Business

ఫాస్టాగ్ జాబితా నుండి పేటీఎం తొలగింపు-BusinessNews-Feb162024

ఫాస్టాగ్ జాబితా నుండి పేటీఎం తొలగింపు-BusinessNews-Feb162024

* ప్రముఖ స్పోర్ట్స్‌వేర్‌ తయారీ సంస్థ నైకీ ఉద్యోగుల తొలగింపునకు (Job Cuts in Nike) సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో రెండు శాతం సిబ్బందిని తీసివేయనున్నట్లు ప్రకటించింది. సంస్థలో 83,700 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల తొలగింపు తప్పట్లేదని నైకీ (Nike) తెలిపింది. భవిష్యత్‌ విక్రయాల అంచనాలు నిరాశాజనకంగా ఉన్న నేపథ్యంలో కార్యకలాపాలను క్రమబద్ధీకరించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని పేర్కొంది. వృద్ధి అవకాశాలను మెరుగుపర్చడానికి కఠిన నిర్ణయాలు తప్పడం లేదని చెప్పింది. దాదాపు రెండు బిలియన్‌ డాలర్ల ఖర్చులను ఆదా చేయాలనుకుంటున్నట్లు కంపెనీ డిసెంబర్‌లోనే ప్రకటించడం గమనార్హం. అప్పటి నుంచి దాని షేర్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు శాతం నష్టపోయాయి.

* పేటీఎంకు దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. తాజాగా ఫాస్టాగ్‌ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌)ను తొలగించారు. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) తరఫున టోల్‌ రుసుము వసూలు చేసే భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ(ఐహెచ్‌ఎంసీఎల్‌) ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాము తెలిపిన బ్యాంకుల నుంచే ఫాస్టాగ్‌లు కొనుగోలు చేయాలని చెప్పింది.

* ప్రముఖ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ కొనుగోలు దారులకు బంపరాఫర్‌ ప్రకటించింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ ధరల్ని రూ.25 వేల వరకు తగ్గించినట్లు వెల్లడించింది. ఓలా ఎలక్ట్రిక్‌ సంస్థ వాహనదారులకు మొత్తం మూడు మోడళ్లపై ఈ భారీ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఓలా అఫిషియల్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. ఓలా ఎస్‌1 ఎక్స్‌ ప్రారంభ ధర రూ.79,999 (ఎక్స్‌ షోరూం ధర) ఉండగా, ఓలా ఎస్‌1 ఎయిర్‌ ప్రారంభ ధర రూ.1,19,999 (ఎక్స్‌ షోరూం ధర), ఓలా ఎస్‌1 ప్రో ప్రారంభ ధర రూ.1,29,999 (ఎక్స్‌ షోరూం) కే అందిస్తుంది.

* ఏంజెల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ఇన్‌ఫ్లెక్షన్‌ పాయింట్‌ వెంచర్స్‌ (ఐపీవీ) అంకుర సంస్థల్లో ఈ ఏడాది సుమారు రూ. 150–200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్లు సంస్థ సీఈవో వినయ్‌ బన్సల్‌ తెలిపారు. డ్రోన్, స్పోర్ట్స్, హెల్త్, ఫిన్‌టెక్‌ సంస్థల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. తమ దగ్గర రూ. 1,200 కోట్ల నిధులు ఉండగా ఇప్పటివరకు రూ. 750 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు ఆయన వివరించారు. 2023లో 56 పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. వీటిల్లో 46 కొత్తగా ఇన్వెస్ట్‌ చేసినవి కాగా మిగతావి ఫాలో–ఆన్‌ పెట్టుబడులని బన్సల్‌ పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z