Politics

వైసీపీకి జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదు

వైసీపీకి జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదు

వైఎస్సార్సీపీకి జగన్మోహన్‌ రెడ్డి శాశ్వత అధ్యక్షుడు కాదని ఆ పార్టీ ఎంపీ రఘురామరాజుకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. పార్టీ పేరు సవరణతో పాటు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి శాశ్వత అధ‌్యక్షుడిగా జగన్మోహన్‌ రెడ్డి ఎన్నుకుంటున్నట్లు పత్రికల్లో వచ్చిందని పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన లేనందున దానిపై స్పష్టత ఇవ్వాలని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.రఘురామ లేఖకు స్పందించిన ఎన్నికల సంఘం ఆ పార్టీ ఇచ్చిన వివరణ ఆధారంగా రఘురామకు లేఖను పంపింది. పార్టీ పేరును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, వైఎస్సార్‌సీపీ‌గా మార్చే ఆలోచన లేదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చినట్లు రఘురామకు ఈసీ తెలిపింది.

గత ఏడాది గుంటూరులో జరిగిన పార్టీ ప్లీనరీ ముగింపు సందర్భంగా ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. పార్టీ విస్తృత స్థాయి సమావేశాల సందర్భంగా జరిగిన చర్చల ఆధారంగా యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ పేరును వైసీపీ, వైఎస్సార్సీపీగా వ్యవహరించడంతో పాటు ఆ పార్టీకి జగన్మోహన్‌ రెడ్డి శాశ్వత అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో విజయసాయి రెడ్డి ప్రకటించారు. దాంతో పాటు పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఇదే వేదికపై ప్రకటించారు.కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏ పార్టీకి శాశ్వత అధ్యక్షులు అంటూ ఉండరు. ప్రజాస్వామ్య పార్లమెంటరీ నిబంధనలకు అనుగుణంగా ప్రతి రాజకీయ పార్టీ నిర్దిష్ట కాల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. పార్టీ రాజ్యాంగంలో నిర్దేశించుకున్న కాల వ్యవధిలో ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఇవన్నీ భారత రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాలి. వైసీపీలో ఏకంగా జగన్మోహన్ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిని నియమించాలనే విచిత్రమైన ఆలోచనను ప్లీనరీ వేదికపై ప్రకటించారు.

అప్పట్లో ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. కనీస న్యాయ పరిజ్ఞానం ఉన్న ఏ న్యాయవాదితో చర్చించినా ఇలాంటి ప్రకటనలు చేసి ఉండేవారు కాదనే విమర్శలు వచ్చాయి. అదే సమయంలో వైసీపీకి కంట్లో నలుసులా తయారైన ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఈసీకి ఫిర్యాదు చేశారు. శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి పేరును ప్రకటించడంపై ఈసీ వివరణ కోరారు. దీంతో గత ఏడాది ఈసీ వైఎస్సార్సీపీకి నోటీసులు జారీ చేసింది.ఈసీ నోటీసులతో అలర్ట్‌ అయిన ఆ పార్టీ న్యాయనిపుణులతో చర్చించి వివరణ ఇచ్చింది. అలాంటి ప్రతిపాదన ఏది పార్టీలో తీసుకోలేదని, ఆ ప్రకటనలతో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డికి సంబంధం లేదని తెలిపింది. పార్టీ నియమ నిబంధనల మేరకు ఎన్నికల ద్వారా మాత్రమే అధ్యక్ష ప్రక్రియ జరుగుతుందని స్పష్టత ఇచ్చారు.