DailyDose

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిర్మాత అరెస్ట్-నేరవార్తలు

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిర్మాత అరెస్ట్-నేరవార్తలు

* దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor scam) కేసులో ఈడీ నోటీసులపై భారాస ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నిజామాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ నోటీసులను పట్టించుకోవాల్సిన అవసరంలేదని కొట్టిపారేశారు.‘‘ నాకు మోదీ నోటీసు వచ్చింది. రాజకీయ కక్షసాధింపులో భాగంగా వచ్చిన నోటీసు అది. నోటీసును పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నోటీసును పార్టీ లీగల్‌ టీమ్‌కు ఇచ్చాం. లీగల్‌ టీమ్‌ సలహా ప్రకారం ముందుకెళ్తాం. ఇది ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉంది. టీవీ సీరియల్‌లా దీన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికలు వచ్చాయి.. మళ్లీ ఒక ఎపిసోడ్‌ రిలీజ్‌ చేస్తున్నారు. నోటీసును సీరియస్‌గా తీసుకోవద్దు. ఈ విచారణ ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. గతంలో 2జీ విచారణ కూడా చాలా కాలం సాగింది. తెలంగాణ ప్రజలు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోరు’’ అని కవిత అన్నారు.

* పసిపిల్లలు బాగోగులు చూడటమే ఆమె వృత్తి. కానీ దానికి న్యాయం చేయకుండా ఆమె చిన్నారులతో నిర్దయగా వ్యవహరించింది. వారిని చెప్పులతో కొట్టడం, చేతులు కాళ్లు తాడుతో బిగించి, మంచానికి కట్టేయడం వంటి దారుణాలకు ఒడిగట్టింది. ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని ఆగ్రా(Agra)లో ప్రభుత్వ పరిధిలోని జువెనైల్‌ హోం(juvenile home) రాజకీయ బాల్‌ గృహ్‌కు చెందిన అధికారిణి ఈ ఆగడాలకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఆమె తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

* మాదాపూర్ డ్రగ్స్‌ కేసులో మరో ఎనిమిది మంది నిందితులను నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నైజీరియన్లతో పాటు మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. వీళ్లలో ఓ సినీ నిర్మాత ఉన్నట్లు తెలుస్తోంది. వీరివద్ద నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల కొకైన్‌, 24 ఎక్టసీ పిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించనున్నారు. గత నెల 31న నార్కోటిక్ విభాగం పోలీసులు.. గుడిమల్కాపూర్, మాదాపూర్‌లో దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బాలాజీ, సినీ ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డి, మురళిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు 18 మందికి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించి నిఘా పెట్టారు. ఈ క్రమంలో ముగ్గురు నైజీరియన్లు, ఐదుగురు వినియోగదారులు పట్టుబడ్డారు. ప్రస్తుతం బాలాజీ, వెంకటరత్నారెడ్డి, మురళిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మూడు రోజులుగా వీళ్లను ప్రశ్నిస్తున్న పోలీసులు.. వారు చెప్పే సమాచారం ఆధారంగా మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది.

* లంచం తీసుకున్న కేసులో అరెస్టయిన రైల్వే సీనియర్‌ అధికారి నుంచి సీబీఐ బుధవారం రూ.2.61 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. సీబీఐ అధికారుల కథనం ప్రకారం… ఈశాన్య రైల్వే (గోరఖ్‌పుర్‌) ప్రిన్సిపల్‌ చీఫ్‌ మెటీరియల్‌ అధికారి కేసీ జోషి మంగళవారం సాయంత్రం ఓ గుత్తేదారు నుంచి రూ.3 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు అరెస్టు చేశారు. రైల్వేకు అవసరమైన ఉత్పత్తులు, వస్తువుల రవాణా కోసం గుత్తేదారు 3 లారీలను కిరాయికి తిప్పుతున్నారు. ఇందుకోసం ఆయన ఒక్కో లారీకి నెలకు రూ.80 వేల చొప్పున పొందేలా గతంలోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. తనకు రూ.7 లక్షలు లంచం ఇవ్వాలని లేకపోతే ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తానంటూ… గుత్తేదారును కేసీ జోషి బెదించారు. బాధితుడు సీబీఐ అధికారులను ఆశ్రయించారు. ఈ అంశంపై దృష్టిపెట్టిన అధికారులు… గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటున్న కేసీ జోషిని వల పన్ని పట్టుకున్నారు.