Business

పెరిగిన బ్యాంకు డిపాజిట్లు-BusinessNews-Mar 03 2024

పెరిగిన బ్యాంకు డిపాజిట్లు-BusinessNews-Mar 03 2024

* బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరిగిన నేపథ్యంలో ఖాతాదారులు టర్మ్‌ సేవింగ్స్‌ ప్లాన్ల వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం బ్యాంకు డిపాజిట్లలో (Bank Deposits) వీటి వాటా 2023 మార్చిలో ఉన్న 57.2 శాతం నుంచి 2023 డిసెంబర్‌ నాటికి 60.3 శాతానికి పెరిగిందని ఆర్‌బీఐ తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. 2023 ఏప్రిల్‌- డిసెంబర్ మధ్య పెరిగిన డిపాజిట్లలో టర్మ్‌ డిపాజిట్ల (Term Deposits) వాటానే 97.6 శాతంగా ఉంది. అదే సమయంలో కరెంట్‌ ఖాతా, సేవింగ్స్‌ ఖాతాల (CASA) డిపాజిట్లు మాత్రం తగ్గాయి. ఏడు శాతం కంటే ఎక్కువ వడ్డీ రేటు కలిగిన టర్మ్ డిపాజిట్ల వాటా 2023 డిసెంబరులో మొత్తం టర్మ్ డిపాజిట్లలో 61.4 శాతానికి చేరింది. మార్చిలో ఇది 33.7 శాతంగా ఉంది. దాదాపు ఏడాది కాలంగా ఆర్‌బీఐ రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తోంది. చివరిసారి 2023 ఫిబ్రవరిలో 6.25 శాతం నుంచి 6.5 శాతానికి పెంచింది. 2022 నుంచి పలు దఫాల్లో దాదాపు 250 బేసిస్‌ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే.

* వరుస ఐపీఓలతో (IPO) స్టాక్‌ మార్కెట్‌ వచ్చేవారమూ బిజీ బిజీగా ఉండనుంది. మొత్తం మూడు కంపెనీలు తమ తొలి పబ్లిక్‌ ఆఫర్లను ప్రారంభించనున్నాయి. రూ.1,325 కోట్లు సమీకరించనున్నాయి. గోపాల్‌ స్నాక్స్‌, ఆర్‌కే స్వామి, జేజీ కెమికల్స్‌ మెయిన్‌బోర్డు సెగ్మెంట్‌లో పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్నాయి. వీటి తర్వాత లగ్జరీ ఫర్నిచర్‌ బ్రాండ్‌ స్టాన్లీ లైఫ్‌స్టయిల్స్, క్రిస్టల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ సైతం ఈ నెలలోనే ఐపీఓకి రానున్నాయి. సానుకూల స్థూల ఆర్థిక అంశాలతో పాటు ఇటీవల ఐపీఓకి (IPO) వచ్చిన కంపెనీలు మంచి లాభాలను ఇవ్వడం వల్లే పబ్లిక్‌ ఇష్యూలు క్యూ కట్టాయని మార్కెట్‌ నిపుణులు విశ్లేషించారు. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో 16 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. రూ.13,000 కోట్లు సమీకరించాయి. రూ.224 కోట్ల నిధులను సమకూర్చుకోవడమే లక్ష్యంగా ప్రారంభమైన ముక్కా ప్రోటీన్స్‌ ఇష్యూ మార్చి 4న ముగియనుంది. 2023లో 58 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చి రూ.52,637 కోట్లు సమీకరించాయి.

* బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ (BPO) రంగ ఉద్యోగులపై జనరేటివ్‌ కృత్రిమ మేధ (Gen AI) ప్రభావం అధికంగా ఉంటుందని ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్‌ ఛైర్మన్‌ రాజేశ్‌ నంబియార్‌ తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ సేవల్లో పనిచేస్తున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బీపీఓ ఉద్యోగాలను మాత్రమే ఏఐ వేగంగా భర్తీ చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు శనివారం జరిగిన స్పెషల్‌ ట్రేడింగ్‌లోనూ ఆల్‌టైమ్‌ హై రికార్డులను సృష్టించాయి. ఉదయం, మధ్యాహ్నం వేర్వేరుగా చేపట్టిన రెండు సెషన్లలో సూచీలు చివరకు లాభాల్లోనే ముగిశాయి. కాగా, ప్రైమరీ (పీఆర్‌) సైట్‌లో వైఫల్యం లేదా పెను అంతరాయం ఏర్పడినప్పుడు దాన్ని ఎదుర్కొనే సంసిద్ధతను పరీక్షించడానికి అటు బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ), ఇటు నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ)ల్లో ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్లను చేపట్టారు. వీటిలో భాగంగానే ప్రైమరీ సైట్‌ నుంచి డిజాస్టర్‌ రికవరీ (డీఆర్‌) సైట్‌కు స్పెషల్‌ లైవ్‌ ట్రేడింగ్‌ను మార్చి టెస్ట్‌ చేశారు.

* రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై సుమారు 800 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సింగరేణి సీఎండీ ఎన్‌ బలరాం తెలిపారు. శనివారం ఇక్కడి సింగరేణి భవన్‌లో ఆయన విద్యుత్‌ విభాగంపై సంస్థ ఎలక్ట్రికల్‌-మెకానికల్‌ శాఖ డైరెక్టర్‌ డి సత్యనారాయణ రావుతోపాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. భారీ జలాశయాలపై సౌర ఫలకాల ఏర్పాటుతో విద్యుదుత్పత్తి పెంపునకు కృషి చేయాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో లోయర్‌ మానేరు డ్యాం నీటిపై 300 మెగావాట్లు, మల్లన్న సాగర్‌పై 500 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎండీ ఆదేశించారు. అయితే లోయర్‌ మానేరు డ్యాంపై 300 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ సిద్ధంగా ఉందని అధికారులు చెప్తున్నారు.

* ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) తెలంగాణ టెలికం సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం)గా నిర్మల్‌ పీజీ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారమే ఆయన ఈ కొత్త హోదాలోకి వచ్చినట్టు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలియజేసింది. కాగా, నిర్మల్‌…1991 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ టెలికం సర్వీస్‌ (ఐటీఎస్‌) అధికారి. టెలీకమ్యూనికేషన్స్‌ రంగంలో వివిధ హోదాల్లో దేశవ్యాప్తంగా 29 ఏండ్లకుపైగా పనిచేసిన అనుభవం ఈయనకు ఉన్నది. ఇంతకుముందు బీఎస్‌ఎన్‌ఎల్‌ కేరళ టెలికం సర్కిల్‌లో నిర్మల్‌ పనిచేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z