DailyDose

మందు తాగితే కరోనా పోతుంది-తాజావార్తలు

Congress MLA Says Alcohol Cures COVID19-Telugu Breaking News Roundup Today

* మారుతీ సుజుకీ కంపెనీ చ‌రిత్ర‌లో ఇదే మొద‌ట‌సారి. ఆ కంపెనీ ఏప్రిల్ నెల‌లో ఒక్క కారును కూడా అమ్మ‌లేదు. దేశ‌వ్యాప్త‌ లాక్‌డౌన్ వ‌ల్ల ఆ కంపెనీ కార్లు అమ్ముడుపోలేదు. ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కారం మారుతీ సుజుకీ సంస్థ త‌న ఉత్ప‌త్తి కేంద్రాల‌ను మూసివేసింది. ఫ్యాక్ట‌రీలు, షోరూమ్‌లు మూసివేయ‌డంతో పాటు జ‌నం కూడా ఇంటి వ‌ద్దే ఉండ‌డం వ‌ల్ల కార్లు అమ్ముడుపోన‌ట్లు మారుతీ పేర్కొన్న‌ది. దేశంలో అత్య‌ధిక కార్లు అమ్మే రికార్డుకు మారుతీ పేరిట ఉన్న‌ది. కానీ లాన్‌డౌన్ ప్ర‌భావం ఆ కంపెనీ మీద కూడా ప‌డింది. మార్చి నెల‌లో కూడా ఆ కంపెనీ కార్ల అమ్మ‌కాలు 47.4 శాతం ప‌డిపోయిన‌ట్లు నివేదిక వెల్ల‌డిస్తున్న‌ది. సాధార‌ణ స‌మ‌యంలో సుజుకీ కంపెనీ ప్ర‌తి నెల సుమారు ల‌క్షా 50 వేల కార్ల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. అయితే ఏప్రిల్ నెల‌లో ముంద్రా పోర్టు నుంచి 632 కార్ల‌ను ఎగుమ‌తి చేసిన‌ట్లు ఆ కంపెనీ చెప్పింది. గ‌త నెల చివ‌ర్లో హ‌ర్యానాలోని ఓ ప్లాంట్‌ను ఓపెన్ చేసేందుకు మారుతీకి అనుమ‌తి వ‌చ్చింది.

* మాజీ హాలీవుడ్ న‌టి, బ్రిటిష్ యువ‌రాజు హ్యారీ భార్య‌కు ఓ పరువున‌ష్టం కేసులో లండ‌న్ కోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. హ్యారీని పెండ్లి చేసుకున్న త‌ర్వాత ఆమె రాసిన కొన్ని మెయిల్ సందేశాల‌ను అనుమ‌తి లేకుండా ప‌బ్లిష్ చేశార‌ని ఆరోపిస్తూ ఆమె అసోసియేటెడ్ న్యూస్ పేప‌ర్స్‌పై దావా వేశారు. ఈ కేసుపై ప్రాథ‌మిక విచార‌ణ జ‌రిపిన కోర్టు మేఘ‌న్‌కు వ్య‌తిరేకంగా తీర్పు ఇచ్చింది. మేఘ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల్లో బ‌లంలేద‌ని న్యాయ‌మూర్తి మార్క్ వార్బీ ప్ర‌క‌టించారు.

* దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించిన విషయం విదితమే. అయితే గ్రీన్‌ జోన్లలో మద్యం, పాన్‌ దుకాణాలను అనుమతి ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం, పాన్‌ షాపుల వద్ద 6 అడుగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ రెండో దఫా ఈ నెల 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మే 4 నుంచి 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

* లాక్ డౌన్ ప్ర‌భావంతో ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికులు రేష‌న్ కార్డును వినియోగించుకోవ‌చ్చ‌ని యూపీ సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ తెలిపారు. సీఎం యోగి ఆదిత్య‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ..యూపీకి చెందిన కార్మికులెవ‌రైనా లాక్ డౌన్ తో ఇత‌ర ప్రాంతాల్లో చిక్కుకుపోతే..వాళ్లు (మ‌హిళ‌లు, పురుషులు) ఆయా ప్రాంతాల్లో రేష‌న్ స‌రుకులు పొంద‌వ‌చ్చ‌న్నారు. రేష‌న్ కార్డు లేని వారికి రాష్ట్ర విప‌త్తు నిర్వ‌హణా నిధి కింద‌, ఆహార సామాగ్రి స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌రోవైపు యూపీలోని హాట్ స్పాట్ల‌లో పోలీసులు ఇంటివ‌ద్ద‌కే నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ చేస్తున్నారు.

* ఢిల్లీకి చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఎమ్మెల్యే విశేష్‌ రవికి కరోనా సోకింది. రవితో పాటు అతని సోదరుడికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోల్‌ బాగ్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్‌నేత విశేష్‌కు బుధవారం కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించారు. ఇవాళ ఫలితం రాగా పాజిటివ్‌గా తేలింది. కరోనా అనుమానిత లక్షణాలేవీ ఎమ్మెల్యేలో కనిపించలేదు. ఒక ప్రజాప్రతినిధికి కరోనా సోకడం ఢిల్లీలో ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3515 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 59 మంది ప్రాణాలు కోల్పోయారు.

* కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, హోంగార్డులు, డెలివరీ బాయ్స్‌, మీడియా ప్రతినిధులు అందరికీ సాయుధ దళాల తరఫున చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌ ధన్యవాదాలు తెలిపారు. త్రివిధ దళాధిపతులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సీడీఎస్ బిపిన్‌ మాట్లాడారు.

* భారత్‌లో రోజురోజుకీ పెరుగుతున్న కొవిడ్‌-19 కేసులు మే 21 నాటికి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఓ అధ్యయనం అంచనా వేసింది. అప్పటి కల్లా కొత్త కేసుల పెరుగుదల పూర్తిగా ఆగిపోనుందని ‘ముంబయి స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ’ తన అధ్యయనంలో వివరించింది. ‘‘ఎండ్‌ ఈజ్‌ నియర్‌’’ పేరిట ప్రచురించిన ఈ అధ్యయనంలో భారత్‌లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమవనుందని అభిప్రాయపడింది.

* అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పతనమైన వేళ సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్‌ ధర రికార్డు స్థాయిలో రూ. 162.50 మేర తగ్గింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో చమురు ధరలు పడిపోగా.. వరుసగా మూడో నెలలో సబ్సిడీయేతర వంటగ్యాస్‌ ధరలు తగ్గాయి. ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ ధర దిల్లీలో రూ. 611.50కు తగ్గింది. గత ఏడాది జనవరిలో సిలిండర్‌ ధర రూ. 150.50 తగ్గగా.. ఇప్పుడు రూ.162.50 మేర తగ్గింది. గత మూడు నెలల్లో సబ్సిడీ లేని వంటగ్యాస్‌ సిలిండర్‌కు రూ. 277 వరకు తగ్గిందని ఎల్పీజీ సంస్థలు తెలిపాయి.

* నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, షాపూర్‌నగర్‌, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, ప్యాట్నీ సెంటర్‌, ప్యారడైజ్‌, మారేడుపల్లి, చిలకలగూడ, అల్వాల్‌, అంబర్‌పేట, నల్లకుంట, కోఠి, కాచిగూడ.. పాతబస్తీ పరిధిలోని బహుదూర్‌పురా,చార్మినార్‌, జూపార్క్‌, పురాణాపూల్‌, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సైదాబాద్‌,చంపాపేట, సంతోష్‌నగర్‌, మాదన్నపేట, ఇబ్రహీంపట్నం, ఎల్‌బీనగర్‌, నాగోల్‌, మన్సూరాబాద్‌, వనస్థలిపురం, బీఎన్‌ రెడ్డి నగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌ మెట్‌ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఎండల తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న భాగ్యనగర వాసులకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది.

* దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఈ సమయంలో తాజాగా 12మంది తబ్లిగీలను జైలుకు తరలించారు ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు. వీరిలో తొమ్మిది మంది థాయ్‌లాండ్‌ దేశస్థులు కాగా మిగతావారు తమిళనాడుకు చెందినవారు ఉన్నారు. దిల్లీ మర్కజ్‌ సమావేశానికి హాజరై వచ్చిన అనంతరం ఓ మసీదులో తలదాచుకున్న వీరిని ఏప్రిల్‌ 2వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరికీ వైద్యపరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా పాజిటివ్‌ తేలింది.

* ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రాణాలకు తెగించి బాధ్యతలు నిర్వర్తిస్తున్న వైద్యుల పనితీరు ప్రతి ఒక్కర్నీ కదిలింపజేస్తోంది. కరోనా రోగులు అని తెలిసి కూడా నిరంతరం విధుల్లో ముందుండడం వారి సేవాభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. తాజాగా కొవిడ్‌ రోగులకు చికిత్సలో భాగంగా దాదాపు 20రోజుల పాటు ఇంటికి రాకుండా ఆసుపత్రికే పరిమితమైన ఓ వైద్యురాలు ఇప్పుడు ఎందరికో స్ఫూర్తినిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై భారత ప్రధాని మోదీ కూడా స్పందించారు.

* ఆల్కహాల్‌ సేవిస్తే గొంతులోని కరోనా వైరస్‌ కచ్చితంగా పోతుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భరత్‌ సింగ్‌ కుందన్‌పుర్‌ అంటున్నారు. రాష్ట్రంలో వెంటనే మద్యం దుకాణాలు తెరవాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌కు లేఖ రాశారు. ఆయన సంగోడ్‌ నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ‘ఆల్కహాల్‌ను రుద్దినంత మాత్రాన చేతులకున్న కరోనా వైరస్‌ చచ్చిపోతుందంటే తాగితే గొంతులోని వైరస్‌ కచ్చితంగా చచ్చిపోతుంది’ అని ముఖ్యమంత్రి గెహ్లోత్‌కు ఏప్రిల్‌ 30న కుందన్‌పుర్‌ లేఖ రాశారు. రాష్ట్రంలో అక్రమంగా మద్యం కొనుగోళ్లు, విక్రయాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.