DailyDose

మహిళా IAS గృహానికి వెళ్లి వేధించిన యువకుడు-నేరవార్తలు

మహిళా IAS గృహానికి వెళ్లి వేధించిన యువకుడు-నేరవార్తలు

* నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరులో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో నలుగురు పిల్లలను ఓ తల్లి కాల్వలో పడేసింది. ఈ ఘటనలో చిన్నారులు మహాలక్ష్మి (5), చరిత (4), మంజుల (3) మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 7 నెలల బాలుడు మార్కండేయ ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* సంక్రాంతి రైళ్లు అప్పుడే నిండిపోయాయి. పండక్కి ఇంకా నాలుగు నెలలు ఉందనగా పలు రైళ్లలో అప్పుడే వెయిటింగ్‌ లిస్ట్‌ (WL) జాబితా దర్శనమిస్తోంది. కొన్ని రైళ్లలో అయితే అప్పుడే ‘రిగ్రెట్‌’ (REGRET) అని కూడా చూపిస్తోంది. ముఖ్యంగా సికింద్రాబాద్‌ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మీదుగా వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. రైలు టికెట్లను 120 రోజుల ముందుగా బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉండడంతో టికెట్లు అందుబాటులోకి రాగానే హాట్‌ కేకుల్లా అమ్ముడైపోయాయి. దీంతో రైల్వే శాఖ నడిపే ప్రత్యేక రైళ్లు, ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు నడిపే ప్రత్యేక బస్సులు, ప్రైవేటు వాహనాలే ఈ సంక్రాంతికి దిక్కు కానున్నాయి.

* నంద్యాల జిల్లా డోన్‌ జాతీయ రహదారిలోని ఓబులాపురం మిట్ట సమీపంలో దాదాపు రూ.1.3కోట్ల విలువైన సెల్‌ఫోన్‌ కంటైనర్‌ను ఇద్దరు డ్రైవర్లు చోరీ చేశారు. ఈ నెల 11న జరిగిన ఈ చోరీ తాజాగా వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్ల లోడుతో హరియాణా నుంచి బెంగళూరు వెళ్తున్న కంటైనర్‌ను రోడ్డు పక్కనే ఆపిన డ్రైవర్లు.. అందులోని సెల్‌ఫోన్లను మరొక వాహనంలోకి మార్చేసి.. కంటైనర్‌ను అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. నాగాలాండ్‌కు చెందిన కంటైనర్‌ యజమాని డోన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న డోన్‌ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు హరియాణాకు ప్రత్యేక బృందాన్ని పంపారు.

* జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో నివాసముండే ఓ మహిళా ఐఏఎస్‌ అధికారికి వేధింపులు ఎదురైన ఘటన మరిచిపోక ముందే మరో మహిళా ఐఏఎస్‌కు వేధింపుల ఉదంతం బహిర్గతం కావడం కలకలం రేపింది. సికింద్రాబాద్‌ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ విభాగం సంచాలకురాలిగా ఉన్న ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ మేరకు శివప్రసాద్‌ అనే వ్యక్తిపై మార్కెట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 354 డి సెక్షన్‌ చట్టం కింద గురువారం కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. శివప్రసాద్‌ కొంతకాలంగా తరచూ మహిళా ఐఏఎస్‌ను కలిసేందుకు ఆమె కార్యాలయానికి వస్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఆగస్టు 22న సైతం కార్యాలయానికి వెళ్లాడు. ‘నేను మేడమ్‌కు పెద్ద అభిమానిని, సామాజిక మాధ్యమాల్లో ఆమెను నిత్యం అనుసరిస్తుంటా’ అని చెప్పుకొచ్చాడు. తరచూ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కార్యాలయానికి వస్తుండడంతో విషయం తెలుసుకున్న మహిళా ఐఏఎస్‌ శివప్రసాద్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలకి పంపొద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో శివప్రసాద్‌ మహిళా ఐఏఎస్‌ అధికారి ఇంటి చిరునామా తెలుసుకుని గత బుధవారం నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు. కాలింగ్‌బెల్‌ నొక్కడంతో బయటికి వచ్చిన సిబ్బందితో మేడమ్‌ను కలవాలని చెప్పాడు. స్వీట్‌బాక్స్‌ ఇచ్చి మేడంకు ఇవ్వాలని కోరాడు. తిరస్కరించిన సిబ్బంది అతడిని అక్కడినుంచి పంపించివేశారు. ఇలా తరచూ వేధింపులు ఎదురవుతుండడంతో మహిళా ఐఏఎస్‌ అధికారి కార్యాలయ అదనపు సంచాలకుడు గురువారం మార్కెట్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

* తల్లి మరణించడంతో అందిన బీమా సొమ్ములో వాటా కోసం ముగ్గురు సోదరుల మధ్య ఫైట్ జరిగింది. (Brothers Fight) ఈ కోట్లాటలో తీవ్రంగా గాయపడిన తమ్ముడు చనిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ్‌ తోలా ప్రాంతానికి చెందిన రామ్‌రాణి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్‌కు సంబంధించిన రూ.2 లక్షలు పెద్ద కుమారుడు రాజబహదూర్ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. కాగా, తల్లి చనిపోవడంతో అందిన బీమా సొమ్ములో వాటా కోసం ముగ్గురు సోదరుల మధ్య వాగ్వాదం జరుగుతున్నది. ఇది మరింత ముదరడంతో గురువారం రాత్రి ముగ్గురు అన్నాదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారు కర్రలతో కొట్టుకున్నారు. కనిష్ట సోదరుడైన 45 ఏండ్ల రామ్ ఆస్రే ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ నేపథ్యంలో అతడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు అన్నలపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారిద్దరి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

* జిల్లాలోని ఇనుగుర్తి బాలిక‌ల‌ సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక అటెండర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం చోటు చేసుకోగా, విష‌యాన్ని బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా ప్రిన్సిపాల్ జాగ్ర‌త్త ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇనుగుర్తి బాలిక‌ల సాంఘిక సంక్షేమ హాస్ట‌ల్‌లో స్వ‌రూప అనే మ‌హిళ అటెండ‌ర్‌గా ప‌ని చేస్తోంది. అయితే ఆమెకు ఓవర్ డ్యూటీలు వేయడం, వ్యక్తిగత పనులు చేయించుకోవడం, అనారోగ్యంతో ఉన్నా సెలవు కావాలంటే ఇవ్వకుండా ఒత్తిడికి గురి చేయడం లాంటి వేధింపులకు ప్రిన్సిపాల్ పాల్ప‌డ్డారు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధితురాలు శుక్ర‌వారం విష‌గుళికలు మింగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఆమె ప్ర‌స్తుతం తొర్రూరులోని ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో కుటుంబ స‌భ్యులు చేర్పించి, చికిత్స చేయిస్తున్నారు. ప్రిన్సిపాల్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు స్వ‌రూప కుటుంబ స‌భ్యులు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.