Politics

మరో లేఖాస్త్రం సంధించిన SEC రమేశ్‌కుమార్

Andhra SEC Ramesh Kumar Writes To Central Home Ministry

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. తనకు రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కటుంబ సభ్యులతో పాటు తనపైనా దాడి జరిగే అవకాశం ఉందని రమేష్ కుమార్ లేఖలో పేర్కొన్నారు. తనకు, తన కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తాను హైదరాబాద్‌లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో గెలిచినప్పటికీ మద్యం, డబ్బు, దొరికితే మూడేళ్ల జైలు, అనర్హత వేటు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం క్రూరమైన ఆర్డినెన్స్ తెచ్చిందని రమేశ్ కుమార్ పేర్కొన్నారు. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ లు విధులు నిర్వహించలేకపోయారని చెప్పారు. తన భద్రతతో పాటు ఎన్నికల నిర్వహణకు కూడా కేంద్ర బలగాలు అవసరమని ఐదు పేజీల లేఖ రాశారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పరిస్థితులు అనుకూలంగా లేవని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరగాలంటే కేంద్ర బలగాలు అవసరమని రమేశ్ కుమార్ లేఖలో తెలిపారు. మంత్రులకు సీఎం టార్గెట్ పెట్టడాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో జరిగిన ఏకగ్రీవాలపై కూడా ఆయన ప్రస్తావించారు. విభజన ఏపీలో ఇప్పుడు 24 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవాలు జరిగాయని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ఒకే జడ్పీటీసీ ఏకగ్రీవం అయిందని చెప్పారు. ఇప్పుడు 126 జడ్పీటీసీలు ఏకగ్రీవం కావడాన్ని రమేశ్ కుమార్ లేఖలో పేర్కొన్నారు. కడప జిల్లాలో 79 శాతం ఎంపీటీసీలు, 76 శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు.