ScienceAndTech

ఈ విమానానికి స్ఫూర్తి ఓ పక్షి

Albatrossone Design Is Inspired From A Bird Of The Same Name

విమానం గాల్లో ఎగురుతోంది అంటే దానికి స్ఫూర్తి పక్షి. కానీ, విమానానికి, పక్షికీ ఒక్కటే తేడా. రెక్కలాడించడం. మరి, విమానం కూడా రెక్కలాడిస్తూ గాలిని చీల్చుతూ వెళితే ఎలా ఉంటుంది? అదే ఆలోచన ఎయిర్బస్కు వచ్చింది. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టింది. రెక్కలాడించే ఓ చిన్నపాటి విమానాన్ని తయారు చేసింది. దానిపేరు ‘ఆల్బట్రాస్ వన్’. దానికీ స్ఫూర్తి ఓ పక్షే. ఆ పక్షి పేరునే విమానానికి పెట్టింది. ప్రస్తుతం ఎయిర్బస్ తయారు చేస్తున్న ఏ321 మోడల్ విమానానికి కొన్ని మార్పులు చేసి ఈ ఆల్బట్రాస్ విమానాన్ని తయారు చేసింది. అందులో భాగంగా విమానం రెక్కలను కార్బన్ ఫైబర్, గ్లాస్ ఫైబర్ పాలిమర్లతో తయారు చేశారు. దాని రెక్కల అంచులు కదిలేలా ‘సెమీ ఏరో ఎలాస్టిక్’ పద్ధతిలో వాటిని రూపొందించారు. ఆకాశంలో గాలి తీవ్రతను బట్టి ఆ రెక్కలాడుతుంటాయి. తద్వారా విమానం టర్బులెన్స్ (వైబ్రేషన్) ప్రభావం తగ్గుతుంది. ఈ విమానాన్ని తయారు చేయడానికి దాదాపు 20 నెలల టైం తీసుకుంది ఎయిర్బస్. ఇప్పుడు దానిని టెస్ట్ చేస్తోంది. ఆల్బట్రాస్ అనేది ఓ సముద్ర పక్షి. ఆకాశంలో గాలి ఎంత వేగంగా వీచినా కొన్ని గంటల పాటు ఎగరగలదు. దాని రెక్కల అంచులను ఆడిస్తూ గాలిలో స్థిరంగా ఎగురుతుంది. దీంతో ఆ సిద్ధాంతాన్నే విమానంపైనా అమలు చేసింది ఎయిర్బస్ సంస్థ. అయితే, ఈ కాన్సెప్ట్ కొత్తదేం కాదని కంపెనీ ఇంజనీర్ టామ్ విల్సన్ చెప్పారు. ఇప్పటికే మిలటరీ జెట్లను ఈ తరహాలో తయారు చేస్తున్నారన్నారు. అయితే, ప్యాసింజర్ టైప్ విమానాల్లో మాత్రం ఇదే మొదటిదని చెప్పారు. విమానపు రెక్కల్లోని మూడొంతుల భాగం కదులుతుందని వివరించారు. ఫిబ్రవరిలో మొదటి సారి దానిని టెస్ట్ చేశామన్నారు. మరిన్ని టెస్టులు చేస్తామని, రెండు ఫ్లైట్మోడ్ల పనితీరును పరిశీలిస్తామని వివరించారు. ఎగిరేటప్పుడు రెక్కలు కదిలే భాగం అన్లాకింగ్, దాని కదలికలను మరింత జాగ్రత్తగా గమనించాల్సి ఉందని చెప్పారు. కాగా, జులై ‘బర్డ్ ఆఫ్ ప్రె’ పేరిట ఓ కాన్సెప్ట్ విమానం నమూనాను ఎయిర్బస్ వెల్లడించిన సంగతి తెలిసిందే.