Fashion

డార్లింగ్ అంటే లైంగిక నేరమే-CrimeNews-Mar 03 2024

డార్లింగ్ అంటే లైంగిక నేరమే-CrimeNews-Mar 03 2024

* విశాఖకు చెందిన యువ ఫొటోగ్రాఫర్‌ సాయి హత్య కేసును పోలీసులు ఛేదించారు. విలువైన కెమెరా కోసమే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు దర్యాప్తులో తేలింది. కేసు వివరాలను విశాఖ సీపీ రవిశంకర్‌ వెల్లడించారు. విశాఖ మధురవాడలోని బక్కన్నపాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయికుమార్‌ (23) వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్‌. పెళ్లి వేడుకలకు ఫొటోలు, వీడియోలు తీస్తుంటాడు. ఆన్‌లైన్‌ ద్వారా బుకింగ్‌లు తీసుకొని దూర ప్రాంతాల ఈవెంట్‌లకూ వెళ్తుంటాడు. ఈ క్రమంలో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఫొటోషూట్‌ ఉందని ఫోన్‌ చేసి రమ్మన్నారు. దీంతో ఫిబ్రవరి 26న సాయికుమార్‌ తన వద్ద ఉన్న కెమెరా, సామగ్రి తీసుకొని రావులపాలెం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి బయల్దేరాడు. విశాఖ నుంచి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ఇద్దరు యువకులు కారులో వచ్చి సాయిని తీసుకెళ్లారు. పథకం ప్రకారం.. రావులపాలెం సమీపంలోకి వెళ్లిన తర్వాత చంపేశారు. మృతదేహాన్ని కడియంలంకలో పూడ్చిపెట్టారు. అనంతరం కెమెరా, సామగ్రి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. మూడు రోజులు గడిచినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు గత నెల 29న విశాఖలోని పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతుడి ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా కడియంకు చెందిన షణ్ముఖతేజను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. కెమెరా కోసమే మూలస్థానం గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి సాయిని హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. మృతదేహాన్ని కడియంలంకలో పూడ్చిపెట్టినట్టు చెప్పడంతో ఆదివారం వెలికితీశారు. రూ.10 లక్షల విలువైన కెమెరా కోసమే ఫొటోగ్రాఫర్‌ను హత్యచేశారని, అన్ని ఆధారాలు సేకరించి.. ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు సీపీ తెలిపారు.

* పరిచయం లేని మహిళను ‘డార్లింగ్’ అని పిలవడం లైంగిక వేధింపేనని కలకత్తా హైకోర్టు (Calcutta High Court) స్పష్టం చేసింది. అలా పిలిచిన వ్యక్తులను ఐపీసీ 354ఏ, 509 సెక్షన్ల కింద నేరస్థులుగా పరిగణించవచ్చని తెలిపింది. ఈ మేరకు పోర్టు బ్లెయిర్‌లోని హైకోర్టు బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జై సేన్‌గుప్తా తీర్పు వెలువరించారు. గతేడాది అండమాన్‌ నికోబార్‌లోని మాయాబందర్‌ ప్రాంతంలో దుర్గా పూజ సందర్భంగా పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. విధుల్లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్‌తో జనక్‌ రామ్‌ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఉన్న అతను.. ఆమెను డార్లింగ్‌ అని పిలవడంతోపాటు ‘చలాన్‌ ఇవ్వడానికి వచ్చావా’ అంటూ దూషించాడు.

* జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని సూరారం గ్రామంలో వన్యప్రాణి మాంసాన్ని(Wildlife meat) అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ మండల అధికారి కమల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాదోట సురేశ్‌ వద్ద వన్యప్రాణి దుప్పి(Moose)(సుమారు కేజీబరువు గల) మాంసం ఉన్నట్లు తెలిసింది. దీంతో అతడి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా దుప్పి మాంసం దొరకడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ బీట్‌ అధికారి కృపాకర్‌, సెక్షన్‌ అధికారి వరుణ్‌ పంచనామా చేసి విచారించారు. అదే గ్రామానికి చెందిన కుంభం రమేశ్‌ వద్ద నుంచి మాదోట సురేశ్‌ దుప్పి మాంసం కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో వైల్డ్‌ లైఫ్‌ యాక్ట్‌ కింద వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఆర్‌వో కమల తెలిపారు.

* రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లిలోని ఓ హోటల్‌లో రౌడీషీటర్లు వీరంగం సృష్టించారు. హోటల్‌ సామగ్రితో పాటు పార్కింగ్‌ వద్ద బైక్‌లను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో నమోదయ్యాయి. ఈ ఘటనపై అత్తాపూర్‌ పోలీసు స్టేషన్‌లో హోటల్‌ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

* అంబర్‌పేట్‌లోని ఈస్ట్‌జోన్‌ డీసీపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఇన్వర్టర్‌ బ్యాటరీల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలార్పారు.

* రోడ్డు ప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గన్‌మెన్‌ గోపిరెడ్డి (30) మృతి చెందాడు. బాపట్ల మండలం ఈతేరు- చుందూరుపల్లి రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. బాపట్లలోని ఉప్పెరపాలెంకు చెందిన గోపిరెడ్డి 2018లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం మాచర్ల ఎమ్మెల్యే వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ద్విచక్రవాహనంపై బాపట్ల వస్తుండగా లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో.. ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో అకస్మాత్తుగా బ్రేక్‌ వేశాడు. దీంతో వెనుక నుంచి లారీ, ఆపై ముందు నుంచి బస్సు ఢీ కొట్టాయి. తలకు తీవ్రగాయాలు కావడంతో గోపిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z