Politics

మరో హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు

మరో హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు

మరో హామీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లించే కార్యక్రమానికి ఈ నెలాఖరులోగా శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. అధికారంలోకి వస్తే.. 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే గ్యారంటీల అమలుకు సంబంధించిన ముసాయిదాపై సంతకం చేశారు. ఇందులో మొదటి గ్యారంటీ.. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరో గ్యారంటీ అయిన చేయూతలో రూ.10 లక్షలతో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమాను అమలు చేసింది. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కిందనే ప్రతినెలా మహిళలకు రూ.2,500 చొప్పున ఇస్తామన్న హామీని అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే అమలు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక శాఖతో చర్చించినట్లు సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుండగా, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోనూ అమల్లో ఉన్న ఇలాంటి పథకాలను అధ్యయనం చేసి ప్రతినెలా ఎంత అవసరమవుతుందో నివేదించాలని సూచించినట్లు సమాచారం. కర్ణాటకలో దాదాపు మూడున్నర కోట్ల మంది మహిళలుండగా, కోటీ 25 లక్షల మందికి చెల్లిస్తున్నట్లు సమాచారం. అక్కడ ఇచ్చే ప్రాతిపాదికన ఇక్కడ కూడా చెల్లిస్తే ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుందన్నదానిపై కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 30 లక్షల మంది మహిళలకు చెల్లించాలంటే ప్రతినెలా రూ.750 కోట్లు అవసరం. 40 లక్షల మందికి చెల్లించాలంటే రూ.వెయ్యి కోట్లు.. 60 లక్షల మందికి అయితే ప్రతినెలా రూ.1,500 కోట్లు అవసరం. అర్హతలతోపాటు ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ నెలాఖరులోగా ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టడానికి కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z