Politics

ప్రజలకిచ్చిన మాట తప్పిన జగన్ ప్రజాద్రోహి కాదా?

ప్రజలకిచ్చిన మాట తప్పిన జగన్ ప్రజాద్రోహి కాదా?

ముఖ్యమంత్రిని ప్రజాప్రతినిధులు ప్రశ్నించవద్దా? జీ హుజూర్ అని అనాలా??

ఒక సాధారణ ఎమ్మెల్యే ఎవరైనా సరే…ముఖ్యమంత్రి కావచ్చునని జగన్ తెలుసుకోవాలి

ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ మానేస్తే మంచిది

పార్లమెంటులో చట్టం చేయకుండా రాజధాని మార్పు అసాధ్యమని గ్రహించిన మాజీ మంత్రి

దుష్టులతో అతి సావాసం అదానీ వంటి వారికి మంచిది కాదు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకున్న ప్రతిసారి, ప్రజా ప్రతినిధులంతా ఆయన చెప్పినట్టు నడుచుకోకుండా … తానా అంటే తందానా అనకపోతే పార్టీ ద్రోహులయితే, ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రజాద్రోహి కాదా? అంటూ
నరసాపురం ఎంపీ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే మధ్య నిషేధం అమలు చేస్తామని చెప్పి, మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ… అమ్మకాలు తగ్గితే అధికారులను తిట్టడాన్ని ఏమంటారని నిలదీశారు. అమరావతియే రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత , ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తానంటే , ప్రజా ప్రతినిధులు ప్రశ్నించవద్దా?, మీరు చెప్పిన దాని కల్లా జీ హుజూర్ అని అనాలా?? అంటూ రఘు రామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు . ఆత్మగౌరవం కలిగి అవమానాలను ఇన్నాళ్లు దిగమింగుకుంటూ ఉన్నవాళ్లంతా తిరగబడే రోజులు మొదలయ్యాయన్నారు. నెల్లూరు జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులతో ఇది ప్రారంభం అయ్యిందని, మన నడవడిక ప్రవర్తన మార్చుకోకపోతే మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరించారు. గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘు రామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులపై గుర్రం, గాడిదలతో కామెంట్లు చేయించడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సర్దుకోగలిగితే, సర్దుకోవాలని అంతేగాని లిల్లీపుట్ గాళ్ళతో విమర్శలు చేయిస్తారా అని మండిపడ్డారు. ఇదే విధానం కొనసాగితే మన గౌరవాన్ని మనమే తగ్గించుకున్న వారమవుతామని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

సీఎం తన వైఖరి మార్చుకుంటే… ప్రజా ప్రతినిధులంతా మార్చుకోవాలా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకున్నారని ప్రజా ప్రతినిధులంతా తమ వైఖరిని మార్చుకోవాలా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులంతా ఏమైనా ఆయనకు బానిసలా? అని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు తామిచ్చిన మాటను గౌరవించి వారు ఓట్లు వేసి గెలిపించిన తర్వాత నాయకుడు తన వైఖరిని మార్చుకున్నాడని … ప్రజా ప్రతినిధులంతా కూడా తమ వైఖరిని మార్చుకోవాలా?. మూడేళ్ల క్రితం తాను ఈ విధంగా ప్రశ్నించినందుకే తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారు. అమరావతియే రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చాం. అమరావతియే రాజధానిగా ఉండాలి. లేకపోతే రైతులకు అన్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పినప్పటికీ, అమరావతిలో ఇల్లు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డినే విశ్వసించాలని మేమందరం నినదించాం. ఇప్పుడు ముఖ్యమంత్రి తన వైఖరిని మార్చుకుంటే, తమ మాటలను విశ్వసించి ఓట్లు వేసిన ప్రజల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తమ వైఖరిని మార్చుకుని ఆయనకు బానిసల మాదిరిగా వ్యవహరించాలా అంటూ రఘురామ కృష్ణంరాజు సూటిగా ప్రశ్నించారు. గతంలో తాను ముఖ్యమంత్రితో విభేదించినప్పుడు , కొంతమంది చిల్లర రాజులతో తనపై విమర్శలు చేయించారు. వారిని భయపెట్టో, బ్రతిమాలో తనకు వ్యతిరేకంగా పత్రికల్లో స్టేట్మెంట్లు ఇప్పించారు. నెల్లూరు జిల్లాలో తిరగబడ్డ ముగ్గురు పంట రెడ్లకు వ్యతిరేకంగా దమ్ముంటే అదే సామాజిక వర్గానికి చెందిన వారి చేత విమర్శలు చేయించాలి. తనకు వ్యతిరేకంగా తన సామాజిక వర్గం వారి చేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఆయన సామాజిక వర్గం వారి చేత విమర్శలు చేయిస్తున్న తమ పార్టీ పెద్దలు, ఇప్పుడు పంట రెడ్లకు వ్యతిరేకంగా పంట రెడ్ల చేత విమర్శలు చేయించాలని, అప్పుడు ఎన్నో గుట్టుమట్లు బయటపడతాయని రఘురామకృష్ణం రాజు సవాల్ చేశారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తుంటే, రాష్ట్రంలో మాత్రం 38 వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాల లావాదేవీలు
నగదు ద్వారానే నిర్వహించడం విడ్డూరం. జన్ ధన్ ఖాతాలను తెరవమని ఒకవైపు ప్రధానమంత్రి చెబుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, జన్ ధన్ ఖాతాలు తెరిచి పింఛన్ సొమ్ము జమ చేయడంలేదు. కేవలం నగదు చెల్లింపులు చేస్తోంది. దీని ద్వారా ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడ అంటూ రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

మీ ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే… మా ఆత్మగౌరవాన్ని కాపాడండి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలంటే, ప్రజాప్రతినిధుల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ లను రాష్ట్ర ప్రభుత్వం మానివేస్తే మంచిది. ప్రజా ప్రతినిధుల ప్రైవసీని హరించడం అంత మంచిది కాదు. ఫోన్ టాపింగ్ వ్యవహారంపై కొంతమంది మంత్రులు తమ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. పోలీసు అధికారులు తమ పరిధిలో తాము ఉండాలి. ఎమ్మెల్యేలు ఏమైనా తప్పులు చేసి ఉంటే పార్టీ అధ్యక్షుడు హోదాలో జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడాలి. అలాగే మంత్రులు ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే ముఖ్యమంత్రి హోదాలో జగన్ మాట్లాడవచ్చు. అంతేకానీ పోలీసు అధికారులు మాట్లాడడం ఏమిటి?. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులకు పోలీసులు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రశ్నించారు.

పార్లమెంటులో చట్టం ద్వారానే రాజధాని మార్పు సాధ్యం

పార్లమెంట్ లో చట్టం ద్వారానే రాజధాని మార్పు సాధ్యమనేది మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని గ్రహించారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే, రానున్న ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాలను, 25 పార్లమెంటు స్థానాలను గెలుచుకొని కేంద్రంలోని బిజెపిని జుట్టు పట్టుకొని మరి పార్లమెంట్లో బిల్లు పెట్టించి, విశాఖను రాజధానిగా చేస్తామని పేర్కొనడం పరిశీలిస్తే, ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యామని చెప్పే వారి కంటే అంత పెద్దగా చదువుకొని కొడాలి నాని కి పార్లమెంటులో చట్టం చేయకుండా, ఒకసారి చేసిన చట్టాన్ని కోర్టులు కూడా ఏమి చేయలేవని గ్రహించారని అర్థమవుతుందని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి న్యాయ సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది . లడ్డు ప్రసాదం అందజేసి న్యాయమూర్తులను ప్రభావితం చేయగలనని ఆయన భావిస్తున్నారా? అంటూ నిలదీశారు. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పు శిరోధార్యం. రాజధాని గురించి వ్యాఖ్యలు చేయడం అంటే, హైకోర్టుపై కామెంట్లు చేసినట్టే.. ఈ విషయం ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. వాళ్లకు అర్థమైంది అన్న విషయం తమ పార్టీ పెద్దలకే అర్థం కావడం లేదు. తమకు అనుకూలమైన టీవీ చానల్స్ ద్వారా సుప్రీంకోర్టులో ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న కేసు పై తప్పుడు కథనాలు ప్రసారం చేయించడం దుర్మార్గం. తాను దాఖలు చేసిన కస్టోడియల్ టార్చర్ పిటిషన్ బుధవారం ఒకటవ తేదీన విచారణకు వచ్చింది. కానీ అదే సమయానికి తన తరపున వాదించే సీనియర్ న్యాయవాది అందుబాటులో లేరు. ఈ నెల 8వ తేదీకి కేసు విచారణ వాయిదా వేయాలని కోరాము. న్యాయమూర్తి అంగీకరించి, ఈ నెల 8వ తేదీన వాయిదా వేశారు. ఏపీ సిఐడి మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ గోల్ఫ్ ఆడడానికి సెలవు పై వెళ్ళాడు .. ఇక విజయ్ పాల్ సేవలు సరిపోయాయని, ఇంట్లో కూర్చోమని ప్రభుత్వం ఆదేశించినట్లుగా తనకు సమాచారం అందిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

విభేదించిన ఎమ్మెల్యేకు సెక్యూరిటీ తగ్గిస్తారా?

ఎమ్మెల్యేలు ఎవరైనా విభేదిస్తే వారికి సెక్యూరిటీని తగ్గించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించడం ఏమిటని రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు . ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ కల్పించడం అన్నది కామన్ ఫ్రోటో కాల్. మీతో విభేదించినంత మాత్రాన, సెక్యూరిటీని తగ్గించి… ఆ ఎమ్మెల్యేను గౌరవించవద్దంటూ అధికారులను ఆదేశిస్తారా?. నియంతృత్వానికి రోజులు చెల్లాయి. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాము. నియంతృత్వ పోకడలు పోతే ప్రజా ప్రతినిధులు సహించరు. అధికార భయంతో ప్రజలు భయపడితే కొన్నాళ్లు భయపడి ఉండవచ్చు. వారు తమ ప్రతాపాన్ని ఎక్కడ చూపించాలో అక్కడే చూపిస్తారు. మారాల్సింది మనమే, మారకపోతే మార్చి వేస్తారు. ఏమి మార్చివేస్తారన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది. సాధారణ ఎమ్మెల్యే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే మంచిదని ఈ పార్టీలో కొనసాగుతున్న వ్యక్తిగా హితవు చెబుతున్నానని తెలిపారు.

ఈవీవీ సినిమాలో ఐరన్ లెగ్ పాత్ర వంటిదే జగన్ పాదం

ప్రముఖ తెలుగు హాస్య దర్శకుడు ఈ వీ వీ సత్యనారాయణ రూపొందించిన ఒక చిత్రంలోని ఐరన్ లెగ్ పాత్ర వంటిదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదమని రఘు రామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. అదానీ అంచలంచలుగా ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. జగన్మోహన్ రెడ్డి తో సంబంధ బాంధవ్యాలు ఎక్కువ అయిన తర్వాత అదానీ కంపెనీ షేర్లు కుప్పకూలిపోయాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి కంపెనీలలో పెట్టుబడులు పెట్టినవారు సిబిఐ విచారణను ఎదుర్కోవలసి వచ్చింది. ఇక రాష్ట్రంలో సారా వ్యాపారంలోకి ప్రవేశించిన అరబిందో ప్రమోటర్ సైతం జైలుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ స్థాయి వ్యక్తులకు, జగన్ తో పరిచయం వల్లే ఇటువంటి దుస్థితి నెలకొంది. జగన్మోహన్ రెడ్డి తో సమావేశం అనంతరం బైజూస్ సంస్థ కర్మ కాలిపోయింది. అంచలంచలుగా దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఎదిగిన అదానీ, ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువగా ప్రాజెక్టులు తీసుకోవడం వల్లే ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొంటున్నారని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో స్నేహమే అతని కొంపముంచింది. రాష్ట్రంలో పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులను గ్రీన్ కో తో పాటు చిన్న కంపెనీ అయిన నర్రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి కంపెనీకి, అదానీలకు మాత్రమే కేటాయించారు. మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నర్రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి కంపెనీకి, అదానీలకు ముఖ్యమంత్రి తాకట్టు పెట్టారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

ఒక్క మెగావాట్ విద్యుత్ పంపిణీ కి కోటిన్నర రూపాయల వరకు ఖర్చు

పంపుడ్ స్టోరేజ్ విధానములో ఒక్క మెగావాట్ విద్యుత్ ట్రాన్స్ మిషన్ కు కోటిన్నర రూపాయలు ఖర్చవుతుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. కాశ్మీర్ లోని లద్ధాక్ ప్రాంతంలో పదిహేను వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి ట్రాన్స్మిషన్ మెయిల్ లైన్ కు లింక్ చేయడానికి గాను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 20, 000 కోట్ల రూపాయలు కేటాయించింది.. ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే 20000 నుంచి 30 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని, పంపుడ్ స్టోరేజ్ విధానము ద్వారా ఉత్పత్తి చేయడం అసాధ్యం. రాష్ట్ర ప్రభుత్వం వద్ద దమ్మిడి లేదు. మౌలిక వసతుల కల్పన కోసం రూపాయ ఖర్చు చేసేందుకు ఖజానాలో నిధులు లేవు. అయినా 20 నుంచి 30 వేల మెగా వాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసేందుకు ఒప్పందాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఐదారు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే నేరుగా పిపిఏలు చేసుకోవచ్చు. ఈ విషయమై నిష్ణాతులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోకుండా, అన్నీ తమకే తెలుసు అన్నట్లు ప్రభుత్వ పెద్దలు వ్యవహరించడం మూర్ఖత్వం. ఒప్పందాలను చేసుకొని సొమ్ములు కొట్టేయాలన్న దురాలోచన తప్పితే, ఇందులో దూరాలోచన ఉన్నట్లు కనిపించడం లేదు. ఒక పారిశ్రామికవేత్త పెట్టుబడి పెట్టిన తరువాత డబ్బులు తిరిగి రాకపోతే అతని మానసిక పరిస్థితి ఎంత అలజడి గా ఉంటుందో తనకంటే మరొకరికి ఎక్కువ తెలియదు. అయినా అదా నీ లాగా రాష్ట్ర ప్రభుత్వంతో ఎవరు కూడా అతి చనువుగా ఉండవద్దు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఒక మూర్ఖురాలు. తాను అప్పుడు న్యాయం కోసం పోరాడితే, ఇక్కడ ఈ మూర్ఖుడు పిలిపించి లాకప్పులో చిత్రహింసలకు గురిచేశాడు. పారిశ్రామికవేత్తలకు కష్టాలు వస్తాయి అయినా దుష్టులతో సావాసం అంత మంచిది కాదు. జగన్ లాంటి ఐరన్ లెగ్ వ్యక్తితో కాస్త దూరంగా ఉండడమే అదా నీకి అన్ని విధాలుగా మంచిది అని రఘురామకృష్ణంరాజు సూచించారు.

సినిమా డైలాగులు ఇకనైనా మానండి

సింహం సింగిల్ గా వస్తుంది… తోడేళ్లే గుంపుగా వస్తాయని తరచూ తమ పార్టీ నాయకులు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు మంత్రులు ఈ తరహా వ్యాఖ్యలు చేసే వారని, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఏదో సినిమాలో రజినీకాంత్ ఆ డైలాగు చెబితే బాగుందని, కానీ తమ పార్టీ వాళ్లు చెబుతుంటే ఎబెట్టుగా ఉంటుంది. ఇప్పటికైనా సినిమా డైలాగులు చెబుతూ జబ్బలు చర్చుకోవటం మానాలి. లేకపోతే ప్రజలంతా గుంపుగా మారి సింహాన్ని తరిమి కొడతారని, సింహాల గుంపును అడవి దున్నలు ఏకమై తరిమి కొట్టిన వీడియోను ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు.