ScienceAndTech

ఆర్టీసీ “గమ్యం” యాప్‌తో లైటు చూపిస్తే బస్సు ఆగుతుంది

ఆర్టీసీ “గమ్యం” యాప్‌తో లైటు చూపిస్తే బస్సు ఆగుతుంది

సాధారణ బస్సులకు కూడా సాంకేతికతను అనుసంధానం చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. సామాన్యులు ప్రయాణించే పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీల రాకపోకల సమాచారాన్ని ఉన్నచోటు నుంచే తెలుసుకునే సదుపాయాన్ని ప్రారంభించింది. ట్రాక్‌ చేసేలా ఈ బస్సులను ‘గమ్యం’ యాప్‌తో అనుసంధానం చేయాలని అన్ని బస్‌డిపోలకు ఆదేశాలు పంపించింది. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే ఈ బస్సులకు ప్రైవేటు ఆటోలు, జీపుల నుంచి పోటీ అధికం. ప్రయాణికులు కోరుకున్నచోట ప్రైవేటు వాహనాలను ఆపుతున్నారు. ఆర్టీసీలో అలాంటి పరిస్థితి ఉండదు. పైగా ఈ బస్సులు ఎప్పుడు వస్తాయో సమాచారం పక్కాగా ఉండదు. ‘గమ్యం’ యాప్‌తో ఈ బస్సుల్ని అనుసంధానిస్తే ఏ బస్సు ఎప్పుడు వస్తుంది? ఎంతదూరంలో ఉందన్న సమాచారం తెలిసిపోతుంది. యాప్‌లో రూట్లవారీగా షెడ్యూల్‌ బస్సులు ఎన్ని, రన్నింగ్‌లో ఉన్న బస్సులేవి.. ఎంత సమయానికి వస్తాయో తెలుసుకోవచ్చు. బస్టాప్‌లో కాకుండా రోడ్డుమార్గంలో మధ్యలో ఎక్కడైనా ఉన్నప్పుడు యాప్‌లో ‘ఫ్లాగ్‌ ఏ బస్‌’ ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే ఫోన్‌ స్క్రీన్‌ ఫ్లోరోసిస్‌ లైట్‌గా మారిపోతుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుంది. ఈ లైట్‌ కనిపించినప్పుడు బస్సును ఆపి ప్రయాణికుల్ని ఎక్కించుకునేలా డ్రైవర్లకు ఆర్టీసీ అవగాహన కల్పిస్తోంది.