Health

రోజంతా కూర్చోకండి…వ్యాయమం ఒక్కటే ఆరోగ్యానికి సూత్రం

రోజంతా కూర్చోకండి…వ్యాయమం ఒక్కటే ఆరోగ్యానికి సూత్రం

మీరు కుర్చీకి అతుక్కుపోయి పనిచేస్తారా? శారీరక శ్రమ అస్సలు చేయారా? అయితే మీకు హృద్రోగ ముప్పు పొంచి ఉన్నట్టే! దీర్ఘకాలిక వ్యాధులు దరిచేసే సమయం ఆసన్నమైనట్టే! వారానికి కనీసం 3 గంటలైనా ఫిజికల్‌ యాక్టివిటీ లేనివారికి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు ఉంటుందని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. గంటల తరబడి కుర్చీలకు పరిమితమయ్యే ఉద్యోగాలు చేసేవారు ఎక్కువ శాతం ఒత్తిడికి గురికావడంతో గుండెపోటు, డయాబెటిస్‌, హైబీపీ, బీపీతోపాటు గుండె వ్యాధులు పెరుగుతున్నాయని తేల్చారు. ఐటీ, ఐటీయేతర ఉద్యోగుల జీవన శైలిని పరిశీలించిన ఎన్‌ఐఎన్‌ సైంటిస్టులు.. 22 శాతం మంది మాత్రమే శారీరక వ్యాయామాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు గుర్తించారు. మెజార్టీ జనాల్లో జీవక్రియలు సమస్యాత్మకంగా ఉన్నాయని, మెటబాలిక్‌ సిండ్రోమ్‌, హెడీఎల్‌, అధిక బరువు, బానపొట్ట వంటి సమస్యల బారిన పడుతున్నారని తేల్చారు. ఆడవారి కంటే మగవారిలో అధిక బరువు సమస్యలు ఉండగా.. మహిళల్లో పరిమితికి మించి ట్రైగ్లిజరైడ్స్‌ 150 మైక్రోగ్రాములు ఉన్నదని వెల్లడించారు. ఎక్కువ గంటలపాటు కదలకుండా కూర్చొండి పోయేవారిలో జీవక్రియలు మందగిస్తున్నాయని, ప్రధానంగా జీర్ణసంబంధిత వ్యాధుల బారినపడుతున్నారని పరిశోధకులు గుర్తించారు. కనీసం 8 గంటలపాటు పనిచేసేవారు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో శారీరక వ్యాయామాలు లేదా కదలికలు చేయడం వలన గుండె రక్తప్రసరణ మెరుగు పడటమే కాకుండా రక్తనాళాల్లో కొవ్వులు పేరుకుపోయే ప్రమాదం కొంత మేర తగ్గుతుందని సూచించారు.