DailyDose

ఐదేళ్లలో ఎనిమిది కొలువులు

ఐదేళ్లలో ఎనిమిది కొలువులు

ఎలాగైనా ఎస్సై ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.. పట్టుదలతో శ్రమించాడు.. ఈ క్రమంలో ఏడు ఇతర కొలువులు వరించినా సంతృప్తి చెందలేదు. తన ప్రయత్నాలను ఆపలేదు. చివరికి ఎనిమిదో సారి ఎస్సై కొలువు కొట్టి, అనుకున్నది సాధించాడు గరివిడి మండలం ఏనుగువలస గ్రామానికి చెందిన వెంపడాపు ఈశ్వరరావు. రెండు రోజుల కిందట విడుదలైన ఫలితాల్లో మెరిశాడు. గుంటూరు రేంజ్‌ పరిధిలో సివిల్‌ ఎస్సైగా ఎంపికై.. నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచాడు.

ఈశ్వరరావు నిరుపేద కుటుంబానికి చెందినవాడు. తల్లిదండ్రులు వెంపడాపు కృష్ణ, నరసమ్మ కాయకష్టంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. పేదరికం కారణంగా చదువంతా ప్రభుత్వ విద్యాలయాల్లోనే సాగింది. పోలీసుశాఖలో చేరి, ప్రజలకు సేవ చేయాలన్నది అతడి కల. దీంతో బీఎస్సీ పూర్తి చేశాక ఎస్సై ఉద్యోగ సాధనకు ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో తండ్రి పక్షవాతంతో మంచాన పడ్డాడు. ఐదేళ్లపాటు లేవలేని స్థితిలో ఉండడంతో కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన బాధ్యత ఈశ్వరరావుపై పడింది. తరువాత తండ్రి మృతితో 2014లో ఉపాధి హామీ క్షేత్రసహాయకుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాడు. కొన్నాళ్లపాటు ఓ ప్రైవేటు ఫార్మా కంపెనీలో పనిచేశాడు. తల్లి, బావ పైల రామచంద్రరావు అన్ని విధాలా సహకారం అందించారు. అక్కడి నుంచి ఉద్యోగ సాధనకు ప్రయత్నాలు చేశాడు. కాకినాడలోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటూ కొన్నాళ్లపాటు ఆ కేంద్రంలోనే శిక్షకుడిగా పనిచేశాడు. 2018 నుంచి 2023 వరకు వరుసగా ఎనిమిది ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. 2018లో ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ ఉద్యోగం వరించింది. అదే ఏడాది గ్రూప్‌-డిలో రైల్వేలో గ్రౌండ్‌ పాయింట్‌మెన్‌గా ఎంపికయ్యాడు. గుంటూరు డివిజన్‌లో సివిల్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించాడు. 2019లో గ్రామ సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, వార్డు సచివాలయంలో శానిటరీ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. 2022 గ్రూప్‌-డిలో రైల్వే పాయింట్‌మెన్‌ కొలువు సాధించాడు. ఎస్సై ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ యువకుడు వాటిల్లో చేరలేదు. 2022లో ఆర్‌ఆర్‌బీ నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చూపి రైల్వేలో ట్రైన్‌ మేనేజరు ఉద్యోగం సాధించాడు. కుటుంబ సభ్యులంతా ఒత్తిడి తేవడంతో చేరాడు. ఆ ఉద్యోగం చేస్తూ మళ్లీ చదవడం ప్రారంభించాడు. ఎట్టకేలకు లక్ష్యాన్ని చేరుకున్నాడు. 2018లో ఒక్క మార్కు తగ్గడంతో కొలువును అందుకోలేక పోయాయని, ఇప్పుడు తన కల నెరవేరిందని చెబుతున్నాడు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z