Business

₹100 వైపు లీటర్ పెట్రోల్ పరుగు-వాణిజ్యం

₹100 వైపు లీటర్ పెట్రోల్ పరుగు-వాణిజ్యం

* దేశంలో ఇంధన ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. కొత్త రికార్డుల్లో దూసుకుపోతున్నాయి. దేశ రాజధానిలో బుధవారం పెట్రోల్‌, డీజిల్‌పై మరో 25పైసలు పెరిగింది. దీంతో దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర అత్యంత గరిష్ఠానికి చేరి రూ. 86.30గా ఉంది. ఇక డీజిల్‌ ధర కూడా రూ.76.48కి చేరింది.

* చైనా సామాజికమాధ్యమ సంస్థ బైట్‌డాన్స్‌ భారత్‌లో కార్యకలాపాలకు బై బై చెప్పేందుకు సిద్ధమైంది. టిక్‌టాక్‌ సహా ఇతర చైనీస్‌ యాప్‌లపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసిన నేపథ్యంలో, సిబ్బంది తగ్గింపుపై బైట్‌డాన్స్ తన భారత ఉద్యోగులకు సమాచారమిచ్చింది. భారత్‌లో తమ సంస్థ కార్యకలాపాలు, సిబ్బంది తగ్గించే నిర్ణయాన్ని టిక్‌టాక్‌ తాత్కాలిక గ్లోబల్‌ హెడ్‌ వనెస్సా పప్పాస్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ బ్లేక్‌ చాండ్లీ సిబ్బందికి ఈ మెయిల్‌ ద్వారా సమాచారమిచ్చారు. భారత్‌కు మళ్లీ తిరిగి రావడంపై సందేహమేనన్న బైట్‌డాన్స్‌ ప్రతినిధులు, రానున్న రోజుల్లో అలా జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

* దేశీయ మార్కెట్లు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌.. విదేశీ సంస్థాగత మదుపరుల లాభాల స్వీకరణ వంటి అంశాలు మన మార్కెట్లను పడేశాయి. ముఖ్యంగా బ్యాంకు, ఆటో, మెటల్‌, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో వరుసగా నాలుగో రోజూ మన మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 900 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 14 వేల మార్కును కోల్పోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ ₹72.92గా ఉంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. బుధవారం ఉదయం 9:42 గంటల సమయంలో సెన్సెక్స్‌ 264 పాయింట్లు నష్టపోయి 48,065 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 86 పాయింట్ల నష్టంతో 14,153 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.90 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తుండడం సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది. మరోవైపు టీకా అందుబాటులోకి రావడం, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం వంటి సానుకూల సంకేతాలతో ఇటీవల భారీ లాభాలను మూటగట్టుకున్న మార్కెట్లు స్థరీకరణ దిశగా సాగుతుండడం కూడా సూచీలు దిగజారడానికి కారణంగా తెలుస్తోంది.

* ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఏ చిన్న వస్తువు కొనలన్నా ఆన్లైన్ ఈ కామర్స్ దిగ్గ్గజం ‘అమెజాన్’లో కొనేస్తున్నాం. ఇప్పుడు పట్టణాల నుంచి పల్లె ప్రాంతాల కూడా అమెజాన్ సేవలు విస్తరించాయి. అంతలా నెటిజన్లకు దగ్గరైన అమెజాన్‌ గత కొన్నేళ్లుగా ఒకే లోగోతో కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న లోగోలో అమెజాన్‌ పేరు, నీలి రంగులో షాపింగ్‌ కార్టు బొమ్మ మనకు కనిపిస్తాయి. పలు యాప్‌ స్టోర్‌ల్లో కూడా అదేవిదంగా మనకు కనిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఇకపై మరో కొత్త అవతార్‌తో ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. యాపిల్‌ యూజర్లు కొందరు కొత్త అమెజాన్ ఐకాన్‌ ను గుర్తించారు. కొత్త ఐకాన్(క్రింద)లో పేరు లేకుండా బ్రౌన్ బ్యాక్‌గ్రౌండ్‌లో అమెజాన్ సంతకం బాణం/ స్మైల్ లోగో డిజైన్‌ను రూపొందించారు. మొత్తంగా లోగో డిజైన్‌ ‘షిప్పింగ్‌ బాక్స్‌’లను పోలి ఉండేలా తీర్చిదిద్దారు.