Editorials

అంతర్యామి – వితరణ – విశిష్టత….!!

అంతర్యామి – వితరణ – విశిష్టత….!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ఈ సృష్టిలో విశిష్టమైనది మానవజన్మ.
ఈ జన్మకు సార్థకత చేకూర్చేది వితరణ.

🌸ప్రచారం ఆశించకుండా, స్వపర భేదాలు పాటించకుండా కుడిచేయి చేసే దానాన్ని ఎడమ చేతికి తెలియనివ్వకుండా చేసేదే వితరణ. సహృదయంతో దానమిచ్చేవాడు వదాన్యుడు. అటువంటి గుణం కలవాడే వితరణ శీలి.

🌿దుస్థితిలో ఉన్నవారిని ఆదుకోవాలని రుగ్వేదం బోధిస్తుంది. మనకు ఉన్నదానిలో కొంత, ఆర్తితో ఉన్నవారికి దానం చేయాలని ఉపనిషత్తులు చెబుతున్నాయి.

🌸పాతాళం వరకు లోతుగా తవ్వినా, ఆకాశ మండలంలో సంచరించినా, భూమండలమంతా పరుగులు పెట్టినా దానం చేయకపోతే ఏదీ లభించదు. వందమందిలో ఒక శూరుడుంటాడు.

🌿 వేయి మందిలో ఒక పండితుడు ఉంటాడు. పదివేల మందిలో ఒక ప్రవచనవేత్త ఉంటాడు. కానీ లక్షమందిలో దాత ఒక్కడుండటం కష్టమంటారు పెద్దలు.

🌸అందుకే ‘నీవు ఎంత ఇవ్వగలవో అంత ఇవ్వు’ అని పురాణ గాథలు చెబుతున్నాయి. శిబి చక్రవర్తి ఓ పావురాన్ని రక్షించడానికి తన శరీరంలోని మాంసఖండాన్ని కోసి డేగకు సమర్పించాడు.

🌿యుద్ధభూమిలో పడి ఉన్న కర్ణుడు మారువేషధారులై వచ్చిన కృష్ణార్జునులకు తన బంగారు దంతాలు పెరికి ఇస్తాడు. అందుకే అతడు మహాదాతలా పేరు పొందాడు.

🌸 ‘అర్థులమై వచ్చాం… ఆదరించు’ అని ఇంద్రాగ్ని యమ   వరుణులు నల చక్రవర్తి దగ్గరికి వెళ్ళగానే అతడు పులకించి ఏది కావాలన్నా ఇస్తానన్నాడు. అందుకే దానం చేసే వ్యక్తిని దేవుడిగా భావిస్తారెందరో.

🌿యజ్ఞం, వేదాధ్యయనం, తపస్సు అనే సుగుణాల పక్కన దానం అనే మహాగుణాన్నీ మహనీయులు చేర్చారు. అంటే వితరణ ఎంతటి మహోన్నతమైనదో అర్థం చేసుకోవచ్చు.

🌸దీనజనులు ఎవరైనా ఆర్తితో, ఆవేదనతో ‘దేహీ’ అని అడిగినప్పుడు ఉన్నంతలో కొంత వాళ్ళకివ్వాలి. అడిగిన వెంటనే ఇచ్చేదే అసలైన దానం. ఎవరికి ఏది ఇచ్చినా మంచి మనసుతో, సద్భావనతో ఇవ్వాలి.

🌿దానం చేసేటప్పుడు గర్వం,  అహంకారం ఉండకూడదు. అట్టహాసం లేకుండా చేసేదే అత్యుత్తమ దానం.
అన్నింటా తానే గొప్పవాడనుకున్న మనిషికన్నా నోరులేని జీవాలు, అచరాలైన చెట్లు చేమలే దానగుణంలో పైచేయిగా ఉన్నాయంటారు మహాకవి జాషువా.

🌸‘బతికినన్నాళ్ళు ఫలములిచ్చుట కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు త్యాగ భావమునకు తరువులే గురువులు’ అని వృక్షాల త్యాగం గురించి బోధిస్తారు తెలుగు బాల శతక కర్త.

🌿సముద్రం నుంచి జలాన్ని గ్రహించి తీయటి వర్షం మనకు సమర్పించే మేఘుడు, నిరంతరం ప్రాణికోటికి వెలుగులు పంచే సూర్యచంద్రులు, విత్తనాలను తన గర్భంలో పొదిగి ఫలాలిచ్చే పచ్చని మొక్కలుగా మనకందించే మట్టితల్లి… ఇలా ప్రకృతి మొత్తం దానగుణంతో ప్రాణికోటికి సేవ చేస్తోంది.

🌸దానశీలి భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రుడు. ముక్కంటికి ముద్దుబిడ్డడు. సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరచాలంటే దానం చేయాలి.

🌿దానం చేస్తే ధనం తరిగిపోదు. అది పుణ్యఫలాలతో పెరుగుతుంది. ఎవరికి ఏది దానం చేసినా శ్రద్ధతో, వినయంతో దానమివ్వాలి. దానగుణం వల్ల మనిషి మనసు నిర్మలమవుతుంది.

🌸 స్వార్థరాహిత్యంతో కూడిన దానం మనిషిని ధార్మికత్వం వైపు నడిపిస్తుంది. ఆ మనిషి వసంత రుతువులా  లోకానికి సర్వహితం చేస్తూ జీవించి తరిస్తాడు!..స్వస్తీ…🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿