Editorials

శల్య సారధ్యం అంటే ఏమిటి?

శల్య సారధ్యం అంటే ఏమిటి?

 

ఒకరి పక్షాన ఉండి, శత్రు పక్షం వారికి సాయం చేయటాన్ని శల్య సారధ్యం అంటారు. శరీరం మాత్రం మిత్ర పక్షంలో ఉండి, మనసంతా శత్రువుకు సాయం చేయాలనే ఆలోచనలు వుండే నాయకత్వాన్ని శల్య సారధ్యం తో పోల్చడం ఆనవాయితీగా అనాదిగా వస్తుంది. ఇది ఎలా వచ్చిందో దీన్ని గురించి తెలుసుకుందాం.
శల్యుడు పాండవులకు మేనమామ. నకులుడు, సహదేవుడుకు తల్లి అయిన మాద్రిదేవి కి స్వయాన సోదరుడు. మాద్రా దేశానికి రాజు. గొప్ప వీరుడు. రథాన్ని నడపటంలో శ్రీకృష్ణుడు అంతటి వాడు. కానీ భోజన ప్రియుడు, మద్యం సేవించే బలహీననత కలవాడు.
కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షాన పోరాడదలుచుకున్నాడు. తన అల్లుళ్ళ తరుపున పోరాడకుండా కౌరవుల తరుపున ఎలా పోరాడుతాడు? తన పరివారంతో యుద్ధానికి బయలుదేరాడు.
మార్గమధ్యంలో దుర్యోధనుడు కలిశాడు. మంచి విందు ఇచ్చాడు. మద్యంలో ముంచి తేల్చాడు. ఆ మత్తులో కౌరవుల పక్షం యుద్ధం చేస్తానని వాగ్ధానం చేసాడు. అన్న మాట ప్రకారం కౌరవ పక్షమే వున్నాడు. కానీ మనసులో మాత్రం పాండవులే గెలవాలని కోరుకునేవాడు.
పాండవ వీరుడు అర్జునుడికి రధ సారధి శ్రీకృష్ణుడు. కౌరవ వీరుడు కర్ణుడికి రధ సారధిగా శల్యుడు నియమింపబడ్డాడు. తన అపారమైన అనుభవంతో కర్ణుడిని అవలీలగా గెలిపించగల సామర్థ్యం శల్యుడికి ఉంది. కానీ తన మేనల్లుడు అర్జునుడు గెలవాలనే శల్యుడు కోరుకున్నాడు.
కురుక్షేత్ర మహా సంగ్రామం ప్రారంభమైంది. కర్ణుడి పోరాట పటిమ ముందు అర్జునుడు తల్లడిల్లి పోతున్నాడు. అర్జునుడిని గెలిపించాలని మనసులో సిద్ధమైన శల్యుడు యుద్ధం చేస్తున్న కర్ణుడిని నానా మాటలు అనటం మొదలు పెట్టాడు. కులంతో దూషించాడు. సూటిపోటి మాటలతో వేధించాడు. అనేక విధాలుగా కించ పరిచాడు. మనసును గాయపరిచి మానసిక వేదనను కలిగించాడు. మానసిక దుర్భలుడైన కర్ణుడు యుద్ధంలో తన ప్రభావం, ప్రతాపం చూపలేక పోయాడు.
అదే అదునుగా అర్జునుడు ప్రత్యర్థి కర్ణుడిని ఓడించాడు. అర్జునుడి విజయంలో, కర్ణుడి ఓటమిలో కీలక భూమికి పోషించింది శల్యుడే. ఇలాంటి శల్యుడు లాంటి నాయకత్వాన్నే ‘శల్య సారధ్యం’ అంటారు.