WorldWonders

ఇది నిజంగా మూగవారికి ఒక వరం!

ఇది నిజంగా మూగవారికి ఒక వరం!

అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) విద్యార్థి అద్భుతాన్ని ఆవిష్కరించారు. నోరు కదపకుండానే ఇతరులతో మాట్లాడుకునే ఓ పరికరాన్ని అతను కనుగొన్నారు. మనుషులతో పాటు మెషిన్లు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పని చేసే టూల్స్‌, ఏఐ అసిస్టెంట్‌తోనూ దీని సాయంతో సంభాషించవచ్చు. ఈ పరికరం సాయంతో మనుషులు తమ నోటిని తెరవకుండా, కదపకుండా మాట్లాడుకోవచ్చు. కనీసం చేతి సైగలు కూడా చేయనవసరం లేదు. అంతర్గతంగా నోట్లో ఉచ్చరించే పదాలను ఇది ఇతరులకు చేరవేస్తుంది. ఆల్టర్‌ఈగో అనే ఈ పరికరాన్ని ఎంఐటీలో చదివే ఢిల్లీకి చెందిన అర్ణవ్‌ కపూర్‌ ఆవిష్కరించారు.

నాడీ సంకేతాలను గ్రహించి…ఎంఐటీ మీడియా ల్యాబ్స్‌ వెబ్‌సైట్‌ దీని గురించి వెల్లడించింది. ఈ పరికరాన్ని ధరించిన వ్యక్తి అంతర్గతంగా ఉచ్చరించినప్పుడు అతని నాడీ సంకేతాలను ఇది గ్రహిస్తుంది. తద్వారా అతను అంతర్గతంగా ఉచ్చరించే పదాలను అవతలి వారికి ఇది చేరవేస్తుంది. ఈ పరికరాన్ని ధరించి కపూర్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీడియో వైరల్‌గా మారింది. వినియోగదారుని గోప్యతను కాపాడుతూనే ఈ పరికరం ఒకరి నుంచి మరొకరికి మాటలను చేరవేస్తుందని ఎంఐటీ తెలిపింది. బధిరులకు ఈ పరికరం ఉపయోగపడుతుందని పేర్కొంది. మాటలు రాని వారికి ఆల్టర్‌ఈగో ద్వారా సాయం చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని ఎంఐటీ వెబ్‌సైట్‌ తెలిపింది. నాడీ సంబంధిత వ్యాధులైన అమియోట్రోఫ్రిక్‌ లెటరర్‌ స్లెరోసిస్‌, మల్టీపుల్‌ స్లెరోసిస్‌తో బాధపడుతున్న వారు సైతం ఇతరులతో సంభాషించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపింది.