీఎండబ్ల్యూ భారత్‌లో మరో కారును విడుదల చేసింది. 630ఐ ఎం స్పోర్ట్‌ సిగ్నేచర్‌ (BMW 630i M Sport Signature) పేరిట వస్తున్న ఈ కారును దేశీయంగానే తయారు చేశారు. చెన్నైలోని తయారీ కేంద్రంలో దీన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దీని ధర రూ.75.90 లక్షలు. కేవలం పెట్రోల్‌ వేరియంట్‌ మాత్రమే అందుబాటులో ఉంది.

* రాబోయే ఆదాయాన్ని అంచ‌నా వేసి ముంద‌స్తుగా చెల్లించే పన్నునే అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు. ఈ ముందస్తు ప‌న్నును ఒకే సారి సంవ‌త్సరం చివ‌ర‌ కాకుండా ద‌శ‌ల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. అంచ‌నా వేసిన ఆదాయంపై చెల్లించాల్సిన ఆదాయ‌ప‌న్ను రూ.10వేలు లేదా అంత కంటే ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. ఉద్యోగులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, ఇలా ప్రతి ఒక్కరూ చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల‌ విషయానికి వస్తే.. యాజమాన్యాలు వేతనం నుంచి ‘మూలం వద్ద పన్ను’ను డిడక్ట్‌ చేస్తాయి గనక ప్రత్యేకంగా వారు అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఒకవేళ వేతనం కాకుండా ఇతర ఆదాయ మార్గాలు ఉన్నట్లయితే మాత్రం నిబంధనల ప్రకారం ముందస్తుగా పన్ను చెల్లించాల్సిందే. ఈ నేపథ్యంలో ఎవరైనా ఉద్యోగం మారినప్పుడు కొత్త కంపెనీలో.. గత వేతన వివరాలను అందించాల్సి ఉంటుంది. తద్వారా టీడీఎస్‌ను వారు నిబంధనల ప్రకారం సర్దుబాటు చేస్తారు.

* పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ సహ-సృష్టికర్త డెన్నిస్ ఆస్టిన్ (76) ఇక లేరు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ 1న కన్ను మూశారు. కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్‌లోని తన ఇంటిలో తుదిశ్వాస విడిచారని మైఖేల్ ఆస్టిన్ తెలిపారు. దీంతో ఆయన మృతిపై పలువురు టెక్‌ దిగ్గజాలు సంతాపం ప్రకటించారు.

* క్రెడిట్ సూయిస్ కేసులో విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు భారీ షాక్‌ తగిలింది.క్రెడిట్ సూయిస్ బకాయిల చెల్లింపు విషయంలో స్పైస్‌జెట్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.సుప్రీం ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం హెచ్చరించింది. ఒప్పందం ప్రకారం మిలియన్‌ డాలర్ల బకాయిలను చెల్లింపులో స్పైస్‌జెట్‌ కావాలనే తాత్సారం చేస్తోందని, ఈ నేపథ్యంలో సింగ్ ,స్పైస్‌జెట్‌లపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ ఈ ఏడాది మార్చిలో క్రెడిట్ సూయిస్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది.