Food

ఓ వివాహ కార్యక్రమంలో రసగుల్లా కోసం గొడవ

ఓ వివాహ కార్యక్రమంలో రసగుల్లా కోసం గొడవ

వివాహ వేడుక (Wedding Function) అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పసందైన వంటకాలే. ఈ వేడుకల్లో ఎన్నో రకాల వంటకాలను అతిథులకు వడ్డిస్తారు. అయితే, ఒక్కోసారి జనం ఎక్కువైనప్పుడు కొంత కొరత ఏర్పడుతుంది. చివరి బంతికి వచ్చేసరికి కొన్ని వంటకాలు అయిపోతుంటాయి. ఆ సమయంలో ఉన్నవాటితోనే సరిపెడుతుంటారు. అలా ఓ వివాహ కార్యక్రమంలో రసగుల్లాల (Rasgulla) కొరత ఘర్షణకు దారితీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రంలో చోటు చేసుకుంది.

స్థానిక శంషాబాద్‌ ప్రాంతం (Shamsabad area)లో ఆదివారం ఓ వివాహ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా అతిథులకు పసందైన వంటకాలు వడ్డించారు. అయితే, కాసేపటికి పెళ్లి వేడుకలో వడ్డించిన రసగుల్లాలు అయిపోయాయి. కొందరికి అందలేదు. దీంతో ఓ వ్యక్తి రసగుల్లాల కొరతపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణల్లో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పోలీసు అధికారి అనిల్‌ శర్మ తెలిపారు.

క్షతగాత్రులను భగవాన్‌ దేవి, యోగేష్‌, మనోజ్‌, కైలాష్‌, ధర్మేంద్ర, పవన్‌గా గుర్తించారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. కాగా గతేడాది అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ఎత్మాద్‌పూర్‌లో ఓ పెళ్లి వేడుకలో మిఠాయిల కొరత విషయమై జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z