Politics

పార్టీని వీడుతున్న సీనియర్‌ నేతలు

పార్టీని వీడుతున్న సీనియర్‌ నేతలు

విశాఖ జిల్లా వైకాపాలో ముసలం మొదలైంది. ఎవరు ఎప్పుడు పార్టీని వీడుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలతో పార్టీ అధిష్ఠానం గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సీనియర్‌ నేతలు పార్టీని వీడడం, వారిని మరికొంత మంది అనుసరిస్తుండడంతో కార్యకర్తలు, నాయకుల్లో కలవరం మొదలైంది. పార్టీని వీడుతున్న వారంతా సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమకు విలువ ఇవ్వడం లేదని, కనీసం సీఎం అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదని వాపోతున్నారు. వీరంతా ప్రతిపక్ష తెదేపా, జనసేన పార్టీల వైపు చూస్తుండడంతో ఎన్నికల సమయం వచ్చేసరికి వైకాపా ఖాళీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అవమానాలు తట్టుకోలేక..పార్టీ ఆవిర్భావం

నుంచి వెన్నెంటే ఉన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ రాజీనామా చేసి జనసేనలో చేరారు. సీఎం జగన్‌ తనకు కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని, సొంత గనులను జరిమానా విధించారని చెప్పినా పట్టించుకోలేదని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇది మరవక ముందే సీనియర్‌ నేత, జగన్‌ కుటుంబానికి సన్నిహితుడు, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ సైతం శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు.

గత తొమ్మిది నెలల నుంచి ఆయన సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వైకాపా దక్షిణ నియోజకవర్గ టికెట్‌ విషయంలో ఆశించిన హామీ లభించలేదు. పైగా నియోజకవర్గ పరిధిలో చేస్తున్న పార్టీ కార్యక్రమాలను సైతం అధిష్ఠానం అడ్డుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు.

భగ్గుమన్న వర్గ విభేదాలు: గాజువాకలో ఎమ్మెల్యే నాగిరెడ్డి స్థానంలో నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ బంధువు, కార్పొరేటరు రామచంద్రరావును నియమించడంతో అక్కడ వర్గ విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి. రెండు వర్గాలు ఎవరికి వారు యమునాతీరే అన్నట్లు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో వైకాపా శ్రేణులు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి.

నగర పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండడంతో వైకాపా శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. తెదేపా, జనసేన వైపు చూపు: వైకాపాను వీడుతున్న నేతలు తెదేపా, జనసేన పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌ జనసేనలో చేరారు. వంశీకృష్ణ తాజాగా జనసేనలో చేరారు. సీతంరాజు సుధాకర్‌ తెదేపాలో చేరాలని భావిస్తున్నారు. దక్షిణ కార్పొరేటర్లంతా సుధాకర్‌ వెంట నడిచే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే జీవీఎంసీ పాలక మండలిలో వైకాపా బలం పడిపోయి, తెదేపా బలం పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా జిల్లా వైకాపాలో మొదలైన ముసలం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విశాఖ తూర్పు, గాజువాక, పెందుర్తి, విశాఖ దక్షిణం, విశాఖ పశ్చిమం నియోజకవర్గాల్లో రోజురోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కు బదులు మరొకరికి టికెట్‌ ఇచ్చే విషయాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోందని సమాచారం. సీఎంఓ నుంచి పిలుపు రావడంతో ఆయన తాడేపల్లి వెళ్లి ముఖ్యులతో మాట్లాడి వచ్చారు. ప్రస్తుతం పెందుర్తి వైకాపాలో విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z