DailyDose

ఉద్యోగ నైపుణ్యాలున్న 18-21 ఏళ్ల యువతలో తెలంగాణ అగ్రస్థానం!

ఉద్యోగ నైపుణ్యాలున్న 18-21 ఏళ్ల యువతలో తెలంగాణ అగ్రస్థానం!

ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలున్న 18-21 ఏళ్ల యువతలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఆ వయసులోని 85.45 శాతం మందికి కొలువుకు తగిన అర్హతలున్నాయి. ఇక నగరాల్లో చూస్తే పుణె(80.82%) తొలి స్థానంలో నిలవగా.. హైదరాబాద్‌ ఏడో స్థానం(51.50%) దక్కించుకుంది. అదే సమయంలో వయసుకు అతీతంగా నైపుణ్యమున్న యువతను పరిగణనలోకి తీసుకుంటే హరియాణా(76.47%) తొలిస్థానంలో నిలవగా తెలంగాణ(67.79%)కు ఆరోస్థానం దక్కింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ), ఇతర సంస్థలతో కలిసి వీబాక్స్‌ రూపొందించిన ‘భారతదేశ నైపుణ్య నివేదిక’ను తాజాగా విడుదల చేసింది. యువతలో ఉద్యోగ నైపుణ్యాలకు సంబంధించి వీబాక్స్‌ సంస్థ సర్వేలో భాగంగా గత 11 సంవత్సరాలుగా వీబాక్స్‌ నేషనల్‌ ఎంప్లాయబిలిటీ టెస్ట్‌(వీనెట్‌)ను నిర్వహిస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 3.88 లక్షల మంది పరీక్షలో పాల్గొన్నారు. వారిలో దేశవ్యాప్త సగటు(60 శాతం మార్కులు సాధించింది) 51.25 శాతం ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ‘గత కొద్ది సంవత్సరాలుగా ఉద్యోగ నైపుణ్యాల్లో రాష్ట్ర యువత పురోగమిస్తోంది. విద్యాశాఖ మరింత దృష్టి సారిస్తే మనం ప్రపంచానికి అత్యున్నత సాంకేతిక నిపుణులను అందించవచ్చు. అందుకు పరిశ్రమలతో అనుసంధానం పెంచుకోవడం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై దృష్టి సారించడం, ఇంటర్న్‌షిప్‌లను కల్పించాలి’ అని సన్‌టెక్‌ కార్ప్‌ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌, ట్రైనింగ్‌ సంస్థ సీఈఓ వెంకట్‌ కాంచనపల్లి అభిప్రాయపడ్డారు.

సర్వే నివేదికలో ముఖ్యాంశాలు..
అత్యధిక న్యూమరికల్‌ స్కిల్స్‌ ఉన్న యువత తెలంగాణలోనే ఉంది. ఇక్కడ 78.68 శాతం మందిలో ఆ నైపుణ్యాలున్నాయి. ఆతర్వాత ఏపీ (69.45 శాతం) నిలిచింది.

అత్యధిక (44.01 శాతం) ఉద్యోగ నైపుణ్యాలున్న అమ్మాయిలతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది.

ఉద్యోగం చేసేందుకు యువతీ యువకుల తొలి ప్రాధాన్య రాష్ట్రంగా కేరళ నిలిచింది. యువతులు ఎక్కువగా కొచ్చి నగరాన్ని కోరుకుంటున్నారు.

ఆంగ్ల భాషా నైపుణ్యాల్లో కర్ణాటక(73.33 శాతంతో) తొలి స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత యూపీ(68.75 శాతం), కేరళ(61.66 శాతం) ఉన్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z