Politics

నా పేరు నిమ్మగడ్డ…నేనింతే-తాజావార్తలు

Nimmagadda Responds On EWatch App - Says It Is Transparent

* మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యాధిపతి మిన్‌ ఆంగ్‌ లయాంగ్‌ తొలిసారి స్పందించారు. ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటు తప్పలేదని చెప్పుకొచ్చారు. అలాగే ఈ అనూహ్య నిర్ణయానికి దారితీసిన కారణాలను వివరించారు. ఎన్నికల నిర్వహణపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించలేదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోమవారం జరిగిన తొలి కేబినెట్‌ భేటీలో ఆయన మాట్లాడినట్లు మిలిటరీ అధికార ఫేస్‌బుక్‌ ఖాతాలో వెల్లడించారు.

* వెయ్యి శాతం పారదర్శకతతో ‘ఈ-వాచ్‌’ యాప్‌ను రూపొందించినట్లు ఏపీ ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల కోసం కొత్తగా రూపొందించిన ఈ-వాచ్ యాప్‌ను విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో బుధవారం ఎస్‌ఈసీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ యాప్‌పై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేయడంపై ఎస్ఈసీ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ వేయకపోతే ఆశ్చర్యపడాలి తప్ప వేస్తే ఆశ్చర్యం ఏముందని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెల్లడించిన తర్వాత ఇందులో ఎలాంటి వివాదాలకు చోటులేదన్నారు. ఎలాంటి సందేహాలు, ప్రశ్నలకు తావులేకుండా యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు. సమావేశాలతో కాలం గడపకుండా పనికే ప్రాధాన్యత ఇస్తానని.. తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తానని ఎస్‌ఈసీ తెలిపారు.

* రైతుల ఆందోళనపై తప్పుడు సమాచారం చేరవేస్తున్న ఖాతాలను ట్విటర్‌ పునరుద్ధరించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే సామాజిక మాధ్యమ సంస్థపై చర్యలు తప్పవని హెచ్చరించింది.

* రాజ్యసభ సమావేశాలను కొందరు సభ్యులు మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేయడంపై ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేయడం నిబంధనలకు వ్యతిరేకమని, ఆ వీడియోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేయడం సభను ధిక్కరించినట్లేనని ఎంపీలను హెచ్చరించారు. అసలేం జరిగిందంటే…..మంగళవారం రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కాగానే సాగు చట్టాలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో సభను పలుమార్లు వాయిదా వేశారు. అయితే, ఆ సమయంలో కొందరు ఎంపీలు సభలో జరుగుతున్న ఆందోళనను తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేశారు. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో కన్పించడంతో పాటు కొన్ని టెలివిజన్‌ ఛానళ్లు కూడా ప్రసారం చేశాయి.

* పలు జిల్లాల్లో ఆధార్‌ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ఆధారంగా రేషన్‌ సరకులను సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్‌కార్డు దారులు ఆధార్‌కు ఫోన్‌ నంబర్‌ అనుసంధానం చేసుకోవాలని అధికారులు కోరారు. దీంతో ఆధార్‌-ఫోన్‌ నంబర్‌ అనుసంధానం కోసం పెద్ద సంఖ్యలో ఆధార్‌ కేంద్రాలకు ప్రజలు వస్తున్నారు.

* తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతున్నా.. న్యాయం చేసేందుకు న్యాయస్థానాలున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. అక్రమ అరెస్టులకు భాజపా నాయకులు, కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ మేరకు బండి సంజయ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. రామమందిరం విషయంలో అనుచిత వాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై భాజపా కార్యకర్తలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వరంగల్ అర్బన్ జిల్లా భాజపా అధ్యక్షురాలు రావు పద్మ, రూరల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌లతో పాటు మరో 42 మంది కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. వీరందరికీ ఇవాళ కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై బండి సంజయ్‌ హర్షం వ్యక్తం చేశారు.

* ఏపీలో దేవాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దర్యాప్తు జరిపించేలా చూడాలని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు రాజ్యసభలో కోరారు. ఏపీలో జరిగిన పలు ఘటనలను ప్రస్తావించిన ఆయన వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యమే వీటికి కారణమన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో జరుగుతున్న దాడులను సభతో పాటు దేశం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలిచే విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో ఇటీవల జరిగిన ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గత ఏడాదిన్నరగా ఏపీలో ఈ తరహా దాడులపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోవటమే దీనికి కారణం. ఈ ఘటనలు రాష్ట్రంలోనేగాక దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు, ధర్మాచార్యులను బాధిస్తాయి’ అని జీవీఎల్‌ అన్నారు.

* కరోనా వైరస్‌ పుట్టుకకు కారణమని అనుమానిస్తున్న వుహాన్‌ నగరంలోని ల్యాబరేటరీని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) బృందం సందర్శించింది. కరోనా వైరస్‌ ఎలా పుట్టింది ఎలా వ్యాప్తి చెందింది? అనే కోణంలో వివరాలు, ఆధారాలు సేకరించడమే లక్ష్యంగా వుహాన్‌లోని వైరాలజీ సంస్థను సందర్శించింది. చైనాలోని అత్యున్నత పరిశోధనా ల్యాబ్‌గా గుర్తింపు ఉన్న వుహాన్‌ వైరాలజీ సంస్థ 2003లో వచ్చిన సార్స్‌ వైరస్‌ తర్వాత కరోనా వైరస్‌ జన్యు సమాచారాన్ని క్రోడీకరించింది. అక్కడి నుంచే కరోనా వైరస్‌ ఏర్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. వైరస్‌ మరెక్కడైనా పుట్టిఉండవచ్చని, లేదా దిగుమతి చేసుకున్న కలుషిత సముద్ర ఆహారం ద్వారా తమ దేశంలోకి ప్రవేశించి ఉండొచ్చని వాదిస్తోంది. అయితే అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు చైనా వాదనను తిరస్కరిస్తున్నారు.

* వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే అధికారంలో కొనసాగడం కష్టమని ఆందోళన చేపట్టిన రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఇప్పటి వరకు కేవలం సాగుచట్టాలను మాత్రమే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామని, ఆందోళన ఇలాగే కొనసాగితే ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోతుందని భారతీయ కిసాన్‌ సంఘం(బీకేయూ) పేర్కొంది. రైతు సంఘాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని ‘మహాపంచాయత్’‌ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి.

* భాజపాపై పోరాటానికి మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు గుజరాత్‌ మాజీ సీఎం, ప్రజాశక్తి డెమోక్రటిక్‌ పార్టీ (పీఎస్‌డీపీ) వ్యవస్థాపకుడు శంకర్‌ సిన్హ్‌ వాఘేలా అన్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన 80 ఏళ్ల వాఘేలా.. తనను మళ్లీ కాంగ్రెస్‌లోకి రావాలంటూ అనేకమంది కార్యకర్తలు, నేతలు కోరుతున్నారంటూ బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గతేడాది భరూచ్‌ జిల్లాలోని పిరమాన్‌ గ్రామంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌పటేల్‌ అంత్యక్రియలకు హాజరైనప్పుడు చాలా మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు తనను పార్టీలో చేరాలంటూ కన్నీళ్లు పెట్టుకొని అడిగారని తెలిపారు. అంతేకాకుండా కొందరు నేతలు కూడా పట్టుబడుతున్నారన్నారు. భాజపాతో పోరాడేందుకు ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్‌లో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కాంగ్రెస్‌లో మళ్లీ చేరేందుకు తనకెలాంటి సమస్య లేదని చెప్పారు. సోనియా, రాహుల్‌ గాంధీతో సమావేశమైన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

* ఎలాగైనా డబ్బు సంపాదించాలని కొంత మంది యువకులు అడ్డదారి తొక్కారు. ప్లే స్టోర్‌లోని నకిలీ యాప్‌ల ద్వారా నగదు చెల్లింపులు చేసి చివరకు పోలీసులకు చిక్కారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీకుమార్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఇటువంటి యాప్‌లతో దుకాణదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

* ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసింది. జూన్‌ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. అమరావతి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 7 పేపర్లుగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు.