Business

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు-వాణిజ్య వార్తలు

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు-వాణిజ్య వార్తలు

స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లలో గుజరాత్‌ను దాటేసిన యూపీ

దేశీయ స్టాక్‌మార్కెట్‌లో నమోదిత పెట్టుబడిదారుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. 2023లో తొలిసారి 8 కోట్ల మైలురాయిని అందుకుంది. గతేడాది డిసెంబరు 31తో పోలిస్తే ఇన్వెస్టర్ల సంఖ్య 22.4 శాతం పెరిగింది. అత్యధిక స్టాక్‌ మార్కెట్‌ మదుపరులు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. అలాగే, గుజరాత్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌ అధిగమించింది. 89.47 లక్షల మదుపర్లతో రెండో స్థానంలో నిలిచింది.నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ విడుదల చేసిన డేటా ప్రకారం.. 2022 డిసెంబరు 31 నాటికి దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే  సంఖ్య 6.94 కోట్లుగా ఉండేది. ఈ ఏడాది డిసెంబరు 25 నాటికి ఆ సంఖ్య 8.49 కోట్లకు చేరింది. కేవలం ఎనిమిది నెలల్లోనే దాదాపు కోటిమందికి పైగా పెరిగారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. 1.48 కోట్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. 89.47 లక్షలతో యూపీ రెండో స్థానంలో నిలవగా.. 76.68 లక్షల మదుపరులతో గుజరాత్ మూడో స్థానంలో ఉంది.పెట్టుబడిదారుల విషయంలో యూపీ 33.8 శాతం వృద్ధి నమోదు చేయగా.. గుజరాత్‌ 17.2శాతం వృద్ధిని కనబరిచింది. 47 లక్షల కంటే ఎక్కువ మంది స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్‌ ఉన్నాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు దూసుకెళ్తుండటంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ ఏడాదిలో మన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కనబరిచిన వృద్ధే అందుకు ఉదాహరణ. నిఫ్టీ దాదాపు 20శాతం పెరగ్గా.. బీఎస్‌ఈ సెన్సెక్స్ 18శాతానికి పైగా లాభపడింది. తాజాగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ విలువ తొలిసారి నాలుగు ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకున్న విషయం తెలిసిందే.

* నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

2023లో సరికొత్త రికార్డులను నెలకొల్పిన భారత స్టాక్‌ మార్కెట్లు.. ఏడాది చివరి రోజు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో మొదలైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. ఇటీవల కాలంలో స్టాక్‌ మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు పతనమయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల పవనాలు సైతం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి.ఉదయం సెన్సెక్స్‌ 72,351.59 పాయింట్ల వద్ద నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇంట్రాడేలో 72,082.64 వద్ద కనిష్ఠానికి చేరుకొని.. చివరకు 170.12 పాయింట్ల నష్టపోయి 72,240.26 వద్ద ముగిసింది. నిఫ్టీ 47.30 పాయింట్లు పడిపోయి 21,731.40 వద్ద స్థిరపడింది. దాదాపు 1,758 షేర్లు పురోగమించగా, 1,533 షేర్లు క్షీణించాయి. 54 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఐచర్‌ మోటార్స్‌ లాభపడగా.. బీపీసీఎల్‌, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌ నష్టపోయాయి.

19 లక్షల కోట్లు దాటనున్న ప్రత్యక్ష పన్ను వసూళ్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 19 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నులు 20 శాతం వృద్ధి చెందాయి. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న పలు కీలక చర్యల కారణంగానే పన్ను వసూళ్ల వృద్ధి గణనీయంగా పెరిగినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.2013-14లో వ్యక్తిగత ఆదాయం, కార్పొరేట్ పన్నులు రూ. 6.38 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం 2022-23లో ఇవి రూ. 16.61 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రభుత్వ బడ్జెట్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్లు రూ. 18.23 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది.కొన్నేళ్ల నుంచి ప్రభుత్వం తక్కువ రేట్లు, తక్కువ మినహాయింపులతో పన్ను విధానాన్ని సరళీకృతం చేయడానికి ప్రయత్నిస్తోంది. 2019 నుంచి మినహాయింపు వదులుకున్న కార్పొరేట్ వర్గాలకు తక్కువ పన్ను రేటును అమలు చేసింది. 2020 నుంచి దీన్ని వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కూడా అమలు చేసింది. మరోవైపు జీఎస్టీ వసూళ్లు సైతం ప్రతి సంవత్సరం కొత్త గరిష్ట స్థాయికి చేరుకోవడంతో, బలమైన ఆర్థిక పనితీరు 2024లో కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆల్‌టైమ్ హై రూ. 1.87 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం రాగా, ఇప్పటివరకు సగటున రూ. 1.66 లక్షల కోట్లు వచ్చాయి.

టెస్లా గుజరాత్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా గుజరాత్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రికల్‌ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రంతో చర్చలు ఇప్పటికే కొలిక్కి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే తుది నిర్ణయం వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. గుజరాత్‌లో ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి వచ్చే ఏడాది జనవరిలో జరిగే ‘వైబ్రంట్‌ గుజరాత్‌’ సమ్మిట్‌లో ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.  గుజరాత్‌ను పెట్టుబడులు, ఎగుమతులు, దిగుమతుల పరంగా అనువైన ప్రదేశంగా టెస్లా కంపెనీ భావిస్తోంది. కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకు సనంద్‌, బెచరాజీ, ధొలేరా పేర్లను పరిశీలిస్తోంది. ఇప్పటికే ఆటో తయారీ కంపెనీలైన మారుతీ సుజుకీ, టాటా, మహీంద్రా అండ్‌ మహీంద్రా వంటి బ్రాండ్లకు గుజరాత్‌లో తయారీ యూనిట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి దీనిపై అధికార ప్రకటన ఏదీ వెలువడలేదు. టెస్లా ప్లాంట్‌ ఏర్పాటుపై గుజరాత్‌ మంత్రి రిషికేశ్‌ పటేల్‌ సైతం ఆశాభావం వ్యక్తంచేశారు.గుజరాత్‌తో పాటు మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలను కూడా ప్లాంట్‌ ఏర్పాటుకు కంపెనీ తొలుత పరిశీలించినట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ వాహన తయారీ, ఎగుమతులకు తగిన పర్యావరణ వ్యవస్థ ఉంది. అయినప్పటికీ టెస్లా గుజరాత్‌ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. కాండ్లా-ముంద్రా పోర్టులు ఉండటమే దీనికి కారణం. దీంతో ఎగుమతులు, దిగుమతులకు అనువైన ప్రదేశమని కంపెనీ భావిస్తోంది. తొలుత టెస్లా పూర్తిగా తయారు చేసిన కార్లను దిగుమతి చేయనుంది. ఆ తర్వాత దేశీయంగా తయారీ చేపట్టనుంది. ‘వైబ్రంట్ గుజరాత్‌’ సదస్సుకు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ సైతం హాజరయ్యే అవకాశం ఉంది.

సెర్చింజన్ గూగుల్‌కు గట్టి షాక్

సెర్చింజన్ గూగుల్‌కు గట్టి షాక్ తగిలింది. ‘ఇన్‌కాగ్నిటో (Incognito)’ మోడ్‌లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను గూగుల్ ట్రాకింగ్ చేస్తున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నది. దీనిపై గూగుల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఒక కంపెనీ ‘క్లాస్ యాక్షన్ లా సూట్’ దాఖలు చేసింది. ఈ కేసు కాలిఫోర్నియాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి య్వోన్నె గొనాలెజ్ రోజర్స్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. తొలుత ఈ కేసు తిరస్కరించాలని గూగుల్ చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో పిటిషనర్‌తో రాజీ ఒప్పందం కుదుర్చుకునేందుకు గూగుల్ ముందుకు వచ్చింది. అప్పటి వరకూ విచారణను నిలిపేస్తున్నట్లు న్యాయమూర్తి య్వోన్నె గొనాలెజ్ రోజర్స్ ప్రకటించారు.సదరు పిటిషనర్‌కు రూ.41 వేల కోట్లు (500 కోట్ల డాలర్లు) చెల్లించేందుకు గూగుల్ సిద్ధమైనట్లు సమాచారం. పిటిషనర్, గూగుల్ మధ్య కుదిరిన ఒప్పందం పూర్తి వివరాలు వెల్లడి కాకున్నా.. సెర్చింజన్ న్యాయవాదులు మధ్యవర్తిత్వం ద్వారా రాజీ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని అంగీకరించారు. సదరు మధ్యవర్తిత్వ రాజీ ఒప్పందానికి 2024 ఫిబ్రవరి 24న న్యాయమూర్తి ఆమోదం తెలుపుతారని భావిస్తున్నారు.‘ఇన్‌కాగ్నిటో (Incognito)’ మోడ్‌లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను గూగుల్ తన గూగుల్ అనలిటిక్స్, కుకీస్, యాప్స్ ద్వారా ట్రాక్ చేస్తున్నదని సదరు పిటిషనర్ ఆరోపించారు. ‘ఇన్‌కాగ్నిటో (Incognito)’ మోడ్‌‌ను ఏర్పాటు చేసిందే గూగుల్. ‘ఇన్‌కాగ్నిటో (Incognito)’ మోడ్‌ అంటే ప్రైవేట్‌గా ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసే పద్దతి. ఈ మోడ్‌లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీ ‘బ్రౌజింగ్ హిస్టరీ’ని కుకీస్ ట్రాక్ చేయబోవని గూగుల్ పేర్కొంటున్నది.కానీ పిటిషన్ దాఖలు చేసిన సంస్థ తమ స్నేహితులు, హామీలు, ఫేవరెట్ ఫుడ్, షాపింగ్ హాబిట్స్ తదితర వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్ దొంగిలిస్తున్నదని ఆరోపించింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జి రోజర్స్ స్పందిస్తూ.. ప్రైవేట్ మోడ్‌లో నెట్ బ్రౌజింగ్ చేస్తున్న యూజర్ల డేటాను సేకరించబోమని చేసిన వాగ్ధానానికి చట్టబద్ధంగా గూగుల్ కట్టుబడి ఉంటుందా? లేదా? అన్న ప్రశ్న ఉదయిస్తుందని అన్నారు. 2016 జూన్ ఒకటో తేదీ నుంచి లక్షల మంది యూజర్ల డేటాను గూగుల్ తస్కరిస్తున్నదని 2020లో సదరు సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇది కాలిఫోర్నియా వ్యక్తిగత గోప్యత చట్టాలను ఉల్లంఘించడమేనని, యూజర్లకు 5000 డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని ఆ పిటిషన్‌లో డిమాండ్ చేసింది.

మహిళల కోసం కొత్త పథకాన్ని తెచ్చే యోచనలో కేంద్రం

వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను తీసుకొస్తుంది. నిర్మలా సీతారామన్ సమర్పించే మధ్యంతర బడ్జెట్‌లో ఈసారి మహిళా కేంద్రీకృత పథకాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇప్పటికే ఈ పథకంపై చర్చలు ప్రారంభమయ్యాయని, అర్హత, వార్షిక ఆదాయం, నగదు మొత్తం అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన మహిళలకు ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని అందించే అవకాశం ఉంది. ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని, ఈ పథకం ద్వారా నెలవారీగా కొత్త మొత్తాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.21 ఏళ్లు పైబడిన మహిళలు, మరే ఇతర పథకాల్లో లేని వారికి ఈ కొత్త పథకం ద్వారా ప్రయోజనాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024, ఫిబ్రవరి 1న తన ఆరో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇప్పటికే బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z