Agriculture

తగ్గిన పీఎం కిసాన్ లబ్ధిదారులు

తగ్గిన పీఎం కిసాన్ లబ్ధిదారులు

పీఎం కిసాన్‌ లబ్ధిదారుల సంఖ్య 2022-23తో పోలిస్తే 2023-24లో భారీగా తగ్గింది. గత ఏడాది ఈ పథకం కింద మొత్తం 10.71 కోట్ల మంది ప్రయోజనం పొందగా, 2023-24లో జులై 31 నాటికి ఆ సంఖ్య 8.56 కోట్లకు పడిపోయింది. లబ్ధిదారుల సంఖ్య ఏపీలో 47.82 లక్షల నుంచి 41.35 లక్షలకు, తెలంగాణలో 35.81 లక్షల నుంచి 29.50 లక్షలకు తగ్గిపోయింది. ఇప్పటివరకు ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు రూ.2.50 లక్షల కోట్లు అందినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద 2022-23లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 93.92 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ప్రీమియంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.1,367.72 కోట్లు సమకూర్చగా, కేంద్రం తన వాటా కింద రూ.784.24 కోట్లు అందించినట్లు వెల్లడించారు.

ఏపీలో 9,590 ప్రాపర్టీ కార్డులు సిద్ధం…స్వామిత్వ పథకం కింద ఏపీలో ఇప్పటి వరకు 44 గ్రామాలకు చెందిన 9,590 ప్రాపర్టీ కార్డులు మాత్రమే సిద్ధమైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తెలిపారు. ఆయన మంగళవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. పల్లెల్లో నివసించే ఇంటి యజమానులకు ‘రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌’ అందించడానికి ప్రవేశపెట్టిన స్వామిత్వ స్కీం కింద ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 17,949 గ్రామాలను నోటిఫై చేసి 10,834 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 44 గ్రామాలకు చెందిన 9,590 ఆస్తిపత్రాలు మాత్రమే సిద్ధమైనట్లు చెప్పారు. తెలంగాణలో ఈ పథకం కింద కేవలం 5 గ్రామాలను నోటిఫై చేపి 3 గ్రామాల్లో సర్వే చేశామని, ఇప్పటి వరకూ ఒక్క గ్రామానికి సంబంధించి ఒక ఆస్తిపత్రం కూడా సిద్ధం కాలేదన్నారు. దిల్లీ, గుజరాత్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, లక్షద్వీప్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో అధిక సంఖ్యలో ఆస్తిపత్రాలు సిద్ధమైనట్లు తెలిపారు.