NRI-NRT

పాకిస్థాన్ చైనాల పీచమణాచలంటే ట్రంప్ రావల్సిందే!

పాకిస్థాన్ చైనాల పీచమణాచలంటే ట్రంప్ రావల్సిందే!

ఊహించినట్లే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ-భరిత క్లైమాక్స్‌ దిశగా వెళుతున్నాయి. రిపబ్లికన్‌ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రాట్‌ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ మధ్య నువ్వా-నేనా అన్న పరిస్థితి నెలకొంది. అయితే.. నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిస్తే భారత్‌కు లాభం? ఇద్దరు అధ్యక్షుల వ్యవహార శైలి, అభిప్రాయాలను బేరీజు వేస్తే ట్రంప్‌ గెలిస్తేనే కొన్ని అంశాల్లో భారత్‌కు ఎక్కువ లాభమని రాజకీయ, విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ట్రంప్‌ చైనాకు బద్ధ వ్యతిరేకి. బైడెన్‌కు అలాంటి తీవ్ర వ్యతిరేకత ఏమీ లేదు. ట్రంప్‌ ఓడిపోతే చైనా విస్తరణవాద కాంక్షకు వ్యతిరేకంగా భారత్‌ పోరాటానికి అగ్రరాజ్యం మద్ద తు ప్రస్తుత స్థాయిలో ఉండదు. అలాగే.. పాకిస్థాన్‌ పట్ల ట్రంప్‌ కఠినంగా వ్యవహరిస్తున్నారు. బైడెన్‌ మాత్రం పాక్‌ పట్ల ఉదారంగా ఉంటారు. పాక్‌కు ఆర్థిక సాయం అందించే ప్రతిపాదన చేసినందునే 2008లో ఆ దేశం బైడెన్‌ను ‘హిలాల్‌-ఎ-పాకిస్థాన్‌’ పురస్కారంతో గౌరవించింది. అంతేకాదు.. జమ్మూకశ్మీర్‌, పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టిక వంటి అంశాలపై బైడెన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే పాక్‌.. బైడెన్‌ గెలుపును కోరుకుంటోంది. ట్రంప్‌ మళ్లీ గెలిస్తే పాక్‌ పట్ల మరింత వ్యతిరేకతతో ప్రవర్తించవచ్చని, బైడెన్‌ గెలిస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. కాబట్టి, బైడెన్‌ గెలిస్తే భారత్‌-అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగవచ్చుగానీ.. ట్రంప్‌ హయాంలోలాగా బలంగా ఉండదు. అయితే.. బైడెన్‌ గెలిస్తే అమెరికాలో మనవాళ్ల ఉద్యోగాలకు ఢోకా ఉండదు. జాతీయవాద రాజ కీయాలు చేస్తున్న రిపబ్లికన్‌ పార్టీ అమెరికన్లకే ప్రాధాన్యమిస్తుంది. హెచ్‌1బీ వీసాలపై ట్రంప్‌ వ్యవహారశైలి ఇందుకు నిదర్శనం. ఉదారవాద విధానాలను అవలంభించే డెమోక్రాటిక్‌ పార్టీ గెలిస్తే మనవాళ్ల ఉద్యోగాలు సురక్షితమనే వాదన వినిపిస్తోంది.