Politics

అమిత్ షాతో ఆదివారం రాత్రి ఏపీ సిఎం భేటీ…

అమిత్ షాతో ఆదివారం రాత్రి ఏపీ సిఎం…

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. తాజాగా ఆయన హోం మంత్రి అమిత్ షా తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా విభజన చట్టం హామీల అమలుకోసం మరోసారి జగన్ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం రాత్రి 10 గంటల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు జగన్. 40నిమిషాల సేపు ఈ సుదీర్ఘ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు త్వరగా కేంద్రం ఆమోదం తెలిపేలా చూడాలని జగన్ కోరారు. దీనికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం త్వరగా లభించేలా చూడాలన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ సహా, విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, 10లోని ఆస్తుల విభజనపై కూడా అమిత్‌ షాతో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి విద్యుత్తు బకాయిలు ఇప్పించ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. టీడీపీ అనుకూల మీడియా ఏం చెప్పిందంటే..? సహజంగా జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఆయన కేసుల విషయాన్ని ప్రస్తావిస్తూ, కేంద్రం దగ్గర ఆయన రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నట్టు టీడీపీ అనుకూల మీడియాలో వార్తలొస్తుంటాయి. ఈసారి కూడా అలాంటి ప్రచారమే జరిగింది. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రావాల్సిన సందర్భంలో అమిత్ షా తో జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని టీడీపీ అనుకూల మీడియా వ్యాఖ్యానించింది.