DailyDose

ఏజెన్సీలో కాల్పుల కలకలం-నేరవార్తలు

ఏజెన్సీలో కాల్పుల కలకలం-నేరవార్తలు

* విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన లంబసింగిలో కాల్పుల కలకలం రేగింది. గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు నల్గొండకు చెందిన పోలీసులు ఏజెన్సీ ప్రాంతాని వెళ్లారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని కొయ్యూరు మండలం తులబాయిగడ్డ వద్ద ఇద్దరు సీఐలు, నలుగురు కానిస్టేబుళ్లు స్మగ్లర్ల కోసం గాలిస్తుండగా… 20 మంది గంజాయి స్మగ్లర్లు నల్గొండ పోలీసులకు ఎదురుపడ్డారు. పోలీసుల కదలికలను గమనించిన స్మగ్లర్లు రాళ్లదాడి చేయడంతో ఆత్మ రక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులతో గంజాయి స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామానికి చెందిన కిల్లో కామరాజు, రాంబాబుకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ నర్సీపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏవోబీ లంబసింగి ప్రాంతంలో గంజాయి స్మగ్లర్ల కోసం వేట కొనసాగుతోంది.

* సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న చింతలబస్తీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటికి కాపలాగా ఉన్న వాచ్‌మెన్‌ దంపతులే ఈ దోపిడీకి పాల్పడ్డారు. యజమాని ఇంట్లో లేని సమయంలో రూ.30 లక్షల విలువైన బంగారం కాజేశారు. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నేపాల్‌ దంపతులు.. వయసులో పెద్దవాళ్లైన ఇంటి యజమాని తల్లిదండ్రులను తాళ్లతో కట్టేసి ఇంట్లోని బంగారం ఎత్తుకెళ్లారు. యజ్ఞ అగర్వాల్‌ టెక్స్‌టైల్స్‌ యజమాని అగర్వాల్‌ ఇంట్లో ఈ దొంగతనం జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

* గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పల్లపాడులో ఐదు రోజుల క్రితం జరిగిన బండారు గోపి (19) హత్య కేసును చేబ్రోలు పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు కులాంతర ప్రేమే కారణమని పోలీసులు గుర్తించారు. గోపి హత్య కేసులో మొత్తం 11 మంది నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హత్యకు సంబంధించిన వివరాలను గుంటూరు దక్షిణ మండల డీఎస్పీ జెస్సీ ప్రశాంతి మీడియాకు వెల్లడించారు.

* సెల్ఫీ సరదా ఇద్దరు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. నల్గొండ జిల్లాలోని డిండి జలాశయంలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. శ్రీశైలం దర్శనానికి వెళ్లొస్తూ ఇద్దరు స్నేహితులు డిండి జలాశయం వద్ద ఆగారు. ఈ క్రమంలో సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జలాశయంలో పడి మృతిచెందారు. మృతులను జహీరాబాద్‌కు చెందిన సాగర్‌, ప్రవీణ్‌గా గుర్తించారు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

* మధ్యప్రదేశ్‌లోని షాహ్డోల్‌ జిల్లాలో నలుగురు వ్యక్తులు అరాచకానికి పాల్పడ్డారు. ఓ దుకాణంలో సిగరెట్లు తీసుకొని డబ్బులు అడిగితే ఆ దుకాణ యజమానిని కొట్టిచంపారు. షాహ్డోల్‌ జిల్లా కేంద్రానికి 90కి.మీల దూరంలో డియోలాండ్‌ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో నలుగురు వ్యక్తులు అరుణ్‌ సోని అనే వ్యక్తి దుకాణం వద్దకు వెళ్లారు. సిగరెట్లు అడిగారు. అయితే, డబ్బులు ఇవ్వాలని అరుణ్ సోని అడగ్గా.. ఆయనపై దాడి చేశారు. అడ్డుపడిన దుకాణ యజమాని కొడుకులపైనా దాడిచేశారని సబ్‌డివిజనల్‌ పోలీస్‌ అధికారి భవిష్య భాస్కర్‌ తెలిపారు. ఈ దాడి అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లిన కాసేపటికే దుకాణ యజమాని మృతి చెందినట్టు చెప్పారు. ఈ కేసులో మోనుఖాన్‌, పంకజ్‌ సింగ్‌, విరాట్‌ సింగ్‌, సందీప్‌ సింగ్‌లను నిందితులుగా గుర్తించిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.