Health

వర్షాకాలంలో కళ్ల కలక ఎందుకు వస్తుంది?

వర్షాకాలంలో కళ్ల కలక ఎందుకు వస్తుంది?

వర్షాలు కుమ్మేస్తున్నాయి. మబ్బులు పట్టిన వాతావరణం చాలా మందికి ఆహ్లాదాన్ని పంచుతోంది. అదే సమయంలో విసుగును తెప్పిస్తుంది. మరో వైపు సీజనల్ వ్యాధులను వ్యాపింపజేస్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది ఓ వ్యాధి బారిన అధికంగా పడుతున్నారు. ఎర్రగా మారిన కళ్లతో ఆస్పత్రులకు చేరుతున్నారు. దీనికి ప్రధాన కారణం వాతావరణమే. అధిక తేమతో కూడిన వాతావరణంతో కళ్లు ఇన్ ఫెక్షన్స్ బారిన పడుతున్నాయి. దీనిని వైద్య పరిభాషలో కండ్లకలక(కంజెక్టివైటీస్‌) అని పిలుస్తారు. లేదా పింక్ ఐస్ అంటారు. ఇది ప్రతి ఏడాది వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధుల తర్వాత అధికంగా వ్యాప్తి చెందే వ్యాధి. కొన్ని రిపోర్టుల ఆధారంగా పూణే నగరంలో ఐదు రోజుల వ్యవధిలో దాదాపు 2,000 మందికి పైగా కండ్ల కలక సమస్యతో ఆస్పత్రుల్లో చేరినట్లు చెబుతున్నారు. అలాగే ఢిల్లీలో కూడా గతేడాది కంటే మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఈ కండ్ల కలక వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. ఎడతెగని వర్షం, అధిక తేమతో కూడిన వాతావరణం ఇలాంటి అంటు వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి.

సాధారణంగా వ్యక్తుల ముక్కు, సైనస్ లలో నివసించే బ్యాక్టీరియా కారణంగా ఈ కండ్ల కలక వ్యాప్తి చెందుతుంది. వర్షాకాలంలో గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్ లకు వాహకంలా పనిచేస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా ప్రయాణించడానికి ఉపకరిస్తుంది. ఈ బ్యాక్టీరియా, వైరస్ లా కారణంగా వ్యాపించే కండ్ల కలక అంటు వ్యాధి. ఇది సోకినప్పుడు కళ్ల చుట్టూ ఎరుపు, నీరు, దురద, గుచ్చుకోవడం, నొప్పి, వాపు వంటివి సాధారణంగా కనిపిస్తాయి. కండ్లకలక ఉన్న చాలా మంది రోగులు కొంత వైరల్ జలుబు, దగ్గు, జ్వరంతో కూడా బాధపడుతూ ఉంటారు. అయితే మరోరకమైన కండ్ల కలక కూడా ఉంది. ఇది పుప్పొడి, సిగరెట్ పొగ, పూల్ క్లోరిన్, కారు పొగలు, వాతావరణంలో మరేదైనా ప్రతి చర్య కారణంగా అలెర్జీ వచ్చి కండ్ల కలక రావొచ్చు. ఇది అంటు వ్యాధి కాదు. ఈ తరహా కండ్ల కలక కూడా పై చెప్పిన లక్షణాలను చూపిస్తుంది. మీ కళ్లు దురదగా, ఎర్రగా, నీరు ఎక్కువ కారుతూ కనిపిస్తుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరి వ్యాపించదు.మీరు ఒకవేళ బ్యాక్టీరియా, వైరస్ల వల్ల కండ్ల కలక వస్తే మీరు జాగ్రత్త పడాలి. మీ నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి వేరే వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఇది మరింత వ్యాప్తి చెందకుండా, నివారించేందుకు పలు సూచనలు నిపుణులు అందిస్తున్నారు. అవేంటో చూద్దాం రండి..