DailyDose

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడే సమయం ఆసన్నమైంది. ప్రధాన పార్టీలైన భారాస, కాంగ్రెస్‌, భాజపాలు తమ బలాలు, బలగాల్ని మోహరించి విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నెల 30వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ప్రచారానికి మంగళవారం ఒక్కరోజే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని రోజుల కిందటే ఓటర్లకు డబ్బు పంపిణీ మొదలుకాగా.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని కీలక నియోజకవర్గంలో ఓ పార్టీ తొలుత ఇంటికి రూ.10 వేల చొప్పున పంపిణీ మొదలుపెట్టినట్లు తెలిసింది. తర్వాత ఓటుకు రూ.3 వేల చొప్పున ఇస్తున్నారని సమాచారం. ఇదే జిల్లాలో మూడుపార్టీల మధ్య గట్టిపోటీ ఉన్న స్థానంలో ఓ పార్టీ ఓటుకు రూ.5 వేలు ఇస్తున్నట్లు తెలియవచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ కీలక నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థి 90 శాతం ఓటర్లకు సొమ్ములిచ్చినట్లు సమాచారం. మరో అభ్యర్థి ఓటుకు రూ.3 వేల చొప్పున పంపిణీ ప్రారంభించినట్లు తెలిసింది.

ఇదే జిల్లా.. రాష్ట్ర సరిహద్దులోని ఓ నియోజకవర్గంలో ద్విముఖపోరు ఉండగా ఇద్దరు అభ్యర్థులు కనీసం 80 నుంచి 90 శాతం ఓటర్లు లక్ష్యంగా ప్రలోభాలకు తెరతీశారు. జగిత్యాల జిల్లాలోని ఓ నియోజకవర్గంలో బరిలో దిగిన ఓ పార్టీ అభ్యర్థి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే పోల్‌ మేనేజ్‌మెంట్‌లోనూ దూకుడుగా వెళుతున్నారు. ఓటుకు రూ.3 వేలు ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. మరో అభ్యర్థి రూ.2 వేలు, ఇంకొకరు రూ.వెయ్యి చొప్పున పంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. నిజామాబాద్‌ జిల్లాలోని ఓ స్థానంలో ఒక ప్రధానపార్టీకి చెందిన అభ్యర్థి ఇంటికి రూ.5 వేల చొప్పున పంచాలంటూ స్థానిక నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పటికే సదరు అభ్యర్థి ఓటర్లకు కుక్కర్లు, చీరలు పెద్దఎత్తున పంపిణీ చేసినట్లు తెలిసింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ఓ ముఖ్య నియోజకవర్గంలో ప్రధాన పార్టీ నేతలు మంగళవారం ఇంటింటికీ కిలో చికెన్‌ పంచేందుకు ఆర్డర్లు ఇచ్చారు.

ప్రాంతం, ఓటర్లను బట్టి లెక్క

ప్రత్యర్థి నుంచి తీవ్రమైన పోటీ ఉన్నచోట్ల అభ్యర్థులు వెనుకాడకుండా ఖర్చు చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థి ఓటుకు రూ.1,000 రూ.1,500 రూ.2,000..మూడు రకాలుగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిపింది. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలోకి వచ్చే ఓ నియోజకవర్గంలో ప్రధాన అభ్యర్థి ఒకరు 2 లక్షల మంది ఓటర్లను లక్ష్యంగా పెట్టుకుని రూ.3 వేల చొప్పున పంచుతున్నట్లు తెలిసింది. మరో ప్రధాన అభ్యర్థి లక్ష-లక్షన్నర మంది ఓటర్లకు రూ.వెయ్యి నుంచి రూ.1500 చొప్పున పంచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. పెద్దపల్లి జిల్లా పరిధిలోని ఓ కీలక నియోజకవర్గంలో తీవ్ర పోటీ ఉంది. దీంతో ఓ ప్రధాన అభ్యర్థి ఓటుకు రూ.3 వేల వరకు పంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.

పర్సులు, వాచీల్లో నోట్లు

ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటుకు నోట్ల పంపిణీలో సరికొత్త కళలు ప్రదర్శిస్తున్నారు. మెట్రో రైలు, ఫ్లైఓవర్లతో రూపురేఖలు మారిన ఓ నియోజకవర్గంలో ప్రధాన అభ్యర్థి ఒకరు ఓటర్లకు పర్సులు పంచిపెట్టారు. అందులో 4 చొప్పున 500 రూపాయల నోట్లు ఉన్నట్లు వీడియోలు వైరలయ్యాయి. హైదరాబాద్‌ శివారు ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఓ నియోజకవర్గంలో ప్రధాన అభ్యర్థి గోడగడియారాలను పంచారు. బ్యాటరీల లోపల ఆరు 500 రూపాయల నోట్లను దాచిపెట్టినట్లు వీడియోలు బయటకు వచ్చాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z