Devotional

₹75కోట్లతో మేడారం జాతర ఏర్పాట్లు

Medaram Jatara Arrangement Costs 75Crore From Telangana Budget-₹75కోట్లతో మేడారం జాతర ఏర్పాట్లు

మేడారం మహాజాతర..రెండేళ్లకోసారి జరిగే ఉత్సవం. కోటి మందికిపైగా భక్తజనులు తరలివస్తారు.. వసతులు కల్పించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.. పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.. ఇక అధికారులు సమన్వయంతో కదలాలి. 95 రోజుల్లో పకడ్బందీగా రూ.75 కోట్లు పెట్టి సకల సౌకర్యాలు కల్పించాలి. జాతరను విజయవంతం చేయాలి. ప్రజల మన్ననలు పొందాలి.వనదేవతల జాతరకు సమయం ఆసన్నమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరుగుతుంది. అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం అక్టోబరు 26న రూ.75 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 95 రోజుల్లో 21 శాఖలు రూ. 75 కోట్లు ఖర్చు పెట్టాలి. జాతరకు ఒక రోజు ముందే నాణ్యతాప్రమాణాలతో కూడిన పనులు పుర్తి చేయాలి. ప్రణాళికా, పర్యవేక్షణ, పనుల్లో వేగం ఉంటేనే సాధ్యం. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సకాలంలో పూర్తవుతాయి. అధికారులు సవాల్‌గా తీసుకొని ముందడుగు వేయాలి. నిధులు కేటాయించిన శాఖలకు పాలనాధికారి నుంచి పాలనాపరమైన అనుమతులు తీసుకోవాలి. సమయాభావం వల్ల దాదాపుగా అన్ని పనులను షార్ట్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. వారంలో దరఖాస్తులు స్వీకరించి వాటిని ఓపెన్‌ చేసి టెండర్లను ఖరారు చేస్తారు. అగ్రిమెంట్లు కుదుర్చుకుని గుత్తేదారులకు పనులు అప్పగించాలి. ఈ ప్రక్రియకు కనీసం 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడున్న 95 రోజుల్లో 15 రోజులు మినహాయిస్తే ఉన్నది కేవలం 70 రోజులే. జనవరి 15 కల్లా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఉన్నది కేవలం 55 రోజులే. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా పనులు వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉంది.
*** గతం పునరావృతం కావద్ధు.
నిధుల మంజూరులో ఎప్పుడూ జాప్యం జరుగుతోంది. పనులు ఆలస్యంగా ప్రారంభించి హడావుడి చేసి మమా అనిపిస్తారు. ఓ వైపు జాతరకు భక్తులు తరలివస్తుంటే మరోవైపు పనులు జరుగుతూనే ఉంటాయి. నాణ్యతను కూడా పెద్దగా పట్టించుకోరు. నిబంధనలు గాలికి వదిలేస్తుంటారు. కనీసం మరో జాతర సమాయానికి కూడా ఆ పనులు నిలువవు. ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.సమయం తక్కువగా ఉన్నందున అధికారులు పకడ్బందీ ప్రణాళికతో సాగాలి.
*** సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
జాతర ఏర్పాట్లలో 21 శాఖలు కీలకం. ప్రధానమైన 530 పనులతో పాటు 531 ఇతర వ్యవహారాలు చేపట్టేందుకు ఆయా శాఖలకు నిధులు కేటాయించారు. సమయం వృథా చేయకుండా పనులు వీలైనంత త్వరగా చేపట్టాల్సిన అవసరం ఉంది. గతేడాది కంటే ఈ ఏడాది రూ. 5.50 కోట్లు తక్కువగా కేటాయించారు. అనుకున్న అంచనాలకంటే తక్కువ మొత్తంలో నిధులు వచ్చాయి. ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోవాలి. రహదారులు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్తు, అంతర్గత రోడ్లు, కల్వర్టులు, ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణాలు ముందుగానే ఆరంభించి పూర్తిచేయాలి. పార్కింగ్‌, హోల్డింగ్‌ పాయింట్లు, క్యూలైన్లు, ఆలయానికి రంగులు, ఇతరత్రా పనులు జాతరకు కొద్దిరోజుల ముందు చేపట్టినా సమస్య ఉండదు.
*** అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి..
జాతరకు 20 రోజుల ముందే పనులు చేపట్టాలని కలెక్టర్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గడువులోగా చేయాలంటే అధికారులు తప్పనిసరగా క్షేత్రస్థాయిలో నిత్యం పర్యవేక్షించాలి. పనుల్లో నాణ్యత, పారదర్శకత, నిధులను పొదుపుగా వాడుకోవడం తదితర అంశాలపై దృష్టి సారించాలి. ఉన్నతాధికారులు, కిందిస్థాయి సిబ్బంది, గుత్తేదారులు, పాలకులు కలిసికట్టుగా కదిలితేనే పనులు పూర్తవుతాయి.