Politics

నారా సుర రక్త చరిత్రని సాక్షి రాస్తే..వైయస్ అసురుల రక్త చరిత్రని సిబిఐ తేల్చింది

నారా సుర రక్త చరిత్రని సాక్షి రాస్తే..వైయస్ అసురుల రక్త చరిత్రని సిబిఐ తేల్చింది

నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణంరాజు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం సాక్షి దినపత్రిక నారాసుర రక్త చరిత్ర అనే కథనాన్ని రాయగా, అది నారాసుర రక్త చరిత్ర కాదని…వైయస్ అసురుల రక్త చరిత్ర అని సిబిఐ తేల్చిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా హత్య కేసు సూత్రధారులు వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, వైయస్ ప్రకాష్ రెడ్డి లేనని సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై అభ్యంతరాన్ని తెలియజేస్తూ హైకోర్టులో సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ లో పేర్కొందన్నారు. గతంలో నారాసుర రక్త చరిత్ర అని రాసిన కథనానికి సాక్షి దినపత్రిక యాజమాన్యం ఇప్పుడు క్షమాపణలు కోరుతుందా? అని ప్రశ్నించారు. టిడిపి నాయకత్వం ఎవరి పాపానికి వారే పోతారులే అనే భావనతో అడగలేదన్నారు. సిబిఐ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ లోని వాస్తవాలను రాసిన పత్రికా ప్రతులను దగ్ధం చేస్తే వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఆ పత్రికల సర్కులేష నే పెరుగుతుందని చెప్పారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని మరోసారి సిబిఐ అధికారులు పిలిచారని తెలిపారు.

సాక్షి రాతలకు సమాధానాలివిగో

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తప్పుదోవ పట్టించే విధంగా
తెలుగువారి సొమ్ముతో ప్రారంభించిన సాక్షి దినపత్రిక పైత్యపు కథనాలను రాసిందని రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబీఐ పేరు చెప్పి ఎల్లో మీడియా దుర్మార్గపు వంటకం వండిందని సాక్షి దినపత్రిక రాసిన కథనంలో పేర్కొన్న పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. సునీల్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సిబిఐ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ లో వివరాలన్నీ స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. సాక్షి దినపత్రిక వంటి డకోటా పేపర్ వాస్తవాలను రాయకపోతే, ఇక ఇతర దినపత్రికలు ఎవరూ రాయవద్దా? అంటూ ప్రశ్నించారు. వాస్తవాలను రాస్తే వండి వార్చినట్టాఅంటూ నిలదీశారు. సిబిఐ పరస్పర విరుద్ధ నివేదికలను సమర్పించిందని, గతంలో ఒకచోట ఉన్నారని పేర్కొని, ఇప్పుడు మరోచోట ఉన్నారనడంలో ఆంతర్యం ఏమిటని సాక్షి దినపత్రిక తన కథనంలో ప్రశ్నించిందన్నారు. అసలు ఈ వ్యవహారంతో సాక్షి దినపత్రిక కున్న సంబంధమేమిటి అని రఘురామకృష్ణం రాజు నిలదీశారు. గతంలో సెల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా చెప్పారని, ఇప్పుడు గూగుల్ అవుట్ లుక్ లో ప్రత్యేకించి ఒకే దగ్గర ఉన్నట్లుగా నిర్ధారించారని వివరించారు. వైఎస్ వివేకా హత్యకు ముందు, తరువాత హత్యలో పాల్గొన్న వారితో పాటు, సూత్రధారులు కలిసే ఉన్నారని తేలిందన్నారు. సిబిఐ విచారణని తప్పుపడుతున్న సాక్షి దినపత్రిక, సిబిఐ విచారణ ను సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించారు. వైఎస్ వివేక హత్యలో పాల్గొన్న దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి లు ఆయనతో కుమార్తె డాక్టర్ సునీతకు, అల్లుడు రాజశేఖర్ రెడ్డి కి, పెద్ద బావమరిదికి సన్నితులేనని పేర్కొన్న సాక్షి దినపత్రిక, ఈ దిశగా విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైయస్ వివేకను కూతురు, అల్లుడు, పెద్ద బావమరిది హత్య చేయించి ఉంటారనే అనుమానం కలిగించే విధంగా సాక్షి దినపత్రిక కథనం ఉందని చెప్పారు. హత్యకు ముందు, తరువాత హంతకులు వైయస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మనోహర్ రెడ్డి లతో మాట్లాడారని, హత్య కు ముందు భాస్కర్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారన్నారు. ఒకవేళ వైఎస్ వివేకాను వివేక అల్లుడు, కూతురు పెద్ద బావమరిది లు హత్య చేయించి ఉంటే, హంతకులు హత్యకు ముందు తర్వాత వారితోనే సంప్రదింపులు జరిపేవారు కదా అని ప్రశ్నించారు. వైయస్ వివేక హత్య అనంతరం ఇంట్లో రక్తపు మరకలు వైయస్ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు ఎందుకు తుడిపించారని, సాక్షి దినపత్రిక ఇన్వెస్టిగేషన్ కథనంలో రాసినట్లుగా కుట్లు ఎందుకు వేయించారని ప్రశ్నించారు. తొలుత గుండెపోటుతో మరణించారని ఎందుకనీ పేర్కొన్నారని నిలదీశారు. ఇంట్లోని రక్తపు మరకలను తుడవమని, గుండెపోటుతో మరణించారని డాక్టర్ సునీతమ్మ, రాజశేఖర్ రెడ్డి లు చెప్పమని వారికి ఏమైనా చెప్పారా? అంటూ ప్రశ్నించారు. గుండెపోటు వచ్చి రక్తపు వాంతులు చేసుకుంటే… రక్తపు మరకలు గోడలపై పడుతాయా? అన్న రఘురామకృష్ణంరాజు, ఒల్లంతా చీరేసి ఉంటే అనుమానస్పద మృతి అని ఎందుకు చెప్పారన్నారు. రక్తపు మరకలను తుడిచింది ఎవరని.. కుట్లు వేసింది ఎవరని ప్రశ్నించిన ఆయన, హైదరాబాదులో ఉన్న డాక్టర్ సునీతమ్మ, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి వచ్చి రక్తపు మరకలను తుడిచి, కుట్లు వేసి వెళ్లిపోయారా అంటూ అప హాస్యం చేశారు. రక్తపు మరకలను తుడిచింది ఎవరో సిబిఐ వాళ్లు చెప్పిందే, ప్రముఖ దినపత్రికల్లో రాశారన్నారు.

పట్టాభిని కొట్టారన్నది నిజం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు కొట్టారన్నది నిజమని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తప్పుడు నివేదికను ఇచ్చారని, గతంలో తనను చిత్రహింసలకు గురి చేసినప్పుడు కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ తప్పుడు నివేదికను ఇచ్చారని గుర్తు చేశారు. ఆ నివేదిక ఒక బూతు అని మిలిటరీ ఆసుపత్రి వైద్యులు తేల్చారని పేర్కొన్నారు. పట్టాభిని పోలీసులు కొట్టగా చేయి వాచిందన్నారు . అయితే పట్టాభి ఫైల్ ఫోటోను వాడుకుని ఈనాడు దినపత్రికలో వార్త కథనాన్ని ప్రచురించగా , ఆ తరువాత అది ఫైలు ఫోటో అని వివరణ కూడా ఇచ్చారన్నారు. దానికి తమకు విలువలు ఉన్నట్టు, ఇతరులకు జర్నలిజం విలువలేనట్టు పేర్కొనడం నవ్వి పోదురు గాక నాకేటి అన్నట్లుగా సాక్షి వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు.

భుజాలు తడుముకోవడం ఎందుకు?

గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే సాక్షి దినపత్రిక భుజాలు తడుముకోవడం ఎందుకని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. వైఎస్ వివేక హత్యకు 40 కోట్ల రూపాయల డీల్ కుదిరిన మాట నిజమే అయితే, 5 లక్షల రూపాయల అప్పు కోసం దస్తగిరి ఎందుకు ప్రయత్నిస్తారని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దస్తగిరికి అడ్వాన్సుగా కోటి రూపాయలు ఇవ్వగా అందులో 25 లక్షల రూపాయలను సునీల్ యాదవ్ తీసుకున్నారని చెప్పారు. ఇక మిగిలిన మొత్తాన్ని తన స్నేహితుడి వద్ద దాచిపెట్టగా, ఆ మొత్తాన్ని సిబిఐ అధికారులు సీజ్ చేశారని గుర్తు చేశారు. పచ్చ పైత్యం ముదిరిపోయిందని సాక్షి దినపత్రికలో దాదాపు రెండు పేజీల కథనం రాశారని మీడియా ప్రతినిధుల సాక్షి దినపత్రికను ప్రదర్శించారు. ఒకవైపు వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరుగుతుంటే, విచారణను, ప్రజలను పక్కదోవ పట్టించే విధంగా సాక్షి పైత్యపు రాతలను రాస్తుందని విమర్శించారు. ఫోటో లేకపోవడం వల్ల ఫైల్ ఫోటోను వాడినందుకే విలువల గురించి మాట్లాడిన సాక్షి దినపత్రిక, మరి ఇప్పుడు తాను చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. గతంలో సుప్రీంకోర్టులో ఒక కేసు వారానికి వాయిదా వేస్తే, కేసే కొట్టివేశారని ముప్పావు పేజీ వార్త కథనాన్ని రాసిన సాక్షి దినపత్రిక మరుసటి రోజు తాను చేసింది తప్పని క్షమాపణ కోరిందా? అంటూ ప్రశ్నించారు. తప్పుడు వార్తలను రాసిన సాక్షి దినపత్రిక ప్రజలను కాల్చివేస్తే రాజ ద్రోహం కింద కేసులు పెడతారన్నారు.

ఒక ఎంపీ సిబిఐ ని ప్రభావితం చేయగలరా?

తెలుగుదేశం పార్టీ నుంచి బిజెపిలో చేరిన ఎంపీలు కొంతమంది సిబిఐ ని ప్రభావితం చేశారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. టిడిపి నుంచి బిజెపిలో చేరిన ఎంపీలు టీజీ వెంకటేష్, సుజనా చౌదరీలు ఇప్పటికే రిటైర్డ్ అయ్యారని గుర్తు చేశారు. సిబిఐ ని ప్రభావితం చేస్తున్నది సీఎం రమేశ్ అని సాక్షి దినపత్రిక భావిస్తోందా?, కల్లాకపటం ఎరుగని చిన్నారిని , ఏ సంబంధమూ లేని అవినాష్ రెడ్డిని వైఎస్ వివేక హత్య కేసులో సీఎం రమేష్ ఇరికించగలరా? అని ప్రశ్నించారు. వైయస్ వివేకాను తానే హత్య చేశానని దస్తగిరి అంగీకరిస్తున్నాడు. వైఎస్ వివేక కు సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి ఎందుకు చంపి ఉండకూడదని సాక్షి ప్రశ్నిస్తోంది. అవినాష్ రెడ్డికి సంబంధమే లేదని అదే సాక్షి దినపత్రిక చెబుతోందన్నారు . వైఎస్ వివేక హత్య కు ముందు, తరువాత హంత కులు సూత్రధారులు కలిసి ఉన్నారని, అవినాష్ రెడ్డి రక్తపు మరకలను తుడి చారని సీఎం రమేష్ ఆధారాలను సృష్టించి హత్య కేసును ప్రభావితం చేయగలరా అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, ఈ ఆధారాలను సీఎం రమేష్ ఎప్పుడు సృష్టించారో చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే 8 నెలల పాటు వైఎస్ వివేక హత్యకేసును విచారించిందని, అప్పుడు అసలు దోషులను ఎందుకు కనిపెట్టలేకపోయిందని నిలదీశారు. సిబిఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టును డాక్టర్ సునీతమ్మ ఆశ్రయించి ఉండి ఉండకపోతే, ఆమె, ఆమె భర్తనే హత్య చేశారని ఏపీ పోలీసులు తేల్చేవారన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అత్యంత ప్రేమించే అవినాష్ రెడ్డిని ఈ కేసులో ఇరికించేంత స్థాయి సీఎం రమేష్ కు ఉన్నదా అని ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, సిబిఐ పనికిరాని సంస్థ అని జగన్మోహన్ రెడ్డి ధ్రువీకరిస్తున్నారా అంటూ నిలదీశారు. ఈ అభియోగాలన్నింటినీ పరిశీలిస్తే, సిబిఐ అధికారి రాంసింగ్ పై కేసు పెట్టింది ఎవరో స్పష్టమవుతుందన్నారు. గతంలో శశికళ ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చారని, గంగాధర్ రెడ్డి, సీఐ శంకరయ్య చెప్పింది రాయకుండా తారుమారుగా వాంగ్మూలాన్ని నమోదు చేశారని ఆరోపణలు చేయడం వెనుక అంతరార్థం ఏమిటో అర్థమైందన్నారు . రామ్ సింగ్ బాధ్యతలు చేపట్టకముందు అంతా సాఫీగా నే సాగగా, ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాతే ప్రభుత్వ పెద్దలకు తలనొప్పి ప్రారంభమైందన్నారు. నూటికో, కోటికో కొంతమంది మంచి అధికారులు ఉంటారని, ధనమాందులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటూ కేసును ఒక కొలిక్కి తీసుకువచ్చే దిశగా విచారణను రామ్ సింగ్ ముందుకు తీసుకువెళ్లారన్నారు. సాక్షిలో ఇంతగా అడ్డగోలు కథనాలు రాస్తున్నారు అంటే ఉదయ్ కుమార్ రెడ్డి చేత కేసు పెట్టించడం వెనుక … సాక్షి దినపత్రికలో కథనాలు రాయిస్తున్న వారి హస్తం ఉండి ఉంటుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. రఘురామకృష్ణం రాజు పై న్యాయస్థానంలో చిన్న అంశం పై వాదనలు జరిగినా పావు పేజీకి పైగా వక్రీకరణ కథనాలు రాయించే శక్తి ఎవరికి ఉందో… ప్రజలందరికీ తెలిసిందేనన్నారు.

అరెస్టు చేయకపోతే సిబిఐకి అప్రతిష్టే

శుక్రవారం నాడు విచారణకు హాజరైన వారిని అరెస్టు చేయకపోతే సిబిఐ కి అప్రతిష్టేనని రఘురామకృష్ణం రాజు అన్నారు. కౌంటర్ పిటిషన్ లో అంత స్పష్టంగా రాసిన తర్వాత కూడా అరెస్టు చేయకపోవడం అనేది ఉండదన్నారు. ఒకవేళ ఈరోజు అరెస్టు చేయకపోతే, కొద్ది రోజులు ఆలస్యం కావచ్చు కానీ అరెస్టు మాత్రం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఏమీ చేయని తనని అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని, హత్య చేసిన వాడిని అరెస్టు చేయరా అంటూ ప్రశ్నించారు.

పార్టీ అధ్యక్ష పదవికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత జీవితకాల అధ్యక్షుడికి మాత్రమే గతంలో ఎన్నికలు నిర్వహించారని, ఆ ఎన్నిక చెల్ల నేరదని పేర్కొన్నారు. ఇదే విషయమై తాను గత ఏడాది కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలిపారు. శాశ్వత జీవితకాల అధ్యక్షుడు ఎన్నిక అనేది పార్టీ రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. అలాగే పార్టీ పేరును మార్చడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ పేరిట 55 ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఇప్పుడు తమ పార్టీ పేరు వైయస్సార్ గా మార్చడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. వైయస్సార్ పేరు పార్టీ ఏర్పాటు చేసినప్పుడు, అదే పేరుతో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు కుదురుతుందా అని ప్రశ్నించారు.

జీవితకాల శాశ్వత అధ్యక్షుడిగా జగన్ అంటూ సాక్షిలో వార్తా కథనం

పార్టీ శాశ్వత జీవితకాల అధ్యక్షుడుగా జగన్ అంటూ సాక్షి దినపత్రికలో రాసిన వార్తా కథనం… అప్పుడు రైట్ న్యూసేనని, ఇప్పుడు రాంగ్ న్యూస్ అని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఎన్నికల కమిషన్ ఈ సందర్భంగా ఒక ఆర్డర్ ను ఇచ్చిందని పేర్కొన్నారు. పార్టీ జీవితకాల శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నికైనట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై వివరణ ఇవ్వాలని పలుమార్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఈ సీ లేఖలు రాసిందని తెలిపారు. అయితే, అది తప్పుడు వార్త అని… ఆ వార్త రాసిన పత్రికలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘానికి తమ పార్టీ నాయకత్వం వివరణ ఇచ్చింది అన్నారు. జీవితకాల శాశ్వత అధ్యక్షుడిని అనుమతిస్తే ప్రాంతీయ పార్టీలన్నీ అంటూ వ్యాధి లాగా ఈ విధానాన్ని ఆచరిస్తారని ఎన్నికల సంఘం పేర్కొందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తాను ఎన్నికల సంఘానికి తమ పార్టీ పేరు ఏమిటో తెలియజేయాలని లేఖ రాయనున్నట్టు వెల్లడించారు.

ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పలేదు

పార్టీ శాశ్వత జీవితకాల అధ్యక్షుడు నియామకం గురించి వార్తా కథనాలు రాసిన పత్రికలపై తీసుకున్న చర్యలు ఏమిటో ఇప్పటివరకు చెప్పలేదని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. శాశ్వత జీవితకాల అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి ప్లీనరీలో ప్రకటించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఒక వీడియోను మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. ఐదేళ్ల కాల పరిమితికి ఎన్నుకున్నామని తమ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నప్పటికీ, ఇద్దరు శాశ్వత అధ్యక్షుడనే చెప్పారన్నారు. శాశ్వత అధ్యక్షుడని పేర్కొనడం వల్ల తనతోపాటు పలువురు పోటీ చేయలేకపోయారని వెల్లడించారు. తనకు పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘాన్ని ఈ సందర్భంగా కోరారు. శివసేన అధ్యక్షుడిగా ఉద్దవ్ థాక్రె ను కాదని, ఏక్ నాథ్ షిండే ను ఎన్నుకుంటారని ఎవరైనా అనుకున్నారా అంటూ ప్రశ్నించారు. తనని ఎన్నో చిత్రహింసలు పెట్టినప్పటికీ పార్టీని వీడలేదని, ప్రభుత్వం చేస్తున్న తప్పులను మాత్రం ఎత్తిచూపుతున్నానన్నారు.. రాజ్యాంగము, పార్టీ రాజ్యాంగం తెలియని వారే తమ పార్టీలో ఎక్కువగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలకు యాజమాన్యపు హక్కులు ఉండవని తేల్చి చెప్పారు.

పేర్లు మారిస్తే కేంద్ర నిధులు కట్

కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మారిస్తే నిధులను నిలిపివేస్తామని కేంద్రమంత్రి హెచ్చరించారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల పేర్లను వ రాష్ట్రంలో పేర్లు మార్చి అమలు చేస్తున్నారన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద భవనిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం లక్షన్నరరూపాయలు లబ్ధిదారులకు అందజేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి జగనన్న కాలనీలనే పేరు పెట్టిందన్నారు. ఆయుష్మాన్ భారత్ పేరును వైయస్సార్ ఆరోగ్యశ్రీ పేరిట, పోషన్ అభియాన్ ను జగనన్న గోరుముద్ద పేరిట అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమ ఫోటోల పిచ్చిని తగ్గించుకోకపోతే, ప్రభుత్వ పథకాలకు నిధులు తగ్గిపోతాయని హెచ్చరించారు.

బాకీలు తీర్చే వరకు సర్పంచులు ఓట్లు వేయవద్దు

గ్రామపంచాయతీలకు ఉన్న బకాయిలను చెల్లించే వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు తమ పార్టీకి ఓటు వేయవద్దని రఘురామకృష్ణం రాజు కోరారు. న్యాయవాద సంఘ ఎన్నికల్లో జానకిరామిరెడ్డిని గెలిపించుకునేందుకు లా నేస్తం పథకాన్ని అమలు చేశారని, అది వర్కౌట్ అయ్యి జానకిరామ్ రెడ్డి గెలిచారన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధానమంత్రి హాజరైనప్పుడు తన అనుచరులతో అవరోధాలు కల్పించినట్లుగా ఎవరో ఫిర్యాదు చేస్తే తనపై కేసులు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.. ఈ కేసు విచారణలో భాగంగా అర్నేష్ కుమార్ ఆర్డర్ ను అనుసరించాలని న్యాయమూర్తి ఆదేశించగా, దుష్యంతుడు అనే న్యాయవాది వాదనలు న్యాయమూర్తి చెప్పినట్లుగా సాక్షి దినపత్రిక వక్రీకరణ కథనాన్ని రాసిందని మండిపడ్డారు.