Politics

విదేశాల్లోనూ ముఖ్య మంత్రి కుటుంబానికి భద్రత

విదేశాల్లోనూ ముఖ్య మంత్రి కుటుంబానికి భద్రత

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వారి భార్య/భర్త, పిల్లలు, తల్లిదండ్రులు ఎక్కడున్నా సరే వారికి అత్యంత సమీపం నుంచి భద్రత (ప్రాక్స్‌మేట్‌ సెక్యూరిటీ) కల్పించేందుకు వీలుగా ప్రత్యేక భద్రతా గ్రూపు (ఎస్‌ఎస్‌జీ) బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ముఖ్యమంత్రి, వారి సమీప కుటుంబ సభ్యులైన భార్య/భర్త, పిల్లలు, తల్లిదండ్రులకు విదేశాల్లో సైతం ప్రభుత్వం రక్షణ కల్పించనుంది. ఈ మేరకు అవసరమైన భద్రతపరమైన సేవలు అందించేందుకు ఎస్‌ఎస్‌జీలోని సభ్యులు కట్టుబడి ఉండాలని బిల్లులో పేర్కొంది. ‘‘ముఖ్యమంత్రి, వారి భార్య/భర్త, పిల్లలు, తల్లిదండ్రులకు ఇంట్లోనూ, ప్రయాణ సమయంలోనూ, ఎక్కడైనా బస చేసినప్పుడు, ఎక్కడికైనా వెళ్లినప్పుడు, వేడుకులు, కార్యక్రమాలకు హాజరైనప్పుడు ఇలా అన్ని సందర్భాల్లోనూ ఎస్‌ఎస్‌జీ రక్షణ కల్పిస్తుంది. వాహనాల్లో, రైల్లో, విమానాల్లో, నౌకల్లో ప్రయాణించినప్పుడు, కాలినడకన వెళ్లినప్పుడు కూడా ఈ ప్రత్యేక బృందం వారి వెన్నంటే ఉంటూ వారి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. భద్రతాపరంగా అవసరమైన కట్టడి నిబంధనలనూ అమలు చేస్తుంది. వారి సమీపంలోకి ఎవరైనా రావాలన్నా నియంత్రిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ నిఘా విభాగం ఈ ప్రత్యేక భద్రతా గ్రూపు (ఎస్‌ఎస్‌జీ) బాధ్యతలను చూస్తుంది. దీనిలో పనిచేయటానికి పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లోని సిబ్బందిని డిప్యుటేషన్‌ ప్రాతిపదికన తీసుకుంటారు. వారికి ప్రత్యేకంగా శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. ఎస్‌ఎస్‌జీ గ్రూపులోని సభ్యులు విధి నిర్వహణలో భాగంగా చేపట్టే పనులకు న్యాయపరమైన రక్షణ (లీగల్‌ ఇమ్యూనిటీ) ఉంటుంది’’ అని రాష్ట్ర ప్రభుత్వం బిల్లులో పొందుపరిచింది.