Business

5 నిముషాలకు ఒక కారు అమ్మకం-BusinessNews-Feb192024

5 నిముషాలకు ఒక కారు అమ్మకం-BusinessNews-Feb192024

* ఆర్‌బీఐ(RBI) ఆంక్షల వేళ సంస్థ కార్యకలాపాలపై వ్యక్తమవుతోన్న అనుమానాలను నివృత్తి చేస్తూ.. పేటీఎం(Paytm) బాస్ విజయ్ శేఖర్ శర్మ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారు. ఈ డిజిటల్ పేమెంట్స్‌ యాప్‌ గురించి ఓ వార్తాపత్రికలో వచ్చిన ప్రకటనను షేర్ చేసి, స్పష్టత ఇచ్చారు. ‘భారత్‌లోని పేటీఎం క్యూఆర్‌, సౌండ్‌బాక్సులు పనిచేస్తూనే ఉంటాయి. ఈ రోజు, రేపు, ఎల్లప్పుడూ పేటీఎం చేయండి’ అని పోస్టు పెట్టారు. అలాగే క్యూఆర్‌, సౌండ్‌ బాక్సులకు సంబంధించిన వదంతులపై జాగ్రత్త అంటూ ఆ పోస్టులో సంస్థ హెచ్చరించింది. జనవరి 31న పేటీఎంపై ఆంక్షలు విధిస్తూ ఆర్‌బీఐ(RBI) ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లు స్వీకరించొద్దని ఆదేశాల్లో పేర్కొంది. తాజాగా ఈ గడువును మార్చి 15 వరకు పొడిగించింది. పీపీబీఎల్‌ ఖాతాదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగదు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. పేటీఎం వ్యాలెట్‌, పేమెంట్స్‌ ద్వారా కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలపై ఆడిట్ నివేదిక తర్వాతే ఈ చర్యలు తీసుకుంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు వరుసగా ఐదో రోజూ లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 281 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ జీవనకాల గరిష్ఠాన్ని తాకి వెనక్కి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. ఉదయం దేశీయ సూచీలు పాజిటివ్‌గా మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 85 పాయింట్లు, నిఫ్టీ 45 పాయింట్లు పుంజుకొని ట్రేడింగ్‌ను కొనసాగించాయి. ఈ క్రమంలో ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ స్టాక్స్‌ మార్కెట్‌ లాభాల్లో పయనించడానికి ఊతం ఇచ్చాయి.

* దేశంలో విద్యుత్తు ప్రాజెక్టుల అమలు కోసం సుమారు రూ.656 కోట్ల పెట్టుబడిని బోర్డు ఆమోదించిందని ప్రభుత్వ యజమాన్యంలోని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ సోమవారం తెలిపింది. బీఎస్‌ఈ ఫైలింగ్‌ ప్రకారం రూ.514.66 కోట్ల అంచనా వ్యయంతో యూనిఫైడ్‌ లోడ్‌ డిస్పాచ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ (ULDC) ఫేజ్‌-III (SCADA/EMS) అప్‌గ్రేడేషన్‌ ప్రాజెక్ట్‌ – నార్తర్న్‌ రీజియన్‌ SLDCల అమలును బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ ఆమోదించింది. భివానీలో రూ.141.09 కోట్ల అంచనా వ్యయంతో 765/400 కేవీ, 1500 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రాజెక్ట్‌ల పెట్టుబడిని కమిటీ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించింది. దీన్ని 2025, మే 5 నాటికి ప్రారంభిస్తారు.

* టాటా గ్రూప్‌ (TATA Group) కంపెనీలైన ఎయిరిండియా, ‘టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (TASL)’ కర్ణాటకలో రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. దీనివల్ల దాదాపు 1,650 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఈమేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి.పాటిల్‌ సమక్షంలో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరింది.

* భారత్‌లో ప్రముఖ తయారీ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) సరికొత్త రికార్డ్‌లను నమోదు చేసింది. దేశీయంగా హ్యుందాయ్ క్రెటా వన్‌ మిలియన్‌ అమ్మకాల మార్కును సాధించినట్లు తెలిపింది. 2015లో మార్కెట్‌కి పరిచయమైన క్రెటా కేవలం ఎనిమిదేళ్లలోనే ఈ ఘనత సాధించింది. ఈ సమయంలో, క్రెటా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీగా కొనసాగుతోంది. ప్రతి 5 నిమిషాలకు ఒక క్రెటా అమ్ముడవుతోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z