Devotional

రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ

రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23న ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనం సోమవారం రాత్రి ఏకాంతసేవతో శాస్త్రోక్తంగా ముగియనుంది. పదిరోజులపాటు వైకుంఠద్వార దర్శనాన్ని కల్పించడంతో భక్తులు పెద్దఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం శ్రీవారి ఆలయంలోని అలంకరణలు మార్చారు. బెంగళూరుకు చెందిన దాత సునీత సహకారంతో అలంకరణలు చేపట్టామని తితిదే ఉద్యానవన శాఖ డీడీ శ్రీనివాసులు తెలిపారు.

భక్తుల ఆందోళన: ఆంగ్ల సంవత్సరాది నేపథ్యంలో శ్రీవారి ఆలయం వద్దకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి పంపాలంటూ టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులు ఆందోళన చేసిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సుమారు 40 మంది భక్తులు తమకు దర్శనం కల్పించాలని డిమాండు చేస్తూ తితిదే జేఈవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. తిరుపతిలో దర్శన టికెట్లు ఇవ్వడం లేదని, పైకివచ్చినా దర్శనం చేసుకునే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదిరోజుల వైకుంఠద్వార దర్శనం టికెట్లు ఇప్పటికే జారీ చేసిన నేపథ్యంలో వీలుకాదని తితిదే భద్రతా సిబ్బంది వారి సర్దిచెప్పి పంపారు.

దర్శనానికి ఐదు గంటలు: శ్రీవారి సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్లు కలిగిన భక్తులు ఆదివారం సాయంత్రానికి క్యూకాంప్లెక్స్‌లోని 13 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు ఐదుగంటల్లో శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. శనివారం 63,728 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి హుండీ కానుకలు రూ.3.70 కోట్లు లభించాయి.

తిరుపతిలోని కౌంటర్లలో జనవరి 2 నుంచి శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీని పునఃప్రారంభిస్తామని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వదర్శన టోకెన్లను ఇదివరకే జారీచేసిన విషయం తెలిసిందే. తదుపరి సర్వదర్శనం టోకెన్లను మంగళవారం తెల్లవారు జామున 4 గంటల నుంచి మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. అదేరోజు మధ్యాహ్నం 12 నుంచి దర్శన స్లాట్లు ప్రారంభమవుతాయని పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z