Business

దుమ్మురేపిన మారుతీ సుజుకీ అమ్మకాలు-వాణిజ్యం

దుమ్మురేపిన మారుతీ సుజుకీ అమ్మకాలు-వాణిజ్యం

* ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సెప్టెంబరు నెల విక్రయాల గణాంకాలను వెల్లడించింది. 1,81,343 యూనిట్ల కార్ల అమ్మకాలతో 3 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో అర్థ వార్షిక విక్రయాల్లో మొదటి సారి మిలియన్‌ యూనిట్ల మార్కును అధిగమించి కీలక మైలురాయిని చేరుకుంది. ఇక, యుటిలిటీ వాహన అమ్మకాల్లో గతేడాదితో పోలిస్తే 2.8 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ ముగిసే నాటికి మొత్తం వాహనాల్లో 10,50,085 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ ముగిసే నాటికి ప్యాసింజర్ వెహికల్ విక్రయాల్లో మొదటిసారిగా 3 మిలియన్ మార్క్‌ను చేరుకుంది. దేశీయ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 1,58,832 యూనిట్ల నుంచి 1,54,903 యూనిట్లకు పెరిగాయి. దీంతో ఈ విభాగంలో 2.5 శాతం వృద్ధి నమోదైంది. ఆల్టో, ఎస్‌-ప్రెసో వంటి చిన్న కార్ల విభాగంలో ఏడాది ప్రాతిపదికన అమ్మకాలు 22,162 నుంచి 12,209 యూనిట్లకు తగ్గాయి. బ్యాలెనో, సెలోరియో, డిజైర్‌, ఇగ్నిస్‌, స్విఫ్ట్‌ వంటి కంపాక్ట్‌ కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. 72,176 యూనిట్ల నుంచి 68,552 యూనిట్లకు చేరాయి. బ్రెజా, గ్రాండ్‌ విటారా, జిమ్నీ, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌6 వంటి యుటిలిటీ వెహికల్స్‌ విభాగంలో విక్రయాలు 59,271 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబరు ముగిసే సమయంలో 21,403 యూనిట్లగా ఉన్న వాహన ఎగుమతులు ఈ ఏడాది అదే సమయానికి 22,511 యూనిట్లకు పెరిగాయి.

* సెప్టెంబరులో వస్తు, సేవల పన్ను వసూళ్లు 10% పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు చేరాయి. 2022 సెప్టెంబరులో ఇవి రూ.1.47 లక్షల కోట్లుగా ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సెప్టెంబరులో స్థూలంగా జీఎస్‌టీ వసూళ్లు రూ.1,62,712 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో కేంద్ర జీఎస్‌టీ రూ.29,818 కోట్లు, రాష్ట్రాల జీఎస్‌టీ రూ.37,657 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.83,623 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.41,145 కోట్లతో కలిపి), సెస్సు రూ.11,613 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.881 కోట్లతో కలిపి)గా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు జీఎస్‌టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు దాటడం విశేషం. ఈ ఏడాది ప్రథమార్ధంలో రూ.9,92,508 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన 11 శాతం వృద్ధి నమోదైంది. ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత నెల వసూళ్లలో ఐజీఎస్‌టీ (IGST) నుంచి కేంద్రం రూ.33,736 కోట్లు సీజీఎస్‌టీ, రూ.27,578 కోట్లు ఎస్‌జీఎస్‌టీ (SGST) కింద సర్దుబాటు చేసింది. ఫలితంగా గత నెలలో కేంద్ర ప్రభుత్వ సీజీఎస్‌టీ (CGST) ఆదాయం రూ.63,555 కోట్లు, రాష్ట్రాల ఎస్‌జీఎస్‌టీ (SGST) ఆదాయం రూ.65,235 కోట్లుగా నమోదైంది.

* ‘ఎక్స్‌’ (ఒకప్పటి ట్విటర్‌) పై ఆ సంస్థ సీఈఓ లిండా యాకారినో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎక్స్‌’ తన రోజువారీ యాక్టివ్‌ యూజర్లను కోల్పోతోందని తెలిపారు. ఇటీవల వోక్స్ మీడియా కోడ్ 2023 ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె ఎక్స్‌ కీలక గణాంకాలను పంచుకున్నారు. ‘ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేయటానికి ముందే ట్విటర్‌ (ప్రస్తుతం ‘ఎక్స్‌’)11.6 శాతం యూజర్లను కోల్పోయింది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌లో 225 మిలియన్ల రోజువారీ యాక్టివ్‌ యూజర్లు, 550 మిలియన్ నెలవారీ యాక్టివ్ యూజర్లు మాత్రమే ఉన్నారు. 50వేల కమ్యూనిటీలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌ నుంచి వీరి సంఖ్య మరింత పెరిగింది’ అని యాకారినో తెలిపారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా వచ్చే ఏడాది నాటికి నాటికి ‘ఎక్స్‌’ లాభాల బాట పట్టనుందని అమె ఆశాభావం వ్యక్తం చేశారు.

* టాటా మోటార్స్‌ యాజమాన్యంలోని జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ 2030 నాటికి ఎనిమిది బ్యాటరీ ఆధారిత విద్యుత్‌ వాహనాలను తీసుకొస్తామని ప్రకటించింది. ప్రస్తుతం జేఎల్‌ఆర్‌.. జాగ్వార్‌ ఐ-పేస్‌ అనే ఈవీని మాత్రమే భారత్‌లో విక్రయిస్తోంది. అలాగే రేంజ్‌రోవర్‌ విద్యుత్‌ వాహనానికి వచ్చే ఏడాది నుంచి ఆర్డర్లు తీసుకుంటామని తెలిపింది. 2025లో వినియోగదారులకు అందిస్తామని కంపెనీ ‘చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌’ లెన్నార్డ్‌ హూర్నిక్‌ తెలిపారు.

* దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్లపై అదనపు భారం పడింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌పై రెండు నెలలుగా తగ్గుతూ వచ్చిన ధర ఈ సారి మాత్రం (Commercial LPG cylinder) ₹209 పెరిగింది. అంతకుముందు ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో దాదాపు రూ.250 మేర తగ్గాయి. ప్రతినెల చమురు సంస్థలు చేసే ధరల సవరణలో భాగంగా వీటిని పెంచాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,731కు పెరిగింది. అంతకుముందు ఇది రూ.1522గా ఉంది. చెన్నైలో రూ.1898, కోల్‌కతాలో రూ.1839, ముంబయిలో రూ.1684కు చేరింది. కొత్త ధర నేటి నుంచే అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి.

* దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు నిర్వహించే డీమ్యాట్ ఖాతా దారులు.. తమ ఖాతాలకు నామినీలను నామినేట్ చేయాలని స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఆదేశించింది. ఇంతకుముందు సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసినా.. మళ్లీ డిసెంబర్ వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. షేర్లు కలిగి ఉ్న వారు పాన్, నామినీ నామినేషన్, బ్యాంక్ ఖాతా వివరాలు తెలియజేయడానికి డిసెంబర్ నెలాఖరు వరకూ గడువు పొడిగించింది.

* పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలో ముఖ్యాంశాలు….ఇండియన్ పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంపై 6.7 శాతం వడ్డీ లభిస్తుంది.
మీరు ప్రతినెల కనీసం రూ.100 మదుపు చేయొచ్చు. ప్రతి నెలా వందకు పది రెట్లు పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ట పరిమితి లేనేలేదు.

* దేశంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. దీంతో ఉద్యోగులు ఆఫీసుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఓ ఆసక్తికర నివేదికను విడుదల చేసింది. ప్రభుత్వం ఓ వైపు పన్నులు పెంచకపోవడం, మరోవైపు ఉద్యోగులు ఆఫీసులకు వస్తున్న నేపథ్యంలో సిగరెట్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సిగరెట్ల డిమాండ్‌ 7 నుంచి 9 శాతం పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. సిగరెట్ల డిమాండ్‌ పెరిగితే అందుకు అనుగుణంగా అమ్మకాలు కూడా పెరగనున్నాయి.