Kids

ఊబకాయ చిన్నారులు పెరిగిపోతున్నారు

ఊబకాయ చిన్నారులు పెరిగిపోతున్నారు

నిన్నటి తరం పిల్లలు ఆరుబయట ఆటలాడుకునేవారు. ఒకచోట కుదురుగా నిలిచేవారు కాదు. క్షణం తీరిక దొరికినా.. ఆటల్లో మునిగి తేలేవారు. దీనివల్ల చురుగ్గా, ఆరోగ్యంగా ఉండడంతో పాటు నాజూకుగానూ తయారయ్యేవాళ్లు. కానీ, ఈ తరం పిల్లలకు ఈ అవకాశమే లేకుండా పోతోంది. వీళ్లకు ఆటలంటే.. ఫోన్‌, కంప్యూటర్‌ గేమ్సే. ఇల్లు, స్కూలు, ఆన్‌లైన్‌ ఆటలు.. ఇంతకుమించి వేరే ప్రపంచమే లేకుండాపోతోంది. దీంతో.. శారీరక శ్రమకు పూర్తిగా దూరమైపోతున్నారు. దీనికి తోడు.. ఫాస్ట్‌ఫుడ్స్‌ పేరుతో తీసుకుంటున్న జంక్‌ఫుడ్‌. ఇదంతా కొలెస్ట్రాల్‌ రూపంలో పేరుకుపోయి.. చిరు ప్రాయంలోనే ఊబకాయం బారిన పడుతున్నారు. బాల భీముల్లా తయారవుతున్నారు. ఈ వివరాలను జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎస్‌)-5 నివేదిక పేర్కొంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ.. ఈ సర్వే ఫలితాలను ఇటీవల విడుదల చేసింది.
**బాలల్లో ఊబకాయం సమస్య పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స-4లో బాల ఊబకాయుల సంఖ్య 2.1 శాతంగా ఉండగా.. ఈ తాజా సర్వేలో అది 3.4 శాతానికి పెరిగిందని చెప్పింది. మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బాల ఊబకాయుల సంఖ్య ఎక్కువవుతోందని తేల్చింది. ఆంధ్రప్రదేశ్‌ సహా మహారాష్ట్ర, గుజరాత్‌, మిజోరాం, త్రిపుర, లక్షద్వీప్‌, జమ్ముకశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, లద్దాఖ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఐదేళ్ల లోపు పిల్లల్లో ఊబకాయుల సంఖ్య ఎక్కువకాగా.. గోవా, తమిళనాడు, డయ్యూడామన్‌, దాద్రానగర్‌ హవేలిలో ఈ సంఖ్య తగ్గిందని తాజా సర్వే పేర్కొంది. ఈ సమస్య బాలల్లోనే కాదు.. పెద్దల్లోనూ ఎక్కువవుతోందట! గత సర్వేలో 20.6 శాతం మంది మహిళలు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు తేలితే.. తాజా సర్వేలో అది 24 శాతానికి పెరిగిందని ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎస్‌-5 తేల్చింది. అలాగే, పురుష ఊబకాయుల సంఖ్య కూడా గతంలోని 18.9 శాతం నుంచి 22.9 శాతానికి పెరిగింది. మహిళల్లో ఊబకాయం సమస్య 30 రాష్ట్రాల్లో తీవ్రంగా కనిపించగా.. పురుషుల్లో 33 రాష్ట్రాల్లో అధికంగా నమోదైంది. పెద్దల్లో కూడా శారీరక శ్రమ లోపించడం వల్లే ఊబకాయం సమస్య పెరుగుతోందని నిపుణులు తెలిపారు. గడచిన 15 ఏళ్లలో ప్రజల ఆదాయం భారీగా పెరగడంతో.. వారి జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లలోనూ మార్పులు వచ్చాయని, దీనితో పాటే.. ఊబకాయం సమస్య కూడా వచ్చిపడిందని చెప్పారు.