Politics

మునుగోడు మాకు సెమీ ఫైనల్స్ – TNI నేటి రాజకీయ వార్తలు

మునుగోడు మాకు సెమీ ఫైనల్స్ –  TNI  నేటి  రాజకీయ వార్తలు

*మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్స్ అని అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తామంతా తృప్తిగానే ఉన్నామని ప్రకటించారు. కాంగ్రెస్ ఎవరి సొంతం కాదని, పార్టీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. పేరు, ఊరూ లేని వాడు సోషల్ మీడియాలో తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. కాంగ్రెస్‌ను బలహీన పరిచే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే తాము కాంగ్రెస్ అని చెప్పుకోవాల్సి వస్తోందన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తామని జీవన్‌రెడ్డి తెలిపారు.కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి కూడా సోమవారం రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని నేరుగా కలిసి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ పరిణామంతో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక ఎప్పుడు ఉండబోతుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. రాజకీయ పార్టీలు ఇప్పటికే మునుగోడులో నిలబెట్టే అభ్యర్థిపై కసరత్తు మొదలుపెట్టాయి.

* పేరు ఊరూ లేని వాడు సోషల్ మీడియాలో…: భట్టి
పేరు ఊరూ లేని వాడు సోషల్ మీడియాలో మేము పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్‌ను బలహీన పరిచే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తామే కాంగ్రెస్ అని చెప్పుకోవాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ కోటను తామే నిలబెట్టామన్నారు. అలాంటి తమపై తప్పుడు కథనాలు రాస్తున్నారని దుయ్యబట్టారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.

* ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..సీఎం జగన్
రైతు భరోసా కేంద్రాలను పౌరసరఫరాల శాఖతో అనుసంధానం చేసే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఆర్బీకేల కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగడానికి లైన్‌ డిపార్ట్‌మెంట్లతో సమర్థవంతమైన సమన్వయం ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. క్రమం తప్పకుండా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు సాయిల్‌ కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. అదే విధంగా సాయిల్‌కార్డులతోపాటు ఆ భూమికి తగిన విధంగా ఎరువులు, పంటలసాగుపై సలహాలు అందించాలన్నారు. ఖరీఫ్‌ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. కనీస మద్దతు ధర కన్నా.. ఒక్క పైసా కూడా తగ్గకూడదని పేర్కొన్నారు. రైతులకు ఎంఎస్‌పీ ధర అందాల్సిందేనన్న ముఖ్యమంత్రి.. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని స్పష్టం చేశారు.

* ఎంపీ మాధవ్‌ని సస్పెండ్ చేయకపోతే.. జగనే సస్పెండ్ అవుతారు: ఆలపాటి
హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామనేది బూటకమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. మార్ఫింగ్ జరిగిందో లేదో అరగంటలో నిర్దరించే టెక్నాలజీ వచ్చిందని.. ధైర్యముంటే హైదరాబాద్ సెంట్రల్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని డిమాండ్ చేశారు. ఎంపీ మాధవ్‌ని సస్పెండ్ చేయకపోతే జగనే సస్పెండ్ అవుతారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. ఎంపీ వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామనేది బూటకమని.. మార్ఫింగ్ జరిగిందో లేదో అరగంటలో నిర్ధారించే టెక్నాలజి వచ్చిందన్నారు. జగన్కి ధైర్యం ఉంటే హైదరాబాద్లోని సెంట్రల్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలని సవాల్‌ చేశారు. అత్యాచారం జరిగిన చోటుకి హోంమంత్రి వెళ్లాలన్నా.. సీఎం అనుమతి కావాల్సి రావటం పరిపాలనా దుస్థితని దుయ్యబట్టారు. వార్డు మెంబర్గా కూడా పనికిరాని వ్యక్తిని ఎంపీ చేసి రాష్ట్ర పరువు తీశారని విమర్శించారు. రాష్ట్ర పరువు కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్పై ఉందని ఆలపాటి అన్నారు.

* నీతి అయోగ్‌ను ప్రవేశపెట్టడం చారిత్రక తప్పిదం: తులసిరెడ్డి
మోదీ సర్కార్ప్ర ణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి అయోగ్‌ ను ప్రవేశపెట్టడం చారిత్రక తప్పిదమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటికైనా కేంద్రం పునరాలోచన చేయాలని హితవుపలికారు. నీతి అయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదా, పోలవరం, విభజన అంశాల అమలు గురించి ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించినట్లు జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

* మునుగోడులో గెలిచేది మేమే: ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కర్ణుడు బయటకు వెళ్లిపోయాడని చెప్పారు. మునుగోడులో గెలిచేది తామేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్‌ రెడ్డికి అసెంబ్లీతో బంధం తెగిపోయిందన్నారు. రాజీనామాతో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కి బలం పెంచుకునే అవకాశం ఇచ్చినట్లయిందని చెప్పారు.రాజీనామాతో అభివృద్ధి అనేది సరైన వ్యూహం కాదని తెలిపారు. మూడేండ్లుగా రాజగోపాల్‌రెడ్డి చేసిన ఉద్యమేంటని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉద్యమం చేస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ వద్దని చెప్పిందా అని నిలదీశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయడమంటే చేతకానితనమని విమర్శించారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను ప్రజలు ఎలా చూస్తారనేది చూడాలన్నారు. కాగా, మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే.. అధికారంలోకి వచ్చినట్లేనని చెప్పారు. బరిలో నిలిచే అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు.

*చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేయాలి: చాడ
చేనేత వస్త్రాలపై విధించిన 12 శాతం జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం ఎత్తేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. చేనేత రంగంపై ఆధారపడిన వారిలో నిరుపేదలే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. జీఎస్టీ విధించడం వల్ల చేనత వస్త్రాల ధర పెరిగి డిమాండ్ తగ్గుతుందని తెలిపారు.

*జగన్ శాడిస్టు కాబట్టే..న్యూడిస్టు మాధవ్కు ప్రోత్సాహం: గ్రీష్మ
జగన్ శాడిస్టు కాబట్టే గోరంట్ల మాధవ్ లాంటి న్యూడిస్టులను ప్రోత్సహిస్తున్నాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ విమర్శించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున రాష్ట్ర మహిళలు అమ్మవారిని పూజిద్దామనుకుంటే.. అష్ట దరిద్రపు వీడియో దర్శనమిచ్చింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం వస్తోందని సంతోషిద్దామంటే.. గోరంట్ల గబ్బు పట్టించాడు. ఇది తెలుగు వారికి జగన్ ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలేమో? వైసీపీ నాయకులకు సిగ్గూఎగ్గూ, మానం, మర్యాద ఏమీ లేవు. మాధవ్ తప్పు చేశాడని వైసీపీలో ఒక్కరూ చెప్పడం లేదు. వారిలో పశ్చాత్తాప భావనే లేదు’ అంటూ విమర్శించారు.

*వైసీపీ నేతలకు గడప గడపలో ఛీత్కారాలే: యనమల
గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ నిలదీస్తుంటే.. అధికార పార్టీ దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. జనం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చాలా మంది ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారని, ఆర్థిక మంత్రి బుగ్గన అయితే సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని యనమల ఎద్దేవా చేశారు. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అని చెప్పిన జగన్ని నమ్మి ఓటేసినందుకు నిట్టనిలువునా మోసం చేశారంటూ తిట్ల దండకంతో జనం అధికార పార్టీ నేతల్ని నిలదీస్తుంటే.. సమాధానం చెప్పలేక పారిపోతున్నారని ఆయన విమర్శించారు.

*‘నేతన్న నేస్తం’ చేనేతలందరికీ అమలు చేయాలి: లోకేశ్
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రోత్సాహాలు ప్రకటిస్తుంటే.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పథకాలను కట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేనేతల సంక్షేమం కోసం అమలైన అనేక కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. నేతన్న నేస్తం పథకం లబ్ధిదారుల్లో మరింత కోత పెట్టేందుకు నూలు బిల్లు తప్పనిసరనే నిబంధన తెచ్చారని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఆ నిబంధనను వెనక్కి తీసుకుని, చేనేత కార్మికులందరికీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా విధిస్తున్న జీఎస్టీ అంశంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని లోకేశ్ సూచించారు.

*ఉచితాలపై ఆధారపడి సోమరులు కావొద్దు: గరికపాటి
ప్రభుత్వం అమలుచేసే ఉచిత పథకాలపై అధారపడి యువత.. సోమరులై బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు హితవు పలికారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఆదివారం సాయంత్రం ‘విద్యార్థులు-యువత ప్రేరణ’ అనే అంశంపై గరికపాటి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. విద్యార్థులు అధ్యాత్మికం పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారు. విద్యార్థులు స్వయం ఉపాధితో సొంతకాళ్లపై నిలబడాలని.. 2040 కల్లా దేశంలో 40 శాతం యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే క్రమశిక్షణ అవసరమని గరికపాటి స్పష్టంచేశారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను మానసికంగా దృఢంగా తయారు చేయాలని కోరారు

*ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ పోరు: సోము వీర్రాజు
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై తమ పోరాటం ఆపబోమని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. యువమోర్చా ఆధ్వర్యంలో ప్రారంభమైన బైకు ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. పార్టీ శ్రేణులతో ఆదివారం నాడు ఆయన సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కన్నా బీజేపీనే నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలన్నారు.

*ఒక్క చాన్స్ అంటూ జగన్ ప్రజలను మోసం చేశారు: యనమల
ఒక్క చాన్స్ అంటూ సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. జగన్రెడ్డి గడపగడపకు కార్యక్రమం బెడిసికొడుతోందని ఎద్దేవాచేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాన్యుల ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఉన్నారని విమర్శించారు. జనాల్లోకి వెళ్లేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారని తెలిపారు. గడపగడపకు వైసీపీ నేతలకు నిలదీతలు, ఛీత్కారాలే ఎదువుతున్నాయని పేర్కొన్నారు. మూడేళ్లలో దోచుకోవడం, అప్పులు చేయడం తప్ప ఏం చేశారు? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

*నీతి ఆయోగ్ భేటీ బహిష్కరణ సరి కాదు: షర్మిల
ముఖ్యమంత్రి కేసీఅర్ నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడంపై వైఎ్సఆర్ తెలంగాణ పార్టీ అఽధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అడగాల్సిన చోటుకు వెళ్లకుండా అలిగి కూర్చుంటే ఆగం అయితమన్నారు. మూర్ఖ రాజకీయాలకు తెలంగాణను తగలపెట్టవద్దని హితవు పలికారు. కుర్చీని కాపాడుకొనే కుట్రలు మానివేయాలని సూచించారు.

*నీతిఆయోగ్ భేటీని కేసీఆర్ బహిష్కరించడం దుర్మార్గం: కిషన్రెడ్డి
నీతిఆయోగ్ భేటీని సీఎం కేసీఆర్ బహిష్కరించడం దుర్మార్గమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తప్పుబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర వ్యవస్థలపై కేసీఆర్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అభివృద్ధిపై ఏ మాత్రం ఆకాంక్ష ఉన్నా ఈ వేదికపై వచ్చి మాట్లాడాలని పేర్కొన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణలో ఏం లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ అని చెప్పి.. ఏ రకమైన పాలన చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలన గురించి ఎవరిని అడిగినా.. కథలు, కథలుగా చెప్పుకుంటారని తెలిపారు. అధికారం పోతుందనే భయంతోనే కేంద్రంపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించడానికే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని కిషన్రెడ్డి దుయ్యబట్టారు.

*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూదొందే: తులసిరెడ్డి
నిత్యావసర వస్తువుల ధరల పెంపు, నిరుద్యోగ సమస్యను పెంచడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వం పోటీ పడుతున్నాయని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ నర్రెడ్డి తులసిరెడ్డి నిప్పులు చెరిగారు. ఏఐసీసీ పిలుపుమేరకు వేంపల్లెలో శుక్రవారం కాంగ్రెస్‌ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలు అసాధారణ రీతిలో పెరిగాయన్నారు. చిన్నపిల్లలు తాగే పాలమీద, బడిపిల్లలు వాడే పెన్సిళ్లు, రబ్బర్ల మీద కూడా జీఎస్టీ విధించారని ఆయన విమర్శించారు. జగన్‌ మూడేళ్ల పాలనలో ఇసుక, మద్యం, సిమెంట్‌, నూనెలు, పప్పు దినుసుల ధరలు, కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్టీలు అసాధారణ రీతిలో పెరిగాయని విమర్శించారు.

*లిక్కర్‌ డిస్టలరీలన్నీ సీఎం జగన్‌వే: బొండా ఉమ
రాష్ట్రంలో మద్యం తయారీ యూనిట్లు (డిస్టిలరీ) అన్నీ సీఎం జగన్‌వేనని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సీఎం కనుసన్నల్లో విజయసాయిరెడ్డి సొంత మద్యం తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఎక్కడా లేని బ్రాండ్లను బలవంతంగా ప్రజలపై రుద్దుతున్నారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 3200 ప్రభుత్వ వైన్‌ షాపులున్నాయని, ఎక్కడా ఆన్‌లైన్‌ పేమేంట్లు లేకపోవడం చూస్తే ప్రభుత్వ ఖజానాకు ఎన్ని వేల కోట్లు గండి కొడుతున్నారో అర్థమవుతుందన్నారు. బార్ల కేటాయింపుల్లో సైతం మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం అనుచరులు బహిరంగంగానే అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చిత్తూరుకు చెందిన మంత్రి ఒక్కరికే 18 బార్ల కేటాయింపు జరిగిందన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు.

*నిర్ధారణ అయితే గోరంట్లపై చర్యలు: ఎంపీ ఎంవీవీ
ఆ వీడియో నిజమని నిర్ధారణ అయితే ఎంపీ గోరంట్ల మాధవ్‌పై పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘‘గోరంట్ల ఘటన దురదృష్టకరం. ప్రభుత్వం ఈ అంశంపై సీరియ్‌సగా ఉందన్నారు. ఆ వీడియో మార్ఫింగా, లేకా ఎవరైనా ట్రాప్‌ చేశారా అనేది తేలాలి’’ అని ఎంవీవీ అన్నారు.

*దేశమంతా జెండా పండగ.. రాష్ట్రంలో ఎంపీ నగ్న ప్రదర్శనలు: సోమిరెడ్డి
ఆజాదీ కా అమృతోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా దేశం అంతా జెండా పండగలు జరుగుతుంటే ఇక్కడ మాత్రం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న ప్రదర్శనలు చూడాల్సి వస్తోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘అత్యాచారం కేసుల్లో నిందితులుగా ఉన్న నేరగాళ్లకు అవార్డులు, రివార్డులు, ప్రమోషన్లు ఇవ్వడం ముఖ్యమంత్రి జగన్‌కు అలవాటుగా మారింది. కియా కంపెనీ అధికారులతో నీచంగా ప్రవర్తించినప్పుడే ఇలాంటి దుర్మార్గులను ఇంటికి పంపించి ఉండాల్సింది. ఒకప్పుడు అభివృద్ధికి రోల్‌ మోడల్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు వైసీపీ నేతల దుర్మార్గాలు, వికృత చేష్టలకు కేరా్‌ఫగా మారడం దురదృష్టకరం’’ అని శుక్రవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. తనది చేతి పని అని మాధవ్‌ ముందే చెప్పాడని, ఆయన ఎన్నికల అఫిడవిట్‌లోనే ఆ విషయం ఉందని, దానిని మనం తప్పుగా అర్థం చేసుకొంటే ఆయనకు సంబంధం లేదని టీడీపీ ఎమ్మెల్సీ పి.అశోక్‌ బాబు ఒక ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. అసభ్య ప్రదర్శన చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యను ఇంకా ఎన్ని రోజులు నానుస్తారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. ‘‘మాధవ్‌ నగ్న లీలలకు మెచ్చి అతనిని సీంఎ జగన్‌రెడ్డి కేంద్ర మంత్రిని చేస్తారేమో? మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారికి జగన్‌రెడ్డి ప్రమోషన్లు ఇస్తుండటం రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు పెరగడానికి కారణం అవుతోంది. అరగంట చాలన్న అవంతిని మంత్రి పదవి నుంచి తీసేసి గంట కావాలన్న అంబటిని మంత్రిని చేశారు. పోలీస్‌ అధికారిగా చేసిన వైసీపీ ఎంపీ బట్టలు విప్పుకొని లైంగిక వేధింపులకు దిగడం రాష్ట్రంలో దిగజారిన పరిస్థితికి పరాకాష్ఠ’’ అని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి శుక్రవారం ట్వీట్‌ చేశారు. వైసీపీ అంటే వైఎ్‌సఆర్‌ కామ పిశాచ పార్టీ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు నందిగామలో అన్నారు. మాధవ్‌ను రాష్ట్రంలో మహిళలు చీపుర్లతో కొట్టేదాకా ఆ పార్టీ ఆయనపై చర్య తీసుకోదా? అని తెలుగుదేశం పార్టీ అనుబంధ అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ప్రశ్నించారు. ‘అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే దానిపై విచారణ జరపాల్సిన మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ అడ్రస్‌ లేకుండా పోయారు. ప్రాణం పోతే రూ.10 లక్షలు, మానం పోతే రూ.5 లక్షలు అని ప్రకటనలు చేయడం కాకుండా మహిళా కమిషన్‌ చైౖర్మన్‌ వాసిరెడ్డి పద్మ రంగంలోకి దిగి దీనిపై విచారణ చేపట్టాలి. హోం మంత్రి తానేటి వనిత కూడా స్పందించి తన వైఖరి చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు.

*యువజన శృంగార రసిక చిలిపి పార్టీ: బుద్దా
వైసీపీ… యువజన శృంగార రసిక చిలిపి పార్టీ అని నిరూపించే పనిలో ట్రెండ్‌ సెట్టర్‌గా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నిలిచారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ‘‘అంబటి రాంబాబు గంట విరహం, అవంతి శ్రీనివాస్‌ అరగంట సరసం ఆడియోలు బయటకు వస్తే వారిపై జగన్‌రెడ్డి ఏ చర్యా తీసుకోలేదు. ఇదేదో పార్టీ సిద్ధాంతం అనుకొని గోరంట్ల మాధవ్‌ ఏకంగా నగ్న వీడియోను బయటకు వదిలారు. ఎంపీపై చర్యలు తీసుకొంటారా… అంబటి మాదిరిగా కొత్త పదవి ఇచ్చి గౌరవిస్తారా అన్నది చూడాల్సి ఉంది’’ అని వెంకన్న వ్యాఖ్యానించారు.

*ఎలక్ట్రిక్ వాహనరంగాన్ని ఏపీ ప్రోత్సహిస్తుంది: మం అమర్ నాథ్
ఏపీలో పెట్టుబడులకు పలు కంపెనీల ఆసక్తి కనబరుస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పేర్కొన్నారు. ప్రజలకు హాని చేయని పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ పెద్దపీట వేస్తుందని ఆయన చెప్పారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వర్చువల్ సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహన రంగానికి మంచి భవిష్యత్ ఉందని, ఏపీలో ఈవీ వ్యవస్థ ఏర్పాటుకు కావలసిన మౌలిక వసతులను సమకూరుస్తామని చెప్పారు. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడుతూ.. డీజిల్‌తో నడుస్తున్న ప్రజా రవాణా వ్యవస్థను 50శాతం విద్యుత్ వాహనాలుగా మలిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ (లో నడుస్తున్న 7000 బస్సులలో 1000 బస్సులను విద్యుత్ వాహనాలుగా మారుస్తున్నామని, ఇప్పటికే తిరుపతి నుంచి తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులను తిప్పుతున్నామని చెప్పారు.

*ప్రజాస్వామ్యంలో కుట్రలకు తావులేదు: కవిత
పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఎమ్మెల్సీ కవిత ఖండించారు. శుక్రవారం ఆమె బంజారాహిల్స్‌లోని జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో కుట్రలకు తావు లేదని, ఆ విధానాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

*మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: రేవంత్‌రెడ్డి
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చరిత్ర హీనుడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. నల్లొండ జిల్లా చండూరులో నిర్వహించిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీకి ద్రోహం చేసిన నేత రాజగోపాల్‌రెడ్డి అని మండిపడ్డారు. రాజగోపాల్‌రెడ్డి దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడని మండిపడ్డారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి చరిత్రహీనుడుగా మిగిలారని విమర్శించారు. నమ్మినవారిని మోసం చేసి కేంద్రమంత్రి అమిత్‌షా వైపు వెళ్లాడని, కాంగ్రెస్ పార్టీలో పోరాటాలకు కలిసి రాలేదు కానీ.. కాంట్రాక్టుల కోసం అమిత్‌షా వైపు వెళ్తాడా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

*ఆర్థిక ప్రయోజనాల కోసమే రాజగోపాల్‌రెడ్డి చేరిక: సీతక్క
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. చండూరు పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే రాజగోపాల్‌రెడ్డి బీజేపీ లో చేరుతున్నారని విమర్శించారు. దోచుకొని, దాచుకొని.. బీజేపీ కండువా కప్పుకుంటే మంచి నేతలయిపోతారా? అని ప్రశ్నించారు. బీజేపీపై కూడా సీతక్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేయడమే బీజేపీ నైజమని పేర్కొన్నారు. తల్లిపాలు తప్ప.. మిగతా అన్నింటిపై పన్ను వేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని చెప్పారు. అసలు దేశంలో సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టేనని చెప్పుకొచ్చారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ప్రజల విశ్వాసాన్ని రాజగోపాల్ రెడ్డి వమ్ము చేశారని పేర్కొన్నారు. బీజేపీ, టిఆర్ఎస్‌ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని కోరారు.

* రాజగోపాల్‌ రెడ్డి లాంటి విశ్వాసఘాతకుడిని చూడలేదు: రేవంత్‌రెడ్డి
మునుగోడు గడ్డమీద కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో నిర్వహించిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని శ్రేణులను కోరారు. గతంలో పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సిన టికెట్‌ను రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చారని.. అప్పుడు వారి త్యాగాలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా.. గంటలో దామోదర్‌ రెడ్డి వస్తారని, రెండు గంటల్లో తాను వస్తానని రేవంత్‌రెడ్డి చెప్పారు. దామోదర్‌రెడ్డితో కలిసి సభావేదికపై నుంచి కార్యకర్తలకు అభివాదం చేశారు. ‘‘తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీనే మనకు తెలంగాణ తల్లి. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. అయినా చింతించలేదు. ప్రజాప్రయోజనమే తప్ప అధికారం కాదని సోనియా భావించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తా లేకే మూసేసిన (నేషనల్‌ హెరాల్డ్‌) కేసును తెరిచారు. అన్యాయంగా సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలకు నోటీసులిచ్చారు. కరోనాతో పూర్తిగా కోలుకోకముందే సోనియాగాంధీకి మరోసారి నోటీసులు ఇచ్చారు. పార్టీ అధినేత్రికి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిది. మన కన్నతల్లిని అవమానిస్తుంటే మనం తట్టుకోగలమా? సోనియాగాంధీని ఈడీ విచారణ జరుపుతుంటే.. రాజగోపాల్‌రెడ్డి అమిత్‌షా దగ్గరకు వెళ్లారు. కాంగ్రెస్‌ పోరాటంలో కలిసిరాలేదు.. కానీ, కాంట్రాక్టుల కోసం అమిత్‌ షా దగ్గరకు వెళ్లారు. ఒక్క ఎమ్మెల్యే పోయినా.. కాంగ్రెస్‌కు ఒరిగిందేమీ లేదు. ఎందుకు భాజపాలోకి వెళ్లావని అడుగుతున్నా. పార్టీకి ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెప్పాలి. మునుగోడు ప్రజల కోసమే రాజీనామా చేశానని రాజగోపాల్‌ చెబుతున్నారు.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా నుంచి మునుగోడుకు నిధులు తెస్తావా? నెలరోజులు జైల్లో ఉన్న నాతో కలిసి పనిచేయలేనని రాజగోపాల్‌ చెబుతున్నారు. మరి 90 రోజులు జైల్లో ఉన్న అమిత్‌షాతో ఎలా కలిసి పనిచేస్తావు? 2014లో తర్వాత తెరాస నాపై 120 కేసులు పెట్టింది. అయినా భయపడలేదు.. కేసీఆర్‌ను గద్దె దించే వరకు పోరాటం చేస్తానని చెప్పా. తెలంగాణ సంస్కృతి అమ్ముడుబోయే సంస్కృతి కాదు. సహాయం చేసే సంస్కృతి. ఆ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మునుగోడు ప్రజలపై ఉంది. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అన్యాయం చేసే అధికారం నీకు ఎవరిచ్చారు. ఇప్పుడు మోసం చేసిన వ్యక్తి.. రేపు మరోసారి మోసం చేయడా?రాజగోపాల్‌రెడ్డి లాంటి విశ్వాసఘాతుకుడిని నేనెప్పుడూ చూడలేదు. ఈ మునుగోడు గడ్డ మీద రాజగోపాల్‌రెడ్డిని పాతిపెడదాం. ప్రజలంతా కాంగ్రెస్‌ పక్కన నిలబడండి’’ అని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.